లింగాల: మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం అందుబాటులోకి తపాలా శాఖ సేవలను విస్తరిస్తున్నట్లు వనపర్తి డివిజన్ ఎస్‌పీఓ భూమన్న అన్నారు. మండలంలోని రాయవరం గ్రామ పంచాయతీకి నూతనంగా మంజూరైన బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాయవరంలో బ్రాంచి పోస్టాఫీసు ఏర్పాటు చేయాలని ప్రజలు చాలా కాలంగా కోరుతున్నారన్నారు. ఈ బ్రాంచి పోస్టాఫీసు పరిధిలోకి కొత్తచెర్వుతండా, పాతరాయవరం, వడ్డెబక్కనగూడెం గ్రామాలు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాయవరంతోపాటు ఇతర గ్రామాల వారు అంబట్‌పల్లి పోస్టాఫీసుకు వెళ్తూ ఇబ్బందులకు గురయ్యేవారని, ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్టాఫీసు ద్వారా ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల డబ్బులు, ఇతరత్రా సేవలు ప్రజలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారులు సృజన్‌నాయక్, రవికుమార్, ప్రసాద్, రవికుమార్, బ్రాంచి పోస్టాఫీస్ ఇన్‌చార్జ్ బాలాజీనాయక్, నాయకులు మల్లయ్య, తిరుపతిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.