
కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
తాడూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం తగదని.. కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోకన్వీనర్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. తాడూరు మండలం పాపగల్‌లో ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరంతర పోరాటాలతోనే కార్మికుల డిమాండ్లు సాధ్యమవుతాయన్నారు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు, రాంచంద్రయ్య, కృష్ణయ్య, చెన్నయ్య, బాలయ్య పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల్లో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 52 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు పాలమూరు క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీ లకు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
తుర్క కాశలను
ఆదుకోవాలని వినతి
స్టేషన్ మహబూబ్‌నగర్: అన్ని రంగాల్లో వెనుకబడిన తుర్క కాశ (బీసీ–ఈ)లను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా ప్రతినిధులు ఆదివారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ–ఈ 14 నంబర్‌లో తుర్కకాశ, పత్తార్‌పోడ్‌లుగా పిలవబడే ముస్లిం కులస్తులు బండలు కొట్టుకుంటూ అరకొర జీవనాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తుర్కకాశలకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ, ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం కొత్వాల్‌ను ఘనంగా సన్మానించారు. తుర్క కాశ కార్మిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ జుబేర్, ఉపాధ్యక్షుడు షేక్ ఖాజా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అబుబకర్, సలహాదారులు చోటో హుస్సేన్‌మియా, జిల్లా ఇన్‌చార్జీ పాష, మహెబూబ్ పాల్గొన్నారు.

కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి