ఊర్కొండ/ వెల్దండ: మండలంలోని ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామిని శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌బాబు, మహబూబ్‌నగర్ జడ్జి శ్రీదేవి, కల్వకుర్తి జడ్జి కావ్య దర్శించుకున్నారు. అంతకు ముందు వారికి ఆలయ కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పాలక మండలి సభ్యులు జడ్జిలను శాలువాలతో సన్మానించారు. వారి వెంట ఎస్‌ఐ కృష్ణదేవ తదితరులున్నారు. అలాగే ఊర్కొండపేట ఆంజనేయస్వామి ఆలయానికి ధ్వజస్తంభాన్ని బహూకరించిన హర్షవర్ధన్‌రెడ్డిని ఆలయ పాలక మండలి చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సభ్యులు సన్మానించారు. అనంతరం ధ్వజస్తంభం ఏర్పాటు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అర్చకులు దత్తాత్రేయశర్మ, శ్రీనుశర్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
గుండాలలో ప్రత్యేక పూజలు
వెల్దండ మండలంలోని గుండాల అంబారామలింగేశ్వరస్వామి ఆలయంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్‌బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు కల్వకుర్తి కోర్టు సివిల్ జడ్జి శ్రీదేవి, కావ్య శివుడికి అభిషేకాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సందీప్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, మల్లేష్, అంజయ్య, ఈఓ ప్రసాద్, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, అర్చకులు శివకుమార్‌శర్మ, నరహరిశర్మ, సంతోష్‌శర్మ, సురేష్‌శర్మ, కృష్ణయ్యశర్మ, కిషన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
ప్రతిఒక్కరికి
బీమా తప్పనిసరి
నాగర్‌కర్నూల్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిఒక్కరు జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని వనపర్తి డివిజన్ తపాలా పర్యవేక్షకులు భూమన్న అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని తపాలా ప్రమాద బీమా పాలసీ సేకరణ కేంద్రాలను సందర్శించారు. అంతకు ముందు తపాలా కార్యాలయం వద్ద నాగర్‌కర్నూల్ ఎంపీడీఓ కోటేశ్వర్ తపాలా బీమా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ పర్యవేక్షకుడు భూమన్న మాట్లాడుతూ కేవలం తక్కువ డబ్బులతో ఎక్కువ బీమా పొందవచన్నారు. రూ.వెయ్యి చెల్లిస్తే ఏడాదిపాటు రూ.15 లక్షలు బీమా వర్తిస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్మికులు, ఉపాధి, అంగన్‌వాడీ, యువకులకు ఈ ప్రమాద బీమా చేయించాలని గ్రామీణ తపాలా సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్పీఎం గఫార్, సిబ్బంది మహ్మద్ ఖాన్, జగన్ పాల్గొన్నారు.
‘ప్రాధాన్యత రంగాలను విస్మరించారు’
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధాన రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించలేదని సీపీఎం జిల్లా నాయకుడు ఎండి జబ్బార్ ఆరోపించారు. శనివారం మండలంలోని బొల్లారం గ్రామంలో నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకెల గారడీతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడం, జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కృతనిశ్ఛయంతో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 100 శాతం పంట రుణమాఫీ, రైతుభరోసా, మహాలక్ష్మీ పథకం, కొత్త ఆసరా పింఛన్లు, వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా వంటి పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కందులు క్వింటాల్ రూ.6,821
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,821, కనిష్టంగా రూ.5,659 ధరలు లభించాయి. అదేవిధంగా కందులు గరిష్టంగా రూ.6,889, కనిష్టంగా రూ.6,680, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,280, కనిష్టంగా రూ.2,027, జొన్నలు గరిష్టంగా రూ.4,527, కనిష్టంగా రూ.4,027, ఆముదాలు గరిష్టంగా రూ.6,345, కనిష్టంగా రూ.6,225 చొప్పున ధరలు వచ్చాయి.
అంజన్నను దర్శించుకున్న న్యాయమూర్తులు


