సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలి రిజర్వాయర్ పనులపై సందిగ్ధత వీడటంలేదు. పనులు మొదలు పెట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయడంలేదు. రిజర్వాయర్ పరిధిలో నెలకొన్న భారీ మట్టి అవసరాలను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలని ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా, ఉన్నతస్థాయిలో ఈ నిర్మాణంపై నిర్ణయం వెలువడకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి.
రాక్‌ఫిల్ డ్యామ్ పరిష్కారం
పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. తొలి రిజర్వాయర్ నార్లాపూర్ పనులను రూ.765 కోట్లతో రెండున్నరేళ్ల కిందటే ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 6.64 కిలోమీటర్ల మేర మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. రీచ్–1, 3లో పనులు వేగంగా జరుగుతుండగా, రీచ్–2లో మట్టి సమస్య ఏర్పడింది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్టనిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరాలున్నాయి.
కానీ, రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత నెలకొనడంతో సమస్య మొదలైంది. మరింత మట్టికై లోతుకు తవ్వితే పలుగురాయి ఎక్కువగా వస్తోంది. ఇతర ప్రాంతం నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.
తెహ్రీడ్యామ్‌లో అమలు చేసినందున దాన్ని పరిశీలించాలని సూచిం చారు. దీంతో తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అంచనాకు వచ్చి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలపై ఇటీవల ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ తరహా విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినా పురోగతి లేదు.
భూసేకరణ నిధులకూ పడిగాపులే..
పాలమూరు ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ నిధులకు నిరీక్షణ తప్పడం లేదు. సేకరణకు తక్షణంగా తొలి ప్రాధాన్యంగా రూ.45 కోట్లు, రెండో ప్రాధాన్యతాక్రమంలో మరో రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నా ఇంతవరకు అధికారులు నిర్ణయం చేయలేదు. ఈ ప్రభావం మొత్తం పనులపై పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment