KP Lakshmi Devanpally
-
కొత్తగా ‘పాలమూరు’! కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు మంగళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అలైన్మెంట్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ప్రాజెక్టులో తొలుత ప్రతిపాదించిన కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దానికన్నా ముందే ఉన్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచే రెండింటి ప్రతిపాదిత ఆయకట్టుకు నీరివ్వాలని, ఇందుకోసం రెండు ప్రధాన కాల్వలను నిర్మించాలని నిర్ణయించింది. నాలుగైదు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం దాదాపు 16 నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఆగస్టు నాటికల్లా ఉద్ధండాపూర్ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించడం గమనార్హం. అయితే ప్రాజెక్టులో తొలిదశ కింద తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ పనులను చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో తొలి సంతకం దీనిపైనే.. శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోసి.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 12,44,940 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆయా జిల్లాలకు తాగునీరు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ‘పాలమూరు’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా అంజనాగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కురుమూర్తిరాయ, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి పేర్లతో మొత్తం 6 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను ప్రతిపాదించారు. తాజాగా ఇందులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రభుత్వం విరమించుకుంది. ఈ రిజర్వాయర్ కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు ఐదో రిజర్వాయరైన ఉద్ధండాపూర్ ద్వారానే సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. 16.03 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఉద్ధండాపూర్ రిజర్వాయర్ ద్వారా తొలుత 5,02,000 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. కేపీలక్ష్మీదేవిపల్లి ఆయకట్టును సైతం కలపడంతో ఇది 9,06,684 ఎకరాలకు చేరింది. కుడి, ఎడమ కాల్వాల లే అవుట్ ఇదీ.. ఇటీవల ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.5,680 కోట్లతో ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ, ఎడమ ప్రధాన కాల్వ నిర్మాణ పనులకు పరిపాలనపర అనుమతులు జారీ చేస్తూ గత నెల 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కావాలనుకుంటే మళ్లీ నిర్మాణం! పాత ప్రతిపాదనల ప్రకారం 2.8 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను నిర్మించి 4.13 లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇప్పటివరకు పనులు మొదలుపెట్టకపోవడంతో ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకుంది. భవిష్యత్తులో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు విస్తరించి అదనపు ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తే.. మళ్లీ కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. ఈ జలాశయంతో కలిపే ప్రాజెక్టుకు అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించాయి. కుడి ప్రధాన కాల్వ కింద 3,98,568 ఎకరాలకు.. ఉద్ధండాపూర్ కుడి ప్రధాన కాల్వ 105.5 కిలోమీటర్ల పొడవున ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. 6,922 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ కాల్వ ద్వారా 3,98,568 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ► ఇందులో తొలి కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ1) ద్వారా 2,19,731 ఎకరాలకు.. రెండో కుడి బ్రాంచి కాల్వ (ఆర్బీసీ2) ద్వారా 1,00,792 ఎకరాలు, ప్రధాన కాల్వ ద్వారా నేరుగా 78,045 ఎకరాలకు నీరు అందుతుంది. ఈ కుడికాల్వకు అనుసంధానంగా ఫతేపూర్ కాల్వ ద్వారా మరో 6,410 ఎకరాలను సర్కారు ప్రతిపాదించింది. ► తాగునీటి అవసరాల కోసం చించోడ్లోని చౌట చెరువు, బ్రహ్మచెరువు, వీర్లపల్లెలోని అంతుకుంట, దామర్పల్లిలోని మల్లప్ప చెరువు, హైతాబాద్‌లోని పెద్ద చెరువు, మాచాన్పల్లిలోని నల్ల చెరువు, చందనవల్లిలోని పెద్ద చెరువు, తాడ్లపల్లిలోని నాగుల చెరువు, లింగారెడ్డి చెరువు, దారప్పల్లిలోని దార్పల్లి చెరువులను కుడి ప్రధాన కాల్వతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎడమ ప్రధాన కాల్వ కింద 5,01,706 ఎకరాలకు.. ఉద్ధండాపూర్ ఎడమ ప్రధాన కాల్వ 133.65 కిలోమీటర్ల పొడవునా సాగుతుంది. దీని సామర్థ్యం 3,790.8 క్యూసెక్కులు. ఈ కాల్వ కింద 5,01,706 ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం ప్రతిపాదించింది. తాగునీటి అవసరాలకు మల్కా చెరువు (కుసుమ సముద్రం), కొత్త చెరువు (ఇప్పాయిపల్లి), చైలమ్మ చెరువు (కుల్కచర్ల), ఖమ్మం చెరువు (ఖమ్మమాచారం), ఊర చెరువు (పాలెపల్లి), కొత్త చెరువు (బాచ్‌పల్లి), ఊర చెరువు (ఊట్పల్లి), సర్పాన్‌పల్లి ప్రాజెక్టు(సర్పాన్‌పల్లి), అలీపూర్ ట్యాంకు (అలీపూర్), పెద్ద చెరువు (పెద్దెముల్)లను ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన కాల్వలకు వ్యయం రూ.5,678 కోట్లు కుడి/ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికి మొత్తం రూ.4,659 కోట్ల వ్యయం అవుతుందని నీటిపారుదల శాఖ అంచనా వేసింది. వీటి నిర్మాణానికి 8,411 ఎకరాల భూసేకరణ జరపాల్సి ఉంటుందని.. ఎకరాకు రూ.12లక్షల చొప్పున అంచనా వేసుకుంటే అదనంగా రూ.1,019.41 కోట్లు అవసరమని తేల్చింది. దీంతో మొత్తంగా ప్రధాన కాల్వల వ్యయం రూ.5,678 కోట్లు అవుతుందని అంచనా వేసింది. సాగునీటి శాఖ ప్రతిపాదనల ప్రకారం.. ఉద్ధండాపూర్ జలాశయం నుంచి ప్రధాన కాల్వ ప్రారంభమవుతుంది. 16.5 కిలోమీటర్ వద్ద ఎడమ, కుడి ప్రధాన కాల్వలుగా విడిపోతుంది. -
ఇక పాలమూరు మలిదశ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఇంతవరకు మొదలు కాని పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో కదిలిన నీటి పారుదల శాఖ ఉద్ధండాపూర్ దిగువన కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను త్వరలోనే మొదలుపెట్టేందుకు కార్యా చరణ సిద్ధం చేస్తోంది. గతంలో ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విడగొట్టి చేపట్టేలా అంచనాలు సిద్ధం చేసినా, టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం ఆ పనులను కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (ఎస్ఎస్ఆర్) ప్రకారం అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని నిర్ణయించింది. (చదవండి: హమ్మయ్య.. హమాలీలొచ్చారు) నాలుగేళ్లుగా ఎదురుచూపులే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరు, పరిశ్రమలకు నీటి వసతి కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా అనంతరం ఈ అంచనాలు రూ. 50 వేల కోట్లకు పెంచారు. ఈ పథకంలో 6 రిజ ర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజ ర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రంగా రెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని 5 రిజ ర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గతేడాదిలోనే పనులు ప్రారంభిం చారు. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను వేగిరం చేసిన ప్రభుత్వం.. ఈ పనులను మొదలు పెట్టాలని నిర్ణయించింది. భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియకు గతంలో రూ.4,268 కోట్లతో అంచనాలు వేసి 3 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు, ఇక్కడ 18 కి.మీ. మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. దీనికి రూ.1,260 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్‌హౌజ్ నిర్మాణానికి రూ.885 కోట్లు, 2.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.915.9 కోట్లు అంచనా వేశారు. ఈ రిజర్వాయర్ కింద 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. దీంతోపాటే ఉద్ధండాపూర్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి మరో రూ.1,207 కోట్లతో ప్రతిపాదించారు. మొత్తంగా రూ.4,268 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినా నాలుగేళ్లుగా ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. అయితే ఈ పనులు మొదలుపెట్టాలని జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడం, నార్లాపూర్ పంప్‌హౌస్ మినహా మిగతా 18 ప్యాకేజీల పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో ఒక టీఎంసీ నీటిని ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లికి తరలించే పనులపై దృష్టి పెట్టారు. అయితే ఎప్పుడో ఉన్న రేట్ల ప్రకారం కాకుండా కొత్త రేట్ల ప్రకారం అంచనాలు వేసి పంపాలని ఇటీవలే ప్రాజెక్టు అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త అంచనాల పనిలో నిమగ్నమయ్యారు. కొత్త రేట్ల ప్రకారం చూస్తే ఈ అంచనాలు రూ.7 వేల కోట్లకు చేరుతాయని తెలుస్తోంది. ఈ కొత్త అంచనాలకు ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు. (చదవండి: మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?) -
మలిదశకు ‘పాలమూరు’!
♦ ఉద్ధండాపూర్– కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధానానికి ప్రణాళిక సిద్ధం ♦ రూ. 3,020 కోట్లతో రిజర్వాయర్, టన్నెళ్లు, ♦ కాల్వల తవ్వకానికి కార్యాచరణ ♦ మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనున్న నీటిపారుదల శాఖ సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన పనులను సైతం చేపట్టేందుకు నీటి పారుదల శాఖ నడుం బిగించింది. ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. మలిదశలో భాగంగా ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు ఓపెన్‌చానల్, టన్నెళ్లు, పంప్‌హౌస్, రిజర్వాయర్ల నిర్మాణాలకు రూ. 3,020 కోట్లతో వ్యయ అంచనాలను సిద్ధం చేసిన నీటి పారుదల శాఖ ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతోంది. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, పరిశ్రమలకు నీటి వసతిని కల్పించే ఉద్దేశంతో రూ. 35,200 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం నుంచి 60 రోజుల్లో 120 టీఎంసీల నీటిని, వరద జలాలను తీసుకొని ఆయకట్టుకు మళ్లించేందుకు మొత్తంగా 6 రిజర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందులో రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. మొత్తంగా రూ. 30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గత ఏడాదిలోనే పనులు ఆరంభించారు. అయితే ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. అయితే ప్రస్తుతం అవన్నీ కొలిక్కి వస్తుండటంతో ఈ పనులకు టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. రూ. 3 వేల కోట్లు.. 3 ప్యాకేజీలు.. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవుని పల్లి అనుసంధాన ప్రక్రియను ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు.. ఇక్కడ 18 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. ఇందుకోసం టన్నెల్ నిర్మాణానికి రూ. 541కోట్లు, ఓపెన్ చానల్‌కు రూ. 592 కోట్లు అంచనా వేశారు. భూసేకరణ, ఇతర అవసరాలతో కలిపి మొత్తంగా ఈ ప్యాకేజీకి రూ. 1372.20 కోట్లు వ్యయం కానుంది. ఇక ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్‌హౌస్‌ను చేర్చగా, దీనికి మరో రూ. 876.70 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టారు. ఇక 2.80 టీఎంసీల సామర్థ్యంతో లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ. 751.50 కోట్లు అంచనా వేశారు. ఈ రిజర్వాయర్ కింద ఏకంగా 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. మొత్తంగా మూడు ప్యాకేజీలకు రూ. 3,020.40 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, వీటిని ఆమోదించి, టెండర్లు పిలిచేందుకు అనుమతి కోసం ప్రాజెక్టు అధికారులు ఉన్నతాధికారులకు పంపారు. అక్కడ ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు.