సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘నాటి సమైక్య పాలనలో పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టారు. ముఖ్యమంత్రులు దత్తత తీసుకున్నా విముక్తి లభించలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాతే పాలమూరుకు విముక్తి లభించింది. నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలను పూర్తి చేసుకున్నాం. వీటితో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. పాలమూరు ప్రాజెక్టును సైతం సాధించాం. త్వరలోనే పూర్తి చేసుకుంటాం.
ఉమ్మడి జిల్లాలో 20 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే నా ఆశ. ఇక్కడి ఎంపీగానే తెలంగాణ తెచ్చిన..ఆ కీర్తి పాలమూరుకు ఎప్పటికీ ఉంటుంది. పాలమూరు నా గుండె.’అని సీఎం కేసీఆర్ ఉద్వేగంగా మాట్లాడారు. శనివారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వెట్ రన్‌ను సీఎం ప్రారంభించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోతలను వీక్షించారు.
కృష్ణమ్మకు వాయినం సమర్పించారు. అనంతరం కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడారు. నేడు దేశంలోనే జీడీపీ, తలసరి ఆదాయంలో మనరాష్ట్రమే నంబర్‌వన్‌గా ఉంది. ఈ పురోగతి, అభివృద్ధి ఇంతటితో ఆగద్దు. దొంగ నాయకులతో జాగ్రత్త. అలసత్వం వ హిస్తే వైకుంఠపాళిలో పెద్దపాము మింగినట్లయితది. అందరూ ఆలోచించాలి అని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల నేతలు వచ్చి ప్రాజెక్టులు తన్నుకుపోతుంటే.. పాలమూరు నేత లు మంగళహారతులు పట్టారని విమర్శలు గుప్పించారు.
► తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలు దేశానికి అన్నం పెట్టే వజ్రపుతునకలుగా మారుతాయన్నారు. ఉద్యమ సమయంలో కర్వెన గుట్టల్లో మూడు రోజులు తిరిగా. పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తే మేలు జరుగుతుందని భావించా. ఇప్పుడు ఆ కల సాకారమైందన్నారు. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు నది పారినట్లుగా, కృష్ణమ్మ తాండవం చేస్తున్నట్లుగా అనిపించింది.
ఇంతమంచి కార్యక్రమం చేసినందుకు జీవితం ధన్యమైంది అని కేసీఆర్ అన్నారు. కేఎల్‌ఐ ప్రాజెక్టును కూడా గోకి పెండింగ్‌లో పెడితే దాన్ని పూర్తి చేశామని, దుందుభీలో ఒకప్పుడు దుమ్ము కొట్టుకుపోయేదని, ఇప్పుడు అక్కడ చెక్‌డ్యాం కట్టడంతో నీళ్లు ఆగి కనువిందు చేస్తోందన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకునే లక్ష్యంలో మీ అందరి దీవెనలు కావాలని కేసీఆర్ కోరారు.
తలమాసినోళ్లు పైత్యపు మాటలు మాట్లాడతున్నారు..ఎన్నికల్లో మళ్లీ వస్తరు. కొద్దికొద్దిగా బాగుపడుతున్నం. వారి మాటలు వింటే ఆగమైతం. గోసపడతం అని కేసీఆర్ సూచించారు.ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎంపీలు కేశవరావు, రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ విప్ గువ్వ ల బాలరాజు, ఎమ్మెల్సీలు వాణీదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బాల్క సుమన్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వరాల జల్లు..
బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు మహబూబ్‌నగర్‌కు ఇంజినీరింగ్ కళాశాల, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు కొల్లాపూర్‌కు ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాల మంజూరు చేస్తానన్నారు.
జీల్దార్‌తిప్ప చెరువు లిఫ్టు, మల్లేశ్వరం లిఫ్టులకు, బాచారం హైలెవెల్ కెనాల్, పస్పుల బ్రాంచి కెనాల్‌కు నిధులు మంజూరు చేస్తాని, నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణాలకు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తూ రేపే జీఓ విడుదల చేస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనుల కోసం రూ.15 లక్షల చొప్పున, కొల్లాపూర్ మున్సిపల్ అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment