Nagarkurnool District News
-
జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
నాగర్‌కర్నూల్: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు అన్నిరంగాల్లో రాణించి సుఖసంతోషాలతో విలసిల్లాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకాంక్షించారు. మంగళవారం ఆయన చాంబర్లో మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం–2025లో ప్రజలు కొత్త ఆలోచనలు, సరికొత్త నిర్ణయాలు, ఆశలు, ఆశయాలతో ముందుకెళ్లాలని కోరారు. కొత్త సంవత్సరం జిల్లా ప్రజలు అందరికీ సంతోషం ఇవ్వాలని, అందరి కలలు నెరవేరాలని, ప్రతిరోజును ఆస్వాదిస్తూ ఉండాలని అభిలాషించారు. గతేడాది కంటే ఈసారి మరిన్ని ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిఒక్కరూ కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. హాస్టల్ వార్డెన్ సస్పెండ్ నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఎస్సీ–ఎ హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో మద్యం తాగి.. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని గత నెలలో పలు విద్యార్థి సంఘాలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. దాదాపు నెల రోజులపాటు ఉన్నతాధికారులు విద్యార్థులను విచారించి రిపోర్ట్‌ను కలెక్టర్‌కు అందజేశారు. అధికారులు ఇచ్చిన విచారణ అంశాల ఆధారంగా వార్డెన్ శ్రీనివాసులును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి నాగర్‌కర్నూల్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో వంట గది, వండిన అన్నం, కూరగాయలు, నిల్వ ఉన్న బియ్యం, ఇతర వంట సామగ్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుకులాల్లో 40 శాతం డైట్ చార్జీలు పెంచినందున పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట డీఈఓ రమేష్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్, గురుకుల పాఠశాలల అధికారులు పాల్గొన్నారు. -
ఎస్సీల స్థితిగతులపై అధ్యయనం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఎస్సీల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తామని రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ అన్నారు. మంగళవారం కమిషన్ చైర్మన్ మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై అధ్యయనం నిమిత్తం ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ కులాలు, సంఘాలు, నాయకులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని స్వయంగా వినతులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. బహిరంగ విచారణలో స్వీకరించిన దరఖాస్తులు, అభిప్రాయాలు, ఉద్యోగ, విద్య, రాజకీయ, ఆర్థిక రంగంలో ఎస్సీ కులాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్న అంశాలు, స్థితిగతులపై క్షుణ్ణంగా పరిశీలన, అధ్యయనం చేసి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. దరఖాస్తు సమర్పించే వారందరూ వ్యక్తిగతంగా గాని, సంఘాలు గాని ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా తమ వినతులు సమర్పించాలని కోరారు. కోర్టు జడ్జిమెంట్ పరిగణలోకి తీసుకొని వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. ఇది వరకు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో బహిరంగ విచారణ పూర్తయ్యిందని, జిల్లాల సందర్శన సందర్భంగా దరఖాస్తు సమర్పించలేకపోయిన వారు హైదరాబాద్‌లో నేరుగా కమిషన్‌కు అభిప్రాయాలు తెలియజేయవచ్చన్నారు. సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం రాష్ట్ర ఎస్సీ కులాల ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ 160 దరఖాస్తుల స్వీకరణ కాగా షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై నిర్వహించిన బహిరంగ విచారణలో 160 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు అందించారు. అంతకు ముందు మహబూబ్‌నగర్‌లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో కలెక్టర్ విజయేందిర కమిషన్ చైర్మన్‌కు స్వాగతం పలికారు. కమిషన్ విచారణ అనంతరం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని 11 వార్డు పాత పాలమూరు ఎస్సీ వాడలో పర్యటించారు. వీధుల్లో తిరుగుతూ.. స్థానికులతో మాట్లాడి.. వారి స్థితిగతులను తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సుదర్శన్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ శ్రీధర్, రాష్ట్ర కార్యాలయ సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టి..
●పేరెంట్స్‌తో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తా.. ప్రతిక్షణం ప్రశాంతంగా ఉంటూ ఆనందంగా గడపాలి. చదువుపై ఫోకస్ పెట్టి ఒత్తిడికి గురికాకుండా కోర్స్ పూర్తిచేస్తాను. కొత్త ఏడాదిలో వీలైనప్పుడల్లా మా కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తాను. – కేయశ్రీ, హైదరాబాద్ పొద్దునే నిద్రలేవాలి.. కొత్త ఏడాది నుంచి రోజూ పొద్దునే 5 గంటలకల్లా నిద్రలేచి చదువు కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నా. ఇందుకోసం త్వరగా పడుకోవడం, నిద్ర కోసం తగినంతం సమయం కేటాయించేలా చూసుకుంటా. అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చేలా సమయాన్ని మార్చుకుంటా. – మౌనిక, హైదరాబాద్ ఆనందంగా ఉండాలి.. కొత్త సంవత్సరంలో నా ఫ్రెండ్స్‌తో ఎక్కువగా కలసిమెలసి ఉండాలని, ఆనందంగా గడిపేందుకు ప్రయత్నిస్తాను. మెడిసిన్ పూర్తిచేసేందుకు, సబ్జెక్టుల్లో ప్రావీణ్యం సంపాదించేందుకు సమయపాలన పాటిస్తాను. ఏ రోజు పనులను అదే రోజు పూర్తిచేసేలా చూస్తాను. – పూజ, సంగారెడ్డి చిన్నప్పటి నుంచి బుక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. ఇప్పటి నుంచి వైద్య వృత్తికి అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై దృష్టిపెడతాను. ఎక్స్పర్మెంట్స్ పట్ల ఆసక్తి చూపిస్తాను. క్షేత్రస్థాయిలో, నిజ జీవితంలో వైద్యులకు అవసరమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకునేందుకు ప్రయత్నిస్తాను. – అభిషయ్, హైదరాబాద్ -
వినూతనంగా ముందుకు..
సాక్షి, నాగర్‌కర్నూల్: కొత్త సంవత్సరంలో వినూత్న మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. ప్రధానంగా వృత్తి జీవితానికి మరింత ఉపయుక్తంగా ఉండేలా ప్రాక్టికల్ జ్ఞానాన్ని పెంచుకుంటాం. సెల్‌ఫోన్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకుంటాం. పూర్తిగా చదువు, విజ్ఞానంపై దృష్టిపెడతాం. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు తల్లిదండ్రులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తాం.’ ఇది నూతన సంవత్సరం సంవత్సరం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులు తీసుకున్న నిర్ణయాలు. 2025 కొత్త ఏడాదిలో తీసుకోనున్న నిర్ణయాలపై మెడికల్ కళాశాల విద్యార్థులతో ‘సాక్షి’ టాక్‌షో నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మెడికోలు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. మార్పుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటాం ● సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం ● వృత్తి జీవితానికి సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి ● ఆరోగ్యం మెరుగు, తల్లిదండ్రులతో గడిపేందుకు ప్రాధాన్యం ● ‘సాక్షి’ డిబేట్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల మనోగతం -
కొంగొత్త ఆశలతో..
కాలచక్రం గిర్రున తిరిగింది.. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. ఎన్నో అనుభూతులను మిగిల్చి.. మరెన్నో ఉన్నత లక్ష్యాలను ముందుంచి.. 2024 చల్లగా కాలగర్భంలో కలిసిపోయింది. నేస్తమా నేనున్నా అంటూ కొత్త సంవత్సరం–2025.. కొంగొత్త ఆశయాలతో మనిషి జీవన చక్రంలోకి ప్రవేశించింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే ప్రతిఒక్కరూ కేరింతలు కొడుతూ.. కేకులు కట్ చేసి.. నూతన సంవత్సరాన్ని స్వాగతించారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక చింతన అవసరం
ఉప్పునుంతల/తెలకపల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకుంటే జీవితం ఆనందమయంగా సాగుతుందని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. సోమవారం ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు తెలకపల్లి మండల కేంద్రం, రాకొండ గ్రామంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మర్రిపల్లి చెన్నకేశవ స్వామి ఆలయ ఆవరణలో నిర్వహించిన ధనుర్మాస మహోత్సవంలో జీయర్ స్వామి పాల్గొని మాట్లాడారు. పురాతన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గ్రామాల్లో దేవాలయాలను నిర్మించుకోవడం ద్వారా మనిషిలో దైవచింతనతో పాటు మంచితనం పెరుగుతుందని చెప్పారు. తద్వారా ఎలాంటి ద్వేషాలు లేకుండా కలసిమెలిసి జీవించగలుగుతారని అన్నారు. తెలకపల్లిలో తిరుపావై గోదాదేవి కథను భక్తులకు వివరించారు. కార్యక్రమాల్లో మామిళ్లపల్లి ఆలయ కమిటీ చైర్మన్ రాజల్రావు, నర్సింహారావు, నాయకులు మోహన్‌గౌడ్, మారో జు ఉమాపతి ఆచార్యులు, మాజీ ఎంపీటీసీ మొగిలి నిరంజన్, చంద్రశేఖర్, తుకారం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు సిబ్బంది కృషి చేయాలని ఐజీ రమేష్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అంతకు ముందు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఐజీకి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి ఐజీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం అందించేలా చూడాలన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం కలిగేలా పనిచేయాలని.. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు ప్రజావాణికి 7 ఫిర్యాదులు నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 7 ఫిర్యాదులు అందాయి. అందులో 3 తగు న్యాయం కోసం, 4 భూతాగాదాలపై వచ్చినట్లు తెలిపారు. సాంకేతిక విద్య అందించాలి అచ్చంపేట రూరల్: గిరిజన సంక్షేమ పాఠశాలలోని విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ చందనసర్పే, డీటీడీఓ ఫిరంగి సూచించారు. సోమవారం పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమశాఖ సహకారంతో ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఆధ్వర్యంలో వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ)లను తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మైండ్ స్పార్క్ ప్రోగ్రాం ప్రాముఖ్యతను వివరించారు. ఐటీడీఏ పరిధిలోని పాఠశాలలకు మైండ్ స్పార్క్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఈఐ మేనేజర్ వికాస్ ఒమర్, ఏటీడీఓలు యాదమ్మ, శ్రీనివాసులు, వెంకటయ్య, డిప్యూటీ ఈఓ శంకర్, డీవీ నాయక్, తిరుపతయ్య, హెచ్ఎంలు లింగస్వామి, ముత్యాలు, లింగయ్య, తిరుపతయ్య, ఆంజనేయులు, లక్ష్మణ్, శ్రీనయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. పత్తి కొనుగోలు చేయాలని ధర్నా చారకొండ: సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. మర్రిపల్లి సమీపంలోని జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మర్రిపల్లి సమీపంలోని కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ సెంటర్లో వారం రోజులుగా పత్తిని కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సేకరణపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, రైతుల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ శంషొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని మార్కెట్ కార్యదర్శి కిరణ్‌తో మాట్లాడారు. పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు. -
‘పాలమూరు’ ఎత్తిపోతలపై కుట్రలు
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి డిండి ప్రాజెక్ట్ ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీరందించేందుకు ప్రభుత్వం తెచ్చిన జీఓ 159ను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు ఇప్పటికే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్ ఉందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా పాలమూరు ప్రాజెక్ట్‌లోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తే పాలమూరు జిల్లాలోని కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీరు అందని పరిస్థితి తలెత్తనుందని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసి త్వరగా ఇక్కడి రిజర్వాయర్లను నీటితో నింపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడి నుంచి నీటిని తరలిస్తే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాలమూరు ప్రజల సాగునీటి ప్రయోజనాలు కాపాడేందుకు ఎలాంటి త్యాగాలకై నా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం వెంటనే జీఓ 159ను రద్దు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. అలాగే రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో పోరాటం చేసిన బీజేపీ నేత సుష్మాస్వరాజ్ విగ్రహాన్ని సైతం రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్‌నేతలు స్వార్థ రాజకీయాలు ఆపండి జీఓ 159 రద్దు చేయాలి: మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి -
వివాదాస్పదంగా కొందరు పోలీసుల తీరు..
ఈ ఏడాది కొందరు ఎస్ఐలు, కానిస్టేబుళ్ల వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. వనపర్తి జిల్లా పాన్గల్లో పనిచేసిన ఎస్ఐ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ వాహనదారుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. లింగాలలో పనిచేసిన ఓ ఎస్ఐ యువకుడికి శిరోముండనం చేయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రెండు ఘటనలు వివాదాస్పదంగా మారాయి. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు జిల్లా కేంద్రంలో బ్లూకోర్టులో పనిచేస్తున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఒంటరిగా ఉన్న జంటల నుంచి నగదు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో వారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. -
సైబర్ మాయ..!
● ఉమ్మడి పాలమూరును బెంబేలెత్తిస్తున్న సైబర్ మోసాలు ● గత సంవత్సరంతో పోలిస్తే 15.42 శాతం పెరిగిన నేరాలు ● ఈ ఏడాది అమాయకుల నుంచి రూ.10 కోట్ల మేర దోపిడీ ● అన్ని జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే స్వాధీనం ● ‘గోల్డెన్ అవర్’లోనే సొమ్ము రికవరీకి అవకాశం దైనందిన జీవితంలో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో ప్రజలు ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్ల్లు, లింక్‌లతో మభ్యపెట్టి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో డబ్బులతో పాటు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆన్లైన్ మోసానికి గురైన వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరు.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సైబర్ మోసాల కేసుల శాతం.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ ఫోకస్
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ బందోబస్తు సాక్షి, నాగర్‌కర్నూల్: ‘నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా పూర్తయ్యేలా పోలీస్‌శాఖ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం జిల్లాలో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్‌పై ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నాం. ప్రతి ఏడాది డిసెంబర్ 31, న్యూ ఇయర్ వస్తుంది. ఇదే మొదటిది, చివరిది కాదు. యువత మద్యం తాగి వాహనాలు నడపవద్దు. సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలి.’ అని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై సోమవారం ‘సాక్షి’ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈసారి న్యూఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగరాదు.. జిల్లావ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, రోడ్లపైకి వచ్చి ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు. పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడైనా తాగి న్యూసెన్స్‌కు పాల్పడినట్లు సమాచారం అందిన క్షణాల్లో పోలీసులు స్పందిస్తారు. ఘటనా స్థలానికి కేవలం నిమిషాల్లోపు చేరుకుంటారు. డిసెంబర్ 31 నుంచి ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజలు ఆనందంగా వేడుకలు నిర్వహించుకోవాలి. ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు.. డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలు ప్రతిసారి వచ్చేవే. ఎంజాయ్ పేరిట ఆగం కావద్దు. యువత ఎంజాయ్ పేరుతో మద్యం తాగి రోడ్లపైకి రావద్దు. అన్నింటికన్నా కుటుంబ సభ్యులకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలి. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఙప్తి చేస్తున్నాను. ● జిల్లాలోని అన్ని స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు ● ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిద్దాం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ -
అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..
అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు నిర్వహించనున్నాం. తాగి బండి నడిపితే కేసులు నమోదు చేస్తాం. జిల్లావ్యాప్తంగా అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నాం. కాబట్టి మద్యం తాగి రోడ్ల మీదకు వచ్చి చిక్కులు తెచ్చుకోవద్దు. ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ రోజున ఒక్క ఆక్సిడెంట్ కూడా జరగొద్దు. ఇందుకోసం మా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. డిసెంబర్ 31, న్యూ ఇయర్ రోజున అన్ని స్థాయిల్లో పోలీస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 26 అర్జీలు అందాయని తెలిపారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భూసేకరణ విభాగంలో పనిచేసేందుకు అవకాశం.. భూసేకరణ అంశంపై అవగాహన ఉన్న రెవెన్యూ రిటైర్డ్ ఉద్యోగులకు భూసేకరణ విభాగం తహసీల్దార్, నయాబ్ తహసీల్దార్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు కలెక్టరేట్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌ను నేరుగా లేదా 91009 01430 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
పెరిగిన నేరాలు..
నాగర్‌కర్నూల్ క్రైం: ఈ ఏడాది జిల్లాలో శాంతిభద్రతలు మరింత మెరుగు పడినప్పటికీ.. నేరాల సంఖ్య మాత్రం తగ్గలేదు. వివాహేతర సంబంధాలు, ఆస్తి కోసం హత్యలకు పాల్పడటం అందరినీ కలిచివేసింది. ఈ ఏడాది పోలీసులకు మొత్తం 7,909 ఫిర్యాదులు అందగా.. 4,007 కేసులు నమోదయ్యాయి. సైబర్ క్రైం, షీ టీం కేసులు, చోరీలు, హత్యలు, చీటింగ్, గేమింగ్, ఎస్సీ, ఎస్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, హత్యాయత్నం కేసులు పెరిగినప్పటికీ.. మహిళలపై వేధింపులు, రేప్ కేసులు, కిడ్నాప్ కేసులు, ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టాయి.పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, డ్రగ్స్ నిర్మూలన కోసం అవసరమైన చర్యలు చేపట్టారు. మహిళలపై వేధింపులకు గురిచేసే వారిపై కఠినంగా వ్యహరించారు. వరదల సమయంలో వాగులు, నదుల్లో చిక్కుకున్న చాలా మందిని రెస్క్యూ చేసి కాపాడారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా 39 మంది చిన్నారులను రక్షించారు. 570 కేసుల్లో 32 మందికి జైలుశిక్ష పడేలా చేశారు. 7 డ్రగ్స్ కేసులు నమోదు చేసి.. 12 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 309 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ విలేకరులకు వెల్లడించారు.385 రోడ్డు ప్రమాదాలు..రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 385 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా.. 184 మంది మృతి చెందారు. మరో 420 మంది గాయాలపాలయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు పెరిగినప్పటికీ మృతుల సంఖ్య తగ్గింది.వివిధ కారణాలతో 33 హత్యలు..జిల్లాలో హత్యలు పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది 33 హత్య కేసులు నమోదయ్యాయి. అందులో 13 కుటుంబ కలహాలతో, 11 వివాహేతర సంబంధానికి సంబంధించి, 6 ఆస్తి తగాదాలు, 5 ఆస్తి కోసం, 3 ఇతర కారణాలతో హత్యలు చోటు చేసుకున్నాయి.రోడ్డు నిబంధనలు కఠినంగా అమలు..రోడ్డు నిబంధనలు పాటించని వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. మోటారు వెహికిల్ యాక్ట్ కింద 82,957 కేసులు నమోదు చేసి.. రూ. 3,45,29,845 జరిమానా విధించారు. ఇక డ్రంకెన్ డ్రైవ్ కింద 3,294 కేసులను నమోదు చేసి.. రూ. 26,72,131 జరిమానాలు విధించారు. తాగి వాహనాలు నడిపిన 34 మందికి జైలుశిక్ష పడేలా చేశారు.● జిల్లాలో గేమింగ్ యాక్ట్‌కు సంబంధించి 32 కేసులు నమోదు చేసి.. రూ. 7,66,930 నగదును సీజ్ చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా 138 నగదు సీజ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం రూ. 1,37,32,355 నగదును సీజ్ చేశారు. 181 లిక్కర్ కేసులు నమోదు చేసి.. 2,418 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 1,641 సెల్ఫోన్లు చోరీలకు గురికాగా.. 1,000 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. షీ టీంకు 166 ఫిర్యాదులు రాగా.. 59 ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 22 పెట్టి కేసులు నమోదు చేశారు. 80 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 251 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.రూ. కోట్లు కొల్లగొట్టిన ఘనులు జిల్లావ్యాప్తంగా సైబర్, ఆర్థిక నేరాలు పెరిగిపోయాయి. సైబర్ క్రైం పోలీసులు తక్షణమే స్పందించి బాధితుల సొమ్ము రూ. 10.08 లక్షలు రికవరీ చేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 70 కేసులు నమోదు కాగా.. నేరగాళ్లు రూ. 30,46,74,751 సొత్తును కొల్లగొట్టారు.● చోరీలకు సంబంధించి 277 కేసులు నమోదయ్యాయి. దాదాపుగా రూ. 3,72,80,815 సొత్తు చోరీకి గురికాగా.. ఇప్పటి వరకు రూ. 99,54,300 సొమ్మును పోలీసులు రికవరీ చేశారు.● గతేడాది కంటే ఈ ఏడాది మహిళలపై వేధింపులు, కిడ్నాప్ కేసులు తగ్గాయి. మహిళలపై వేధింపులకు సంబంధించి 418, రేప్ కేసులు 107, కిడ్నాప్ కేసులు 28 నమోదయ్యాయి.నమోదైన కేసులు వివరాలు; 2023; 2024అందిన ఫిర్యాదులు; 8,524; 7,909నమోదైన కేసులు; 4,108; 4,007హత్యలు; 31; 33ఆస్తికోసం హత్యలు; 4; 5అత్యాచారాలు; 80; 107కిడ్నాప్ కేసులు; 40; 28రోడ్డు ప్రమాదాలు; 367; 385మృతులు; 191; 184ఎస్సీ ఎస్టీ కేసులు; 53; 84మహిళలపై వేధింపులు; 410; 418ఆత్మహత్యలు; 191; 182 -
నదిలో రయ్.. రయ్
బోటు షికారు మరింత చేరువ ● సోమశిలలో కొత్తగా ఐదు వాటర్ బోట్లు ఏర్పాటు ● ఇద్దరు నుంచి నలుగురు కృష్ణానదిలో విహరించేందుకు అవకాశం ● త్వరలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా ప్రారంభం కొల్లాపూర్: నదీ ప్రయాణాలు కోరుకునే పర్యాటకులకు ఇది ఉత్సాహం కలిగించే అంశం. సోమశిల వద్ద కృష్ణానదిలో పర్యాటకులు ఒంటరిగా లేదా జంటగా విహరించేందుకు టూరిజం శాఖ కొత్త వాటర్ బోట్లు (స్పోర్ట్స్ బోట్లు) ఏర్పాటు చేసింది. ప్రైవేటు సంస్థకు బోట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే బోటు షికారు ప్రారంభం కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలోనే రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త బోట్లను ప్రారంభించనున్నారు. పర్యాటకుల షికారు కోసం.. సోమశిల వద్ద కృష్ణానది అందాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటక శాఖ ఇప్పటికే సోమేశ్వర లాంచీ (మినీ)ని ఏర్పాటుచేసింది. ఇందులో 30 మందికి పైగా ప్రయాణికులు నదిలో విహరించేందుకు వీలుంది. రోజు సోమశిల నుంచి మల్లేశ్వరం ఐలాండ్ వరకు పర్యాటకులను తీసుకువెళ్లి.. వెనక్కి తీసుకువస్తారు. సోమశిల నుంచి శ్రీశైలం వెళ్లేందుకు మరో పెద్ద లాంచీ కూడా అందుబాటులో ఉంది. అయితే ఎక్కువ సంఖ్యలో జనం ఉంటేనే ఈ రెండు బోట్లు నదిలోకి వెళ్తాయి. ఒకరిద్దరు ఉంటే వెళ్లవు. ఈ సమస్యకు పరిష్కారం తోపాటు ఔత్సాహికులకు నదీ షికారును మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో టూరిజం శాఖ చిన్నబోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒకరు లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు ప్రయాణించేలా 5 రకాల కొత్త బోట్లను ఏర్పాటుచేశారు. ఇద్దరు వ్యక్తులు వెళ్లేందుకు వీలుగా స్వాన్, కయాక్, స్కూటీ బోట్లు ఉన్నాయి. నలుగురు వెళ్లేందుకు వీలుగా ఫన్యాక్, పెడల్ బోట్లను సోమశిలలో సిద్ధంగా ఉంచారు. ఈ బోట్లను ప్రయాణికులే నడపవచ్చు. లేదంటే ప్రైవేటు సంస్థ ప్రతినిధి సహకారం తీసుకోవచ్చు. ఈ బోట్ల ద్వారా కృష్ణానదిలో విహరించేందుకు ఒక్కో ప్రయాణికుడికి రూ. 200 చొప్పున చార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. 15 నిమిషాల షికారుకు ధరను నిర్ణయించనున్నారు. ఎక్కువ సేపు నదిలో విహరిస్తే అదనపు చార్జీలు వసూలు చేయనున్నారు. డిమాండ్ పెరిగితే బోట్ల సంఖ్య పెంచే అవకాశం ఉందని నిర్వహణ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఐదు రకాల కొత్త బోట్లు.. పర్యాటకుల సంఖ్య పెంచేలా.. కృష్ణానది అందాలు తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది నదిలో స్పోర్ట్స్ బోట్లు ఏర్పాటుచేస్తే బాగుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి సూచన మేరకు స్పోర్ట్స్ బోట్ల ఏర్పాటుకు టూరిజం శాఖ చర్యలు చేపట్టింది. సోమశిల, అమరగిరి, సింగోటం, మల్లేశ్వరం, మంచాలకట్ట ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచేందుకు, వారికి అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నర్సింహ్మ, జిల్లా పర్యాటకశాఖ అధికారి -
సమ్మెబాటలో పంచాయతీ కార్మికులు
అచ్చంపేట రూరల్: జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా.. ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి అవలంభిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. నెలల తరబడి వేతనాలు పెండింగ్.. జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉండగా.. 2,500 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో కారోబార్లు, బిల్ కలెక్టర్లు, వాటర్ మేన్లు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ప్రతి కార్మికుడికి రూ.9,500 వేతనంగా నిర్ణయించినా.. నిధుల కొరత కారణంగా అనేక పంచాయతీల్లో నెలల తరబడి వేతనాలు చెల్లించడం లేదు. గత ఆరునెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పంచాయతీ కార్మికులు వాపోతున్నారు. వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారే తప్ప ప్రతినెలా జీతాలు మా త్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే వచ్చేనెలలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు ఆరు నెలలుగా వేతనాలు అందక అవస్థలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ డిమాండ్లు ఇవే.. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకువచ్చి.. జీఓ నంబర్ 60 ప్రకారం వేతనాలను కేటగిరీ ప్రకారం చెల్లించాలి. జీఓ నంబర్ 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి. పాత కేటగిరీల ప్రకారం ఉద్యోగులుగా గుర్తించాలి. కారోబార్లు, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలి. అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి. పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ. 5లక్షల చొప్పున చెల్లించాలి. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థికసాయంతో పాటు ప్లాట్లు ఇవ్వాలి. ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు క్రమం తప్పకుండా చెల్లించాలి. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
కొల్లాపూర్ రూరల్: మండలంలోని అమరగిరి, మొలచింతలపల్లి, నార్లాపూర్, ఎల్లూరు చెంచు గూడెలలో చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు వెంటనే పట్టాలివ్వాలని చెంచు సంఘం నాయకుడు మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అమరగిరి చెంచులతో ఆయన సమావేశమై మాట్లాడారు. 20 ఏళ్లుగా చెంచులు సాగు చేసుకుంటున్న పోడు భూ ములకు పట్టాలు లేక ఫారెస్టు అధికారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొందరికి పట్టాలున్నా భూములను సాగు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదన్నా రు. చెంచు గూడెలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలకు సిద్ధ మవుతామని హెచ్చరించారు. -
భక్తి మార్గంతో ప్రశాంత జీవనం
తెలకపల్లి: భక్తిమార్గం ద్వారా ప్రశాంత జీవనం కొనసాగించవచ్చని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్‌స్వామి అన్నారు. తెలకపల్లి మండలం పెద్దూరులోని ఆంజనేయస్వామి, శివాలయాల పునర్నిర్మాణ పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమ్మరెడ్డిపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన, భక్తిభావంతో మెలుగుతూ సన్మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ నిరంజన్, కొమ్ము సత్యం, ఎండీ ఫరీద్, కుమ్మరి బాలస్వామి, చరణ్ పాల్గొన్నారు. సెమీ ఫైనల్‌కు జిల్లా కబడ్డీ జట్టు కల్వకుర్తిరూరల్: జనగామలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలుర కబడ్డీ టోర్నీలో జిల్లా జట్టు ఉత్తమ ప్రతిభ కనబరిచి సమీ ఫైనల్‌కు చేరింది. ఆదివారం సూర్యాపేట జట్టుపై విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి యాదయ్యగౌడ్ తెలిపారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వాలు వనపర్తి విద్యావిభాగం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని.. నూతన జాతీయ విద్యావిధానం తీసుకొచ్చి కాషాయీకరణ చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతున్నాయని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని యాదవ సంఘం భవనంలో సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కె.పవన్‌కుమార్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్ఛలవిడిగా అనుమతులివ్వడంతో పాటు మతం, కులం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు పెడుతున్నాయని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థినులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి కనీసం విద్యాశాఖకు మంత్రిని కూడా కేటాయించకుండా పాలన సాగిస్తోందని, విద్యారంగంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.7,800 కోట్లకుపైగా స్కాలర్షిప్లు, ఫీజు రియింబర్స్మెంట్లు బకాయి ఉన్నాయని.. విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించడంతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అనంతరం పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్ సుల్తానా మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీస వసతులు, ల్యాబ్స్ లేవని, తక్షణమే స్పందించి వసతులు కల్పించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తయ్యన్న, రాజు, వెంకటేశ్‌గౌడ్, యశ్వంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రి చలి ఉంటుంది. మంచు కురుస్తుంది. ఒంటికాలిపై నిలబడి నిరసన కందనూలు: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఆదివారం సమగ్రశిక్ష ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో కొల్లాపూర్ పట్టణానికి చెందిన వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు అన్ని అనర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కూడా లేవన్నారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. మత్స్య సంపదను కొల్లగొడితే సహించం కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ ప్రాంతంలోని కృష్ణానదిలో మత్స్య సంపదను కొల్లగొడితే సహించమని జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు అన్నారు. ఆదివారం సింగోటంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి, కాలూరు, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి కోతిగుండు, అంకాలమ్మ కోట, లింగమయ్య పెంట గ్రామాల సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్‌లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు అలివి, చార్మిన్ వలలతో చేపపిల్లలను వేటాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన 10వేల మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యసంపద దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో సంఘం సభ్యులు ఉన్నారు. -
స్పందనకు సలాం..
‘సాక్షి’ కథనాలకు కదలిన యంత్రాంగం సీరియల్ కిల్లర్ గుట్టు రట్టు.. ● బాలకార్మికుల విముక్తి, చెంచుల సమస్యలపై అక్షర పోరాటం ● 11 మందిని మట్టుపెట్టిన మాయల మాంత్రికుడి బాగోతం బట్టబయలు ● జిల్లావ్యాప్తంగా అనేక సమస్యలు వెలుగులోకి.. ● స్పందించి చింత తీర్చిన అధికారులు ● ఈ ఏడాది ‘సాక్షి’ ఎఫెక్ట్ కథనాలపై ఇయర్ రౌండప్ సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలు, ఇబ్బందులపై ‘సాక్షి’ అక్షరయాత్రను కొనసాగిస్తోంది. ప్రజల ఇక్కట్లను ఎప్పటికప్పుడు వార్తాకథనాల రూపంలో ప్రభుత్వం, అధికారుల కళ్ల ముందు ఉంచింది. జిల్లాలో దుర్భర జీవితం సాగిస్తున్న చెంచుల ప్రధాన సమస్యలపై పలు కథనాలను ప్రచురించింది. నల్లమల ప్రాంతంలో వెట్టిచాకిరి బారిన పడిన చెంచు బాలకార్మికుల గోసను ప్రచురించి.. వారికి విముక్తి కల్పించింది. మాయలు మంత్రాల పేరుతో అమాయకులను బలి తీసుకుంటున్న మాయల మాంత్రికుడి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. ‘సాక్షి’ వార్తాకథనాలకు స్పందించిన అధికారులు.. ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది కాలంలో ‘సాక్షి’ ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించి.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేసిన తీరుపై ఇయర్ రౌండప్. చెర నుంచి బాలలకు విముక్తి.. అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ (బీకే) తండాలో ఓ వ్యక్తి ముగ్గురు చిన్నారులను పశువుల కాపరులుగా పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా చెంచు చిన్నారులను పనిలో పెట్టుకుని, వారిని చిత్రహింసలు పెడుతున్న విషయం ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. బాలకార్మికులను పనిలో పెట్టుకుని హింసిస్తున్న వైనంపై గత జూలై 12న ‘బాలుడికి విముక్తి కల్పించండి’ శీర్షికన వార్తాకథనానాన్ని ప్రచురించి సమస్యను వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఐటీడీఏ అఽధికారులు, ముస్కాన్ టీం సభ్యులు ఘటనా ప్రదేశానికి వెళ్లి గ్రామంలో పనిచేస్తున్న ముగ్గురు బాలకార్మికులకు విముక్తి కల్పించారు. చెంచులకు బాసటగా.. -
‘షేక్’హ్యాండ్..!
వివరాలు 8లో u2024లో ఉమ్మడి పాలమూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల, అలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. అంతేకాదు.. రాష్ట్రంలో ఏకై క పెద్ద పార్టీగా ఆవిర్భవించి పాలనా పగ్గాలు చేపట్టింది. అధికార పార్టీ అయినా.. ఈ సంవత్సరం 2024లో జరిగిన ఉమ్మడి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికల్లో హస్తానికి చుక్కెదురైంది. రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక చోట మాత్రమే విజయం సాధించింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో గెలుపు ముంగిట బోల్తా పడింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించినా.. ఎన్నికల వేళ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సుమారు పది పర్యాయాలు పర్యటించినా.. ఫలితం లేకపోయింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ విజయంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా.. బీఆర్ఎస్ రెండు సిట్టింగ్ స్థానాలనూ చేజార్చుకుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ‘కారు’ అభ్యర్థి విజయం సాధించడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ వివరాలు 8లో u -
నా మాటే శాసనం..!
వనపర్తిపై ‘కొల్లాపూర్’ నేతల పెత్తనం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఇది నా మాట.. నా మాటే శాసనం’.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. దీన్ని వణికిపుచ్చుకున్నట్టున్నారు ఉమ్మడి పాలమూరుకు చెందిన కొందరు కీలక నేతలు. తమ మాటే శిరోధార్యం.. అందరూ పాటించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధుల నీడన వారి ముఖ్య అనుచరులు సైతం చాప కింద నీరులా తమ ప్రాభవాన్ని చాటుతూ.. పెత్తనం చెలాయిస్తున్నారు. పార్టీపరమైన వ్యవహారాలతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో తలదూరుస్తూ చక్రం తిప్పుతున్నారు. పోలీస్స్టేషన్లలో పేచీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తదితర పనులకు సంబంధించి తమ హవానే కొనసాగిస్తూ.. పై‘చేయి’ సాధిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేడర్‌లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. గద్వాల, నాగర్‌కర్నూల్‌లో.. గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు సరిత మధ్య వైరం కొనసాగుతోంది. కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి కొల్లాపూర్‌కు చెందిన కీలకనేతనే కారణమని పార్టీలో ఇదివరకే ప్రచారం ఉంది. ఈ క్రమంలో సరితను కాదని ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తికి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ ఆయన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ జిల్లాతో పాటు నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ శాఖల అధికారులు, పోస్టింగ్‌లు, పైరవీలు ఇతరత్రా అంశాల్లో సదరు కీలకనేత, ఆయన అనుచరులదే పైచేయిగా నిలవడంతో స్థానిక నేతలు, శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌తోపాటు గద్వాల జిల్లాపై సైతం.. నారాయణపేటపై ‘కొడంగల్’ ముద్ర స్థానిక ప్రజాప్రతినిధులు, శ్రేణుల్లో అసంతృప్తి ఒత్తిళ్లతో తలపట్టుకుంటున్న అధికారులు -
మామిడి రైతుల ఇబ్బందులు పరిష్కరిస్తాం
పెద్దకొత్తపల్లి: మామిడి తోటలు సాగు చేసిన రైతులకు మండలంలోని కల్వకోల్‌లో ఉద్యానవన శాఖ, ఏపీఈడీఏ ఆధ్వర్యంలో తోటల నిర్వహణపై జిల్లా హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏజీఎం నర్సయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసిందన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగు అవుతున్నాయని, దీంతో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాను మెగా క్లస్టర్‌గా కేటాయించిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం మామిడి పంటకు ముందు, పంట దశలో కోత అనంతరం సంబంధించిన యాజమాన్య చర్యలు సకాలంలో చేపడుతూ మామిడి విలువ ఆధారిత ఉత్పత్తులను పెంపొందించడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ రవాణా, మార్కెటింగ్, బ్రాండింగ్ విలువలను పెంచుతూ దేశ, విదేశీయ మార్కెట్లలో రైతులు మామిడి పండ్లను అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 53 ఉద్యాన క్లస్టర్లను గుర్తించగా పైలెట్ బేసిన్లో మహబూబ్‌నగర్ జిల్లాను ఎంపిక చేసిందన్నారు. కొల్లాపూర్ మామిడికి ఎంతో గుర్తింపు ఉందన్నారు. పాలెం ఉద్యానవన శాస్త్రవేత్త జ్యోతి మాట్లాడుతూ మామిడి రైతులు నెలవారిగా తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఎరువులు, చీడపీడల నివారణ, నీటి తడులు, పూత, పిందె దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఈడీఏ అధికారి భాషా, ఉద్యానవన అధికారి లక్ష్మణ్, ఏఓ శిరిష, ఏఈఓలు సుధ, అజయ్, మామిడి రైతులు పాల్గొన్నారు. -
వనపర్తిలో రాజుకున్న చిచ్చు..
వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మధ్య పోరు నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సైతం మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఇలా నువ్వా, నేనా అన్నట్లు ఇరు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుండగా.. కొల్లాపూర్‌కు చెందిన కీలక నేత ఒకరు, ఆయన ముఖ్య అనుచరులు వనపర్తి నియోజకవర్గ పరిధిలో పెత్తనం చెలాయించేలా వ్యవహరిస్తుండడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వనపర్తిలోని పలు ప్రభుత్వ శాఖల్లో కీలక పోస్టింగ్‌లు, బదిలీలు, పైరవీల్లో కొల్లాపూర్ నేతలు తమ మార్క్‌ను ప్రదర్శించడంతో పాటు ప్రతి అంశంలో జోక్యం చేసుకుంటున్నట్లు ఇటీవల వెలుగులోకి రాగా.. పార్టీలో కలకలం చెలరేగింది. ఈ క్రమంలో వనపర్తి సెగ్మెంట్లో స్థానిక, స్థానికేతర లొల్లి మరోసారి రాజుకున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి
తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలలో కృత్యాధార విధానం ద్వారా ఉపాధ్యాయులంతా తరగతి బోధన చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శనివారం మండలంలోని రాకొండ కేజీబీవీ, తెలకపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్లో పదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో ఉపాధ్యాయుల బోధన, ప్రక్రియను విద్యార్థులతో కలిసి కూర్చొని పాఠ్యాంశాలు విన్నారు. కేజీబీవీ విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల బోధన, పద్ధతులను పరిశీలించారు. ప్రతి ఉపాధ్యాయుడు 5 అంశాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే ప్రభుత్వ పాఠశాలల విద్యా బలోపేతం అవుతుందన్నారు. పట్టుదలతో పనిచేస్తే పాఠశాల స్థాయి మరింత ఉన్నతంగా మారుతుందని, తద్వారా రాబోయే తరం నాణ్యమైన సమాజాన్ని నిర్మిస్తుందన్నారు. రానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానంలో నిలిపాలని సూచించారు. ఉపాధ్యాయుల హాజరుపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, సెలవుపై వెళ్తున్న వారు ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. కేజీబీవీల పర్యవేక్షణాధికారి శోభారాణి, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.