
‘వక్ఫ్ చట్టం సవరణతో పేద ముస్లింలకు మేలు’
కందనూలు: ప్రధాని మోదీ తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంతో పేద ముస్లింలకు మేలు చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అఫ్సరపాషా అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వక్ఫ్ బోర్డుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేద ముస్లింకు ఈ చట్టం ఉపయోగపడలేదని, ఏళ్లుగా ఈ ఆస్తులు బడా బాబులకు మాత్రమే చెందాయని, కొత్త చట్టంతో దోపిడీని అరికట్టే అవకాశం వచ్చిందన్నారు. నరేంద్రమోదీ ముస్లింలకు చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొన్ని రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని.. ముస్లిం సమాజం నమ్మవద్దని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, మైనార్టీి మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సుబ్బారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గప్రసాద్, మాయని శ్రీశైలం, సుధాకర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్‌చారి, మహిళా నాయకురాలు పద్మ, చంద్రకళ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాయినోనిపల్లికి
తగ్గిన రద్దీ
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. కేవలం 5 వేల మంది భక్తులు మాత్రమే వచ్చారని ఆలయ ట్రస్ట్ చైర్మన్ తెలిపారు.
విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
కందనూలు: విద్యార్థులు ఉత్తమ చదువుతో ఉన్నత స్థానానికి ఎదగాలని విశ్రాంత డీజీపీ డా. పుట్టపాగ రవీంద్రనాథ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో ఐక్యత సమాజ సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించి పుట్టపాగ మహేంద్రనాథ్ స్మారక విద్యా పురస్కారాలు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన పేద విద్యార్థులు మంచి మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. తన తండ్రి మహేంద్రనాథ్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ఐక్యత సమాజ సంస్థ ప్రతినిధులు కళ్యాణం నర్సింహ, భగవేణి నర్సింహులు, బాలరాజు, డా. రాఘవులు, న్యాయవాది రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
హిందువులు
చైతన్యం కావాలి
తిమ్మాజిపేట: మారుమూల గ్రామాల్లోని హిందువులు సైతం చైతన్యం కావాల్సిన అవరం ఉందని విశ్రాంత ప్రొఫెసర్ హన్మంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని అప్పాజిపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన మారణకాండ ప్రజలను ఆందోళనకు గురి చేసిందని.. భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు పర్యాటకులను చంపి పర్యాటకరంగాన్ని నీరుగార్చాలని చూశాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉండటంతో పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని తెలిపారు. ఐక్యమత్యం లేకపోవడంతో కలిగే నష్టాలు, కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం స్థానికులతో కలిసి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో భిక్షపతి, నారాయణ, నర్సింహ, చంద్రయ్య, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘వక్ఫ్ చట్టం సవరణతో పేద ముస్లింలకు మేలు’

‘వక్ఫ్ చట్టం సవరణతో పేద ముస్లింలకు మేలు’