నాగర్‌కర్నూల్ క్రైం: క్షయవ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయవ్యాధిపై క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ వందరోజుల నిక్షయ్ శిబిర్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 250 క్యాంపులు నిర్వహించి 1,37,325 మంది అనుమానితులను (మధుమేహ వ్యాధిగ్రస్తులు, పొగ తాగేవారు, క్షయవ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులు, మద్యపానం చేసేవారిని) పరీక్షించి, ఎక్స్‌రే 7,717, సీబీ నాట్ కళ్లె పరీక్షలు 2,061, మైక్రోస్కోపిక్ కళ్లె పరీక్షలు 250 మందికి జరిపి కొత్తగా 511 క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. క్షయవ్యాధి సంపూర్ణ చికిత్సతో పూర్తిగా నయమవుతుందని, క్షయ వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెల వారి బ్యాంక్ అకౌంట్‌లో రూ.వెయ్యి జమ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాసు, ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు సంతోష్ అభిరాం, వాణి తదితరులు పాల్గొన్నారు.
జన్యుపరలోపంతో సికిల్ సెల్ అనీమియా
సికిల్ సెల్ అనీమియా జన్యుపరమైన లోపంతో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సికిల్ సెల్ అనీమియాపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణంగా ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుందని, కానీ.. సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి వాటి జీవితకాలం 10– 20 రోజులకు తగ్గుతుందన్నారు. ఈ వ్యాధి గిరిజనులలో అధికంగా ఉంటుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 59,154 మంది గిరిజనులకు సికిల్ సెల్ ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. సికిల్ సెల్ బాధితులు దివ్యాంగుల కోటా కిందికి వస్తారని, వీరికి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే అన్ని ఉచిత పథకాలు వర్తిస్తాయన్నారు.