
నిబంధనలకు పాతర..!
జిల్లాలో అధ్వానంగా హోటళ్ల నిర్వహణ
● అపరిశుభ్రంగా
వంట గదులు, పరిసరాలు
● కల్తీ సరుకులు, నూనెలు
● నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న అధికారులు
అచ్చంపేట రూరల్: ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలని ప్రభుత్వం వైద్య, పంచాయతీ అధికారులు, కొందరు స్థానికులతో కలిపి ఆహార కమిటీలను నియమించింది. సభ్యులు హోటళ్లు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న కేంద్రాలను తనిఖీ చేసి నాణ్యతను పరిశీలించారు. కానీ నామమాత్రపు తనిఖీలు చేపడుతుండటంతో జిల్లాలో హోటళ్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా శుభ్రతను పాటించకుండా వ్యవహరిస్తున్నారు.
యథేచ్ఛగా హోటళ్లు, టిఫిన్ సెంటర్ల ఏర్పాటు..
జిల్లాలోని అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంత్లాలో భోజన ప్రియులను ఆకర్షించేలా హోటళ్లు, దాబాలు, టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. నిర్వాహకులు వాటిని అందంగా తీర్చిదిద్దడానికి ఇస్తున్న ప్రాధాన్యత.. ఆహార నాణ్యతలో పాటించడం లేదు. తయారీలో వినియోగించే సరుకులు, నూనెలు, ఇతర సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. ప్రారంభంలో నాణ్యతగా పాటించి రానురాను తగ్గిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వంట గదులు ఇరుకుగా ఉండటంతో కుప్పలు కుప్పలుగా ఈగలు, బొద్దింకలు సంచరిస్తుంటాయి. కల్తీ పదార్థాలు తిని అనేక మంది రోగాలబారిన పడుతున్నారు.
బోటీ కర్రీలో ఎలుక..
అచ్చంపేటలోని ఓ హోటల్‌లో వినియోగదారుడు శుక్రవారం సాయంత్రం బోటీ కర్రీని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. భోజన సమయంలో తెరిచి చూడగా అందులో ఎలుక కనిపించింది. పార్సిల్‌ను తీసుకొని హోటల్ నిర్వాహకుడిని నిలదీయడంతో పాటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం ఆ హోటల్‌తో పాటు మరో హోటల్‌ను తనిఖీ చేసి నమూనాలు సేకరించారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని పలు హోటళ్లలో జరుగుతున్నా.. కొందరు మేనేజ్ చేసుకొని నడిపిస్తున్నారు. వంట గదులు అపరిశుభ్రంగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆహార పదార్థాల్లో బొద్దింకలు, బల్లులు పడిన ఘటనలూ ఉన్నాయి. ఫ్రిజ్‌లలో మాంసాన్ని నిల్వచేసి అవసరం ఉన్న సమయంలో కూరలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.
కేసులు నమోదు చేస్తాం..
జిల్లాలోని హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. బేకరీల్లో ఆహార పదార్థాలు నిల్వ చేయొద్దు.. ఏ రోజుకారోజు తయారుచేసి విక్రయించాలి. పలు హోటళ్లల్లో తనిఖీలు చేసి నమూనాలు సేకరించాం. నిబంధనలు పాటించని హోటళ్లను మూసి వేయిస్తాం.
– మనోజ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్

నిబంధనలకు పాతర..!