సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, దాని నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలకు ప్రాజెక్టు అధికారులు రూ.1,182కోట్లతో సిద్ధం చేశారు. గత అంచనాలతో పోలిస్తే రూ.290 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, దీన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు.
6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట..
నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ఈ పనిని మూడు రీచ్‌లుగా విడగొట్టగా, రీచ్–2లో మట్టి సమస్య నెలకొంది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరం పడనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు అధికారులు తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో దీనికయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేశారు. రూ.1,182కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సీనరేజీ చార్జీలు, కరెంట్ లైన్లు, రోడ్ల నిర్మాణం, గత అంచనాల సవరణల కారణంగా తొలి అంచనాతో పోలిస్తే రూ.290 కోట్లు మేర పెరుగుతుందని లెక్కగట్టారు.
ఇప్పటికే ‘తెహ్రీ’ఈడీ సందర్శన
ఇక నార్లాపూర్‌లో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై సహకారం అందించేందుకు తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ ఈ మేరకు అధికారులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఒకమారు రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. తెహ్రీ డ్యామ్ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించి, వాటిని అధిగమించేందుకు జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను అధికారులతో పంచుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్ చేసినట్లు, అదే తరహాలో ఇక్కడా నిర్మాణాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. ఆయన సూచనల నేపథ్యంలోనే ప్రభుత్వం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో పూర్తిగా కొత్తదే అయినా దానివైపే మొగ్గుచూపింది.
‘నార్లాపూర్’ కొత్త అంచనా రూ.1,182 కోట్లు
Published Mon, Apr 15 2019 2:38 AM | Last Updated on Mon, Apr 15 2019 2:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment