తెలంగాణ సర్కార్‌కు ఎన్‌జీటీ షాక్‌!  | NGT shock for Telangana government | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌కు ఎన్‌జీటీ షాక్‌! 

Published Fri, Dec 23 2022 3:17 AM | Last Updated on Fri, Dec 23 2022 3:17 AM

NGT shock for Telangana government - Sakshi

సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్‌ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపార­నష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమా­నాగా తెలంగాణ సర్కార్‌కు విధించింది. 

అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్ర­భు­త్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘి­స్తు­న్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) వద్ద డిపాజిట్‌ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్‌ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది.

అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్‌ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్‌ కౌన్సిల్‌ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. 

వివాదం నేపథ్యం ఇదీ..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్‌ 10న తెలంగాణ సర్కార్‌ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్‌)ను ఆశ్రయించారు.

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది.

పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్‌ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్‌ 29న తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది.

ఎన్‌జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు
కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్‌ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది.

క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్‌ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement