నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి
కల్వకుర్తి టౌన్: వైద్యుల నిర్లక్ష్యం, 108 సిబ్బంది కాలయాపన వెరసి నిండు బాలింత బలైంది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్యామల(23) రెండో కాన్పు కోసం కల్వకుర్తిలోని సీహెచ్‌సీకి సోమవారం వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మంగళవారం ఉదయం సీజేరియన్ చేసి.. ఆడబిడ్డకు పురుడు పోశారు. సిజేరియన్ తర్వాత ఆమెను సరిగా పరిశీలించకుండానే వైద్యులు సాధారణ వార్డులో ఉంచారు. అయితే బాలింతకు బ్లీడింగ్ అవుతుందని, ఆగడం లేదని వైద్యులకు చెబితే అబ్జర్వేషన్‌లో ఉంచాల్సింది పోయి రక్తం ఎక్కించి చేతులు దులుపుకొన్నారు. డ్యూటీలో ఉన్న వైద్యులు, ఓపీ సమయంలో ఉన్న వైద్యులు సైతం ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి విషయం చెప్పలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. చివరికి సాయంత్రం పరిస్థితి బాగోలేదని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని చెప్పారు.
కాలయాపన చేసిన 108 డ్రైవర్
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తే.. అంబులెన్స్ డ్రైవర్ సైతం కాలయాపన చేశాడని కుటుంబీకులు ఆరోపించారు. చివరి నిమిషంలో వైద్యులు చెప్పడంతో 108కి కాల్ చేస్తే నేను ఇప్పుడు రాలేను.. రంజాన్ ఉపవాసంలో ఉన్నాను, ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడుకొని వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చాడని వాపోయారు. 108 డ్రైవర్‌ను గంటపాటు బతిమాలిన అతను రాకపోవడంతో, చివరికి ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా.. పరిస్థితి విషమించి బాలింత చనిపోయింది. గంట ముందుగా వచ్చినట్లయితే ప్రాణం మిగిలేదని, మార్గమధ్యలో ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారు. బాలింత మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇదే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాంను వివరణ కోరగా.. కాన్పు బాగానే జరిగినా సమస్యను గుర్తించి రెఫర్ చేశామన్నారు. అంబులెన్స్ డ్రైవర్ అలా చెప్పి ఉండాల్సింది కాదని, చివరకు వేరే డ్రైవర్‌ను అయినా ఏర్పాటు చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యం, 108 సిబ్బంది
కాలయాపనతో బాలింత మృతి
Comments
Please login to add a commentAdd a comment