Rock Fill Dam
-
‘నార్లాపూర్’ కొత్త అంచనా రూ.1,182 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్‌లో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కొత్త అంచనాలు సిద్ధమయ్యాయి. రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలన్న ప్రతిపాదనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, దాని నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలకు ప్రాజెక్టు అధికారులు రూ.1,182కోట్లతో సిద్ధం చేశారు. గత అంచనాలతో పోలిస్తే రూ.290 కోట్ల మేర వ్యయం పెరగనుండగా, దీన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట.. నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి 6.64 కిలోమీటర్ల మేర మట్టికట్ట నిర్మించాల్సి ఉంది. ఈ పనిని మూడు రీచ్‌లుగా విడగొట్టగా, రీచ్–2లో మట్టి సమస్య నెలకొంది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరం పడనుంది. అయితే రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు అధికారులు తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అసెంబ్లీ ఎన్నికలకు ముందే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే దీనిపై ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో దీనికయ్యే వ్యయ అంచనాలు సిద్ధం చేశారు. రూ.1,182కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సీనరేజీ చార్జీలు, కరెంట్ లైన్లు, రోడ్ల నిర్మాణం, గత అంచనాల సవరణల కారణంగా తొలి అంచనాతో పోలిస్తే రూ.290 కోట్లు మేర పెరుగుతుందని లెక్కగట్టారు. ఇప్పటికే ‘తెహ్రీ’ఈడీ సందర్శన ఇక నార్లాపూర్‌లో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక అంశాలపై సహకారం అందించేందుకు తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ ఈ మేరకు అధికారులకు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆయన ఒకమారు రాష్ట్రానికి వచ్చి ప్రాజెక్టును సందర్శించారు. తెహ్రీ డ్యామ్ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించి, వాటిని అధిగమించేందుకు జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను అధికారులతో పంచుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్ చేసినట్లు, అదే తరహాలో ఇక్కడా నిర్మాణాలకు సహకరిస్తామని హామీనిచ్చారు. ఆయన సూచనల నేపథ్యంలోనే ప్రభుత్వం రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పరిధిలో పూర్తిగా కొత్తదే అయినా దానివైపే మొగ్గుచూపింది. -
రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రతిపాదిస్తున్న రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అవసరమైన డిజైన్, ఇతర సాంకేతిక సలహాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెహ్రీ హైడ్రో పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ వైష్ణోయ్ తెలిపారు. ఈ తరహా డ్యామ్ నిర్మాణ అధ్యయనం కోసం రాష్ట్ర ఇంజనీర్లను మరోమారు తెహ్రీకి పంపించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు లాంటి భారీ ఎత్తిపోతల పథకాలను చేపట్టడం ఒక సాహసోపేతమైన నిర్ణయమని.. ఇక్కడి పరిస్థితులకు ఎత్తిపోతల పథకాలే శరణ్యమని చెప్పారు. భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టడం సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్లాపూర్ రిజర్వాయర్‌లో రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సాగునీటి శాఖ అధ్యయనం జరుపుతున్న సంగతి తెలిసిందే. జలసౌధలో సమావేశం.. గతేడాది ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్మాణమైన తెహ్రీ డ్యాంను సందర్శించి, అక్కడ రాజీవ్ తదితర ఇంజనీర్లతో తెహ్రీ డ్యామ్ డిజైన్, నిర్మాణం తదితర సాంకేతిక అంశాలపై చర్చించారు. తెలంగాణకు వచ్చి తమకు కూడా సాంకేతిక సలహాలు ఇవ్వాలని, రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్లను తమకు అందించాలని కోరారు. రాష్ట్ర ఇంజనీర్ల అభ్యర్థన మేరకు రాజీవ్ వైష్ణోయ్ బుధవారం పాలమూరు ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం గురువారం జలసౌధలో ఇంజనీర్లతో సమావేశమయ్యారు. ఇందులో తెహ్రీ డ్యామ్ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లను వివరించారు. వీటిని అధిగమించడానికి తాము జరిపిన అధ్యయనాలను, డిజైన్ రూపకల్పనలో తీసుకున్న జాగ్రత్తలను వెల్లడించారు. భూకంపాలు తట్టుకునేలా... తెహ్రీ డ్యామ్ నిర్మాణం తలపెట్టిన ప్రాంతం తీవ్రమైన భూకంపాలు సంభవించే ప్రాంత మని రాజీవ్ వైష్ణోయ్ తెలిపారు. తెహ్రీ డ్యామ్ వల్ల నీరు 42 కి.మీ. పొడవున జలాశయంలో 140 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. ఈ భారీ నీటి నిల్వ భూకంపాలకు కారణం అవుతుందని, డ్యామ్ కూలిపోతే దిగువన ఉన్న ఋషికేష్, హరిద్వార్ లాంటి పట్టణాలు నేలమట్టం అవుతాయని, దీన్ని కట్టకూడదని పర్యావరణవేత్తలు ఉద్యమాలు లేవనెత్తారని తెలిపారు. తెహ్రీ డ్యామ్‌పై విమర్శకులు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికి, రిక్టర్ స్కేల్‌పై 9, 10 స్థాయిలో భూకంపాలు వచ్చినా తట్టుకునే విధంగా రాక్‌ఫిల్ డ్యామ్ డిజైన్ చేశామని చెప్పారు. డ్యామ్ నిర్మాణం తర్వాత హిమాలయాల్లో భారీ భూకంపాలు సంభవించినా భూకంపాల ప్రభావాలను తట్టుకుని తెహ్రీ డ్యామ్ నిలిచిందని, ఆశించిన ఫలితాలను అందిస్తోందన్నారు. ఉత్తరాఖండ్ అవసరమైన వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ని సరఫరా చేస్తోందని వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైష్ణోయ్‌కి సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే జ్ఞాపికను బహూకరించి సత్కరించారు. సమావేశంలో పాలమూరు ప్రాజెక్టు సీఈ రమేశ్, సీడీఓ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ రాజశేఖర్‌రెడ్డి, పాలమూరు ఈఈ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
పోలవరం పనులు సబ్ కాంట్రాక్టర్‌కు..!
తొలుత ‘రాక్‌ఫిల్ డ్యాం’ నిర్మాణం.. ♦ దశల వారీగా మిగతా పనులు ♦ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం ♦ భారీగా అంచనా పెంపు.. సీఎం ఆదేశం! ♦ ముడుపుల కోసమేన్న సందేహాలు! సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ‘ట్రాన్స్ట్రాయ్’ నుంచి తీసుకొని సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పోలవరం నిర్మాణ పనులు చేస్తున్న ‘ట్రాన్స్ట్రాయ్’ వ్యవహారంపై బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ భేటీలో చర్చించారు. సబ్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని, కాంట్రాక్టర్ ఎంపిక బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. సబ్ కాంట్రాక్టు వ్యవహారం అంతా సాఫీగా సాగాలని, ‘అవినీతి’ కనిపించని విధం గా ఉత్తర్వులను జాగ్రత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించినట్లు తెలిసింది. అధికార పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టంగా చెప్పినట్లు అధికార వర్గాల సమాచారం. రాక్‌ఫిల్ డ్యాంతో మొదలు..:తొలుత రాక్‌ఫిల్ డ్యాంతో సబ్ కాంట్రాక్టు మొదలుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్ట్రాయ్, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ అంచనా వ్యయం రూ.700 కోట్లు. కాంట్రాక్టు దక్కించుకొని రెండేళ్లు కావస్తున్నా పనుల్లో పెద్దగా పురోగతి లేని విషయం విదితమే. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్న రూ.250 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ మేరకూ పనులు జరగలేదు. ‘కాంట్రాక్టు కట్టబెట్టిన రెండేళ్ల తర్వాత.. ‘ట్రాన్స్ట్రాయ్’కి రాక్‌ఫిల్ డ్యాం నిర్మించిన అనుభవం లేదని ప్రభుత్వం గుర్తించింది. అనుభవం ఉన్న సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈమేరకు సబ్ కాంట్రాక్టు అప్పగిస్తూ త్వరలో ఉత్తర్వులు వెలువడతాయి’ అని పోలవరం పనులు పర్యవేక్షిస్తున్న సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. చైనా కంపెనీకి భాగస్వామ్యం.. రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ పనులు అప్పగించడానికి వీలుగా సీఎం చైనా పర్యటనలో ఒక కంపెనీతో ‘అవగాహన’ కుదుర్చుకున్నారని సమాచారం. స్థానికంగా సీఎంకు ప్రీతిపాత్రమైన కంపెనీ, చైనా కంపెనీతో ‘జాయింట్ వెంచర్’ ఏర్పాటు చేయించడానికి తెర వెనక కసరత్తు పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. కాసులు దండుకోవడానికి.. అంచనా వ్యయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించే సమయంలోనే భారీగా పెంచితే విమర్శలు వస్తాయని, తొలుత కొంతమేర అంచనా వ్యయం పెంచి, దశలవారీగా పెంచుకుంటూ పోతే బాగుంటుందనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందని తెలుస్తోంది. సబ్ కాంట్రాక్టు ఇవ్వనున్న కంపెనీలకు లాభం రావాలని, అదే మేర ప్రభుత్వ పెద్దలకూ అనుకున్నట్లుగా కాసులు రాలాలని, అందుకు అనుగుణంగానే ఉత్తర్వులు ఉంటాయని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికారులంతా గురువారం రాజమండ్రిలోనే ఉన్నారని, శుక్రవారం నుంచి కసరత్తు ప్రారంభమవుతుందని, వచ్చే వారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. ఎన్నో సందేహాలు..: నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రాజెక్టు పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించాలన్న నిర్ణయంతీసుకోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు ఆ పనులను కేంద్రానికే అప్పగించాలి. అందుకు భిన్నంగా పనులను విభజించి సబ్ కాంట్రాక్టర్‌ను తెరమీదకు తేవడంలో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారుతున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.