
ఆరోగ్య సమస్యల నుంచి ఆత్మహత్యల దాకా..
ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, మహిళలతో సహా కల్తీ కల్లుకు బానిస అవుతున్నారు. ఏళ్ల తరబడి కల్తీ కల్లు సేవిస్తుండటంతో ప్రధానం మెదడు, నాడీ వ్యవస్థ, లివర్ భాగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చివరికి నోటి నుంచి మాటరాని పరిస్థితికి చేరుకుంటున్నారు. కల్తీకల్లులో వినియోగిస్తున్న మితిమీరిన మత్తు పదార్థాలతో పూర్తిగా బానిసై కల్లు మానేయలేని స్థితికి చేరుకుంటున్నారు. విపరీతమైన మత్తులో గొడవలు పడటం, కుటుంబ కలహాలు, మహిళలపై చేయి చేసుకోవడంతో పాటు క్షణికావేశంలో తమవారినే అంతమొందించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మత్తులో డిప్రెషన్‌కు గురికావడం, తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు.