అక్రమార్కులకు కలిసొచ్చిన సన్నబియ్యం పంపిణీ
అందని మార్గదర్శకాలు..
ప్రభుత్వం ఈ నెల 1 నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే ఉన్న పాత దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వ స్టాక్ పాయింట్లకు అప్పగించాల్సి ఉంది. కానీ, చాలాచోట్ల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా పక్కదారి పట్టించారు. రేషన్ షాపులకు కేటాయించిన స్టాక్ మేరకు మిగిలిన బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకపోతే వారి నుంచి ఈ మేరకు డబ్బులు వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ రేటు కన్నా అధిక ధరలకు దొడ్డుబియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. రైస్ మిల్లుల్లో కేటాయించిన మేరకు ప్రభుత్వానికి సీఎమ్మార్ ఇవ్వకుండా పెద్దఎత్తున రేషన్‌బియ్యాన్ని నిల్వ చేసుకుని సీఎమ్మార్‌గా చూపుతూ దందా సాగిస్తున్నారు.
ప్రభుత్వానికి
అప్పగించాల్సిందే..
ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం రేషన్ దుకాణాల వద్ద ఉన్న పాత బియ్యం స్టాక్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మిల్లుల్లోని దొడ్డు బియ్యాన్ని సైతం ఎఫ్‌సీఐకి అప్పగించాలి.
– రాజేందర్, పౌర సరఫరాల
శాఖ మేనేజర్, నాగర్‌కర్నూల్
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా ఇప్పటి వరకు కొనసాగుతున్న రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు తెరపడుతుందని భావిస్తుండగా.. ఇప్పటికే టన్నుల కొద్దీ పోగు చేసుకున్న పాత బియ్యంతో అక్రమార్కులు యథేచ్ఛగా దందా కొనసాగిస్తున్నారు. పాత దొడ్డు బియ్యాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్టాక్ పాయింట్లు, ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా.. ఎక్కడికక్కడ నిల్వ చేసుకుని, అక్రమ రవాణా చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కొత్తపేటలో ఉన్న రైస్‌మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సీజ్‌చేసిన మిల్లులో..
పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్‌మిల్లు గతంలో సీఎమ్మార్ కింద బియ్యం ఇవ్వకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. అయితే ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా, అక్రమ దందా చేయడంతో సీజ్ చేసినప్పటికీ మళ్లీ దందా కొనసాగిస్తుండటం గమనార్హం. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు డీసీబీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, ఆనంద్‌కుమార్ రైస్‌మిల్లుపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో రైస్‌మిల్లులో 600 బస్తాల్లో నిల్వ చేసిన 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. ఈ మిల్లు కేంద్రంగా పెద్దఎత్తున రేషన్ బియ్యాన్ని నిల్వ చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వచేస్తూ దందా చేస్తున్న మిల్లు యజమాని సునీల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల రైస్‌మిల్లుల్లో పెద్ద ఎత్తున రేషన్‌బియ్యాన్ని నిల్వ చేస్తూ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు.
ఇప్పటికే ఎక్కడికక్కడ దొడ్డు బియ్యం డంపు చేసిన మిల్లర్లు
పాతవి స్టాక్ పాయింట్లకు తరలించకుండా దందా
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి
తాజాగా పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ రైస్‌మిల్లులో 300 క్వింటాళ్ల దొడ్డు బియ్యం స్వాధీనం