palmoor project
-
‘నార్లాపూర్’ నిరీక్షణ!
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలి రిజర్వాయర్ పనులపై సందిగ్ధత వీడటంలేదు. పనులు మొదలు పెట్టి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా నార్లాపూర్(అంజనగిరి) రిజర్వాయర్‌లో మట్టికొరతను ఎదుర్కొనే వ్యూహాలను అమలు చేయడంలేదు. రిజర్వాయర్ పరిధిలో నెలకొన్న భారీ మట్టి అవసరాలను ఎదుర్కొనేందుకు ఉత్తరాఖండ్‌లోని తెహ్రీడ్యామ్ తరహాలో రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాలని ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా, ఉన్నతస్థాయిలో ఈ నిర్మాణంపై నిర్ణయం వెలువడకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. రాక్‌ఫిల్ డ్యామ్ పరిష్కారం పాలమూరు ప్రాజెక్టులో నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు ఐదు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. తొలి రిజర్వాయర్ నార్లాపూర్ పనులను రూ.765 కోట్లతో రెండున్నరేళ్ల కిందటే ప్రారంభించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 6.64 కిలోమీటర్ల మేర మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. రీచ్–1, 3లో పనులు వేగంగా జరుగుతుండగా, రీచ్–2లో మట్టి సమస్య ఏర్పడింది. ఇక్కడ ఏకంగా 75 మీటర్ల ఎత్తులో కట్టనిర్మాణం చేయాల్సి ఉండగా, 2.26 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి అవసరాలున్నాయి. కానీ, రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో కేవలం 60 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే మట్టి లభ్యత నెలకొనడంతో సమస్య మొదలైంది. మరింత మట్టికై లోతుకు తవ్వితే పలుగురాయి ఎక్కువగా వస్తోంది. ఇతర ప్రాంతం నుంచి మట్టిని తెప్పించాలని భావించగా, ఖర్చు తడిసి మోపెడవుతోంది. రీచ్–2లో ఏర్పడిన మట్టికొరత సమస్యను అధిగమించడానికి రాక్‌ఫిల్ డ్యామ్ విధానంలో పనులు నిర్వహించాలని అప్పటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. తెహ్రీడ్యామ్లో అమలు చేసినందున దాన్ని పరిశీలించాలని సూచిం చారు. దీంతో తెహ్రీడ్యామ్ పరిశీలించిన ఇంజనీర్లు నార్లాపూర్‌లో ఈ విధానం ఫలితానిస్తుందని అంచనాకు వచ్చి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఈ ప్రతిపాదనలపై ఇటీవల ప్రాజెక్టు సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ తరహా విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినా పురోగతి లేదు. భూసేకరణ నిధులకూ పడిగాపులే.. పాలమూరు ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ నిధులకు నిరీక్షణ తప్పడం లేదు. సేకరణకు తక్షణంగా తొలి ప్రాధాన్యంగా రూ.45 కోట్లు, రెండో ప్రాధాన్యతాక్రమంలో మరో రూ.42 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నా ఇంతవరకు అధికారులు నిర్ణయం చేయలేదు. ఈ ప్రభావం మొత్తం పనులపై పడుతోంది. -
‘పాలమూరు’తో వన్యప్రాణులకు నష్టం లేదు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జరగడం లేదని, ఈ నిర్మాణంతో వన్యప్రాణులకు ఎలాంటి హాని ఉండదని రాష్ట్ర అటవీ శాఖ కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణం అంతా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి అవతలే జరుగుతోందని వివరణ ఇచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టుకు స్టేజ్–1 అటవీ అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పి.కె.ఝా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 205.48 హెక్టార్ల అటవీ భూమి అవసరం అవుతోంది. ఇక ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అంజనగిరి రిజర్వాయర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కి 11.95 కిలోమీటర్ల అవతల ఉంది. బఫర్‌జోన్‌కు సైతం 2.50 కిలోమీటర్లు, ఎకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జెడ్)కు 1.56 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అటవీ భూములకు సంబంధించి అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూలైలో కేంద్ర అటవీ సలహా కమిటీ (ఎఫ్ఏసీ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై విచారించిన ఎఫ్ఏసీ వన్యప్రాణులకు జరిగే నష్టాన్ని తేల్చాల్సిన బాధ్యతను రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించింది. గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, 1980 అటవీ చట్టాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం రక్షిత వన్యప్రాణి ప్రాంతాలకు 10 కిలోమీటర్ల అవతల ఉండాలి. ప్రస్తుతం టైగర్రిజర్వ్కి 11.95 కిలోమీటర్ల అవతలే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొనే స్టేజ్–1 క్లియరెన్స్‌లు ఇవ్వాలని రాష్ట్ర అటవీ శాఖ కేంద్రాన్ని కోరింది. కాళేశ్వరం స్టేజ్–1కు అటవీ అనుమతులు.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి స్టేజ్–1 అటవీ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలో అటవీ సలహా కమిటీ(ఎఫ్ఏసీ) తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ నిశీత్ సక్సేనా రాష్ట్రానికి కేంద్రం నిర్ణయాన్ని తెలియజేస్తూ లేఖ పంపారు. గోదావరి నుంచి 180 టీఎంసీలను మళ్లించేలా 150 టీఎంసీల సామర్థ్యంతో 26 రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80వేల ఎకరాల భూసేకరణ చేయనున్నారు. ఇందులో 3,168.13 హెక్టార్ల మేర అటవీ భూమి జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అవసరం ఉంది. ఎఫ్ఏసీ ముందు వివరణ ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఎఫ్ఏసీ ఎదుట హాజరై అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే భూములు, ఆ భూముల్లో మొక్కల పెంపకం, జంతు సంరక్షణవంటి అంశాలపై రాష్ట్రం వివరణ ఇచ్చింది. అలాగే ఎన్జీటీ కేసును అటవీ భూ సేకరణతో ముడి పెట్టరాదన్న విషయాన్ని ఎఫ్‌ఏసీకి వివరించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎఫ్ఏసీ అటవీ అనుమతులకు అంగీకారం తెలిపింది. కాగా, 3,168 హెక్టార్ల అటవీ భూమిలో 900 హెక్టార్లలో మేడిగడ్డ వద్ద కాల్వల పనులు జరగాల్సి ఉంటుంది. అత్యంత కీలకమైన మేడిగడ్డ నుంచే గోదావరి నీటిని కన్నెపల్లికి ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల, బండపల్లి బ్యారేజ్‌కు నీటిని తరలిస్తారు. ఇక 3,168 హెక్టార్ల అటవీ భూమికి బదులు రాష్ట్ర ప్రభుత్వం 3,400 హెక్టార్ల భూమిని ప్రభుత్వం అటవీ శాఖకు ఇవ్వనుంది. -
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
హైదరాబాద్: నూతన పారిశ్రామిక విధానానికి తెలంగాణ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ ఇతర నిర్ణయాలు * పాలమూరు ప్రాజెక్టుకు అనుమతి * ఆధీనంలోని లేని భూములు వేలం వేయాలని నిర్ణయం * గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నిర్ణయం * నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటుకు పచ్చజెండా * సర్వీసు కమిషన్ ద్వారా నియామకాలకు అనుమతి * ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో అభ్యర్థుల వయసు సడలింపు పదేళ్లకు పెంపు