సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఇంతవరకు మొదలు కాని పనులకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల నేపథ్యంలో కదిలిన నీటి పారుదల శాఖ ఉద్ధండాపూర్ దిగువన కేపీ లక్ష్మీదేవునిపల్లి వరకు చేపట్టిన పనులను త్వరలోనే మొదలుపెట్టేందుకు కార్యా చరణ సిద్ధం చేస్తోంది. గతంలో ఈ పనులను మూడు ప్యాకేజీలుగా విడగొట్టి చేపట్టేలా అంచనాలు సిద్ధం చేసినా, టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం ఆ పనులను కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం అంచనాలు సిద్ధం చేసి టెండర్లు పిలవాలని నిర్ణయించింది.
(చదవండి: హమ్మయ్య.. హమాలీలొచ్చారు)
నాలుగేళ్లుగా ఎదురుచూపులే..
ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 12.3 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగు నీరు, పరిశ్రమలకు నీటి వసతి కల్పించే ఉద్దేశంతో రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు ప్రాజెక్టును చేపట్టగా అనంతరం ఈ అంచనాలు రూ. 50 వేల కోట్లకు పెంచారు. ఈ పథకంలో 6 రిజ ర్వాయర్లు, 5 లిఫ్టులను ప్రతిపాదించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి వద్ద రిజ ర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు.
ఇందులో రంగా రెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని 5 రిజ ర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను 18 ప్యాకేజీలుగా విభజించి, మొత్తంగా రూ.30 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి గతేడాదిలోనే పనులు ప్రారంభిం చారు. ఉద్ధండాపూర్ నుంచి కేపీ లక్ష్మీదేవునిపల్లి మధ్యలో కొత్త ప్రతిపాదనలు రావడంతో ఈ పనులు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో మిగిలిన పనులను వేగిరం చేసిన ప్రభుత్వం.. ఈ పనులను మొదలు పెట్టాలని నిర్ణయించింది.
భారీగా అంచనాలు పెరిగే అవకాశం
ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లి అనుసంధాన ప్రక్రియకు గతంలో రూ.4,268 కోట్లతో అంచనాలు వేసి 3 ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ–19లో చేర్చిన అధికారులు, ఇక్కడ 18 కి.మీ. మేర ఓపెన్ చానల్, 14 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాల్సి ఉంటుందని తేల్చారు. దీనికి రూ.1,260 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్యాకేజీ–20లో స్టేజ్–5 పంప్‌హౌజ్ నిర్మాణానికి రూ.885 కోట్లు, 2.8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.915.9 కోట్లు అంచనా వేశారు.
ఈ రిజర్వాయర్ కింద 4.13 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, రిజర్వాయర్ కింద 1,340 ఎకరాల మేర ముంపు ఉండనుంది. దీంతోపాటే ఉద్ధండాపూర్ నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ నిర్మాణానికి మరో రూ.1,207 కోట్లతో ప్రతిపాదించారు. మొత్తంగా రూ.4,268 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసినా నాలుగేళ్లుగా ఈ ప్రతిపాదన పట్టాలెక్కలేదు. అయితే ఈ పనులు మొదలుపెట్టాలని జిల్లా ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడం, నార్లాపూర్ పంప్‌హౌస్ మినహా మిగతా 18 ప్యాకేజీల పనులు వేగం పుంజుకున్న నేపథ్యంలో ఒక టీఎంసీ నీటిని ఉద్ధండాపూర్–కేపీ లక్ష్మీదేవునిపల్లికి తరలించే పనులపై దృష్టి పెట్టారు.
అయితే ఎప్పుడో ఉన్న రేట్ల ప్రకారం కాకుండా కొత్త రేట్ల ప్రకారం అంచనాలు వేసి పంపాలని ఇటీవలే ప్రాజెక్టు అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త అంచనాల పనిలో నిమగ్నమయ్యారు. కొత్త రేట్ల ప్రకారం చూస్తే ఈ అంచనాలు రూ.7 వేల కోట్లకు చేరుతాయని తెలుస్తోంది. ఈ కొత్త అంచనాలకు ఆమోదం దక్కితే వెంటనే ఈ మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలవనున్నారు.
(చదవండి: మృతదేహాలకు పరీక్షలెందుకు చేయరు?)
Comments
Please login to add a commentAdd a comment