
మహనీయుడు.. జగ్జీవన్‌రాం
నాగర్‌కర్నూల్: ‘సామాజిక న్యాయం, సమానత్వం కోసం అట్టడుగు వర్గాల తరపున అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్‌రాం అని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డితో కలిసి కలెక్టర్ బాబు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రాం దేశ రాజకీయాల్లో ఎంతో ప్రభావవంతమైన నాయకుడిగానే కాకుండా, నిస్వార్థ సేవ, న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలిచారని, సామాజిక శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి, నిస్వార్థంగా కొనసాగించిన ఉద్యమాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక సమానత్వం, ఐక్యత, విలువలను పాటించాలని, ఆయన చూపిన మార్గం, ఇచ్చిన సందేశం మనకు నిరంతర స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ జగ్జీవన్‌రాం గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడని, ప్రజాప్రతినిధిగా తనదైన ముద్రను వేశారన్నారు. దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరువలేనిదని, భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారని, ఆయన ఆదర్శంగా యువత ముందుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్‌రాం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఏఎస్‌డబ్ల్యూఓ శ్రీకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.