
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారత సాధించే విధంగా ప్రోత్సహిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా అత్యాధునిక వసతులతో మహిళా సమాఖ్య భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రూ.5 కోట్ల నిధులతో పట్టణంలోని సర్వే నం.29లో 786 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 13 గదులతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనం, మహిళల శిక్షణ కార్యక్రమాలు, సమావేశాలు, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, కార్యాలయ వినియోగం, సామూహిక చర్చలకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేసినట్లు వివరించారు. మహిళా సమాఖ్య భవనం నిర్మాణం పూర్తయితే గ్రామీణ మహిళలకు మరింత శిక్షణ అవకాశాలు, సామూహిక కార్యాచరణకు వేదికలు, పాలకవర్గాల సమావేశాలు నిర్వహించుకునే అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. మహిళల అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ తబితారాణి, పీఆర్‌ఏఈ శివకృష్ణ తదితరులు ఉన్నారు.