
రికవరీ ఎప్పుడో?
నాగర్‌కర్నూల్ బల్దియాలో జీతాల పేరుతో రూ. కోటికి పైగా పక్కదారి
విచారణ కొనసాగుతోంది..
మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. సిబ్బంది జీతాల పేరుతో నిధులు పక్కదారి పట్టిన సమయంలో ఇక్కడ పనిచేసిన వారందరూ విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశాం. త్వరలోనే పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– కనకయ్యగౌడ్, సీఐ, నాగర్‌కర్నూల్
నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీగా ఏర్పడిన నాటి నుంచి అవినీతి పరంపర కొనసాగుతోంది. అవినీతి జరిగిన ప్రతీసారి కొన్ని రోజులపాటు హడావుడి చేయడం.. ఆ తర్వాత విషయం కనుమరుగైపోవడం పరిపాటిగా మారింది. గతేడాది మున్సిపాలిటీలో జీతాల పేరుతో రూ. 1.08 కోట్లు పక్కదారి పట్టినట్లు తేలింది. అయితే ఇందుకు బాధ్యులైన ఓ పర్మినెంట్ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు వేయగా.. మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవినీతి ఉద్యోగులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ విషయంలో మాత్రం ఆశలు సన్నగిల్లుతున్నాయి. సదరు వ్యక్తులు నిధులను ఏ ఖాతాల్లోకి మళ్లించారు.. వాటిని ఎలా రికవరీ చేయాలనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత కరువైంది. దీంతో గతంలో జరిగిన అవినీతి మాదిరిగానే నిధుల పక్కదారి అంశం కూడా కనుమరుగవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెరపైకి మరికొందరి పేర్లు..
మున్సిపాలిటీలో జరిగిన అవినీతికి ఇద్దరిని బాధ్యులను చేస్తూ కేసులు నమోదు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇందులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం మాత్రం బహిర్గతం కావడం లేదు. అయితే చర్యలు తీసుకోబడిన ఇద్దరు వ్యక్తులు మాత్రం ఈ అవినీతిలో మరికొంత మందికి భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, అకౌంటెంట్ల పేర్లతో పాటు ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పినట్లు సమాచారం. కాగా, సదరు అధికారులు, సిబ్బంది విచారణకు హాజరు కావాలని ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఒకరిద్దరు అధికారులు హాజరైనా.. పూర్తిస్థాయిలో విచారణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 2020 నుంచి గత సంవత్సరం వరకు జీతాల విషయంలో ఈ అవినీతి జరగడంతో.. అప్పటి అధికారులు సైతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అధికారులు, ఇతర సిబ్బంది అండదండలు లేకుండా ఇద్దరు సిబ్బంది ఇంత పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడతారా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈ విషయంలో ఆ ఇద్దరినే బలి పశువులను చేస్తారా? లేక పూర్తి స్థాయిలో విచారణ చేసి.. అవినీతి బాగోతం వెనకున్నవారిని కనిపెట్టి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
ఇద్దరు ఉద్యోగులపై చర్యలకే పరిమితం
అవినీతి సొమ్ము రికవరీపై కనిపించని శ్రద్ధ

రికవరీ ఎప్పుడో?