
బెట్టింగ్ భూతం..!
పందాలతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న యువత
● ఐపీఎల్ సీజన్‌లో పందెంరాయుళ్ల బిజీ
● జోరుగా క్రికెట్ బెట్టింగ్
● బలవుతున్న యువత
● యాప్‌ల్లో మోసపోతున్నా..
బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
కేసులు నమోదు చేస్తాం..
బెట్టింగ్ ఆడుతున్నట్లు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తాం. అనుమానం ఉన్న వ్యక్తులపై, గ్రామాల్లో నిఘా పెంచుతాం. ఇప్పటి వరకు బెట్టింగ్‌ల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. యువత చెడు మార్గాలకు దూరంగా ఉండాలి.
– శ్రీనివాసులు, డీఎస్పీ, అచ్చంపేట
అచ్చంపేట రూరల్: కొందరు యువత ఆటను ఆస్వాదిస్తుండగా.. మరికొందరు సొమ్ము చేసుకోవాలని ఆశపడి బోల్తా పడుతున్నారు. బెట్టింగ్‌లతో జేబులు గుల్లా చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ చోట క్రికెట్ ఆడినా.. ఎలాంటి ఫార్మాటైనా పందెం ఆడుతూ బానిసలుగా మారుతున్నారు. బెట్టింగ్‌లతో జరగాల్సిన నష్టం జరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గతంలో పట్టణాలు, నగరాల్లోనే బెట్టింగ్‌లు జరిగేవి. సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా బెట్టింగ్ భూతం పట్టి పీడిస్తోంది. ఐపీఎల్ సీజన్‌లో బెట్టింగ్‌ల జోరుతో పందెం రాయుళ్లకు పండుగ వాతావరణం నెలకొంది.
పల్లెలకు పాకిన పందెం..
చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ పల్లెల్లోకూ వ్యాపించింది. గ్రామీణ యువత కొందరు తమ సెల్‌ఫోన్‌లో బెట్టింగ్‌లకు సంబంధించిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్ పేమెంట్ విధానంతో పందెం కాస్తున్నారు. మరికొందరు ఆఫ్‌లైన్ విధానంలోనూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఆఫ్‌లైన్‌కు సంబంధించి ఓ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తతంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో యువత ఓ దగ్గర కూర్చొని బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్, ప్లేయర్ల స్కోర్, వికెట్లపై బెట్టింగ్ కడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కోడ్ భాషతో మాట్లాడుకుంటూ పందెం కాస్తున్నారు. ప్రతి ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ ఉండటంతో ఎప్పటికప్పుడు పందెం రాయుళ్లకు సమాచారం అందించి లావాదేవీలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యువత ఆసక్తి, సరదా పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.
విదేశాల్లోనూ సంబంధాలు..
దేశానికి చెందిన కొంత మంది యువకులు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి వారితో మన దేశంలో ఉన్న యువతకు పరిచయాలు ఉండటంతో వారితోనూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ ఆడుతున్నారు. పందెంలో గెలిచిన వారికి ఓడిన వారు మరుసటి రోజు ఉదయం డబ్బులను అకౌంట్‌లో వేస్తారు. మధ్యవర్తిగా ఉన్న వారు 10 – 15శాతం కమీషన్ తీసుకుంటున్నారు. తెలిసిన వారు ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే.. తాము ఎంచుకున్న యాప్ అధికారికమని, ఐటీ కూడా చెల్లిస్తున్నామని చెప్పుకొస్తున్నారు.
అప్పుల ఊబిలో
యువత..
యువతకు బెట్టింగ్ ఓ వ్యసనంలా మారింది. కొందరు ఎలాంటి పనులు చేయకుండా బెట్టింగ్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే పట్టణాలతో పాటు పల్లెల్లోనూ బెట్టింగ్‌లతో డబ్బులు నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. చివరకు అప్పులపాలై ఆత్మహత్యకు యత్నిస్తున్నారు. మరికొందరు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. బెట్టింగ్‌ను అరికట్టకపోతే పెను ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదు. సరదా కోసం బెట్టింగ్ కాసిన ఎంతో మంది వ్యసనంలా మార్చుకుంటున్నారు. ఐపీఎల్ సీజన్‌లో పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

బెట్టింగ్ భూతం..!