
ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా అందని జీతాలు
● ఏజెన్సీ రద్దుతో టీజీటీఎస్‌కు అటాచ్
● ప్రభుత్వ ఆదేశాలు అందక ఆగిన వైనం
● జిల్లాలో 23 మంది..
నాగర్‌కర్నూల్: జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేసే ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే అరకొర జీతాలు.. అందులో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అవికూడా సకాలంలో అందడం లేదు. సమస్యను పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నా.. ప్రభుత్వం మాత్రం దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. జిల్లాకు వచ్చే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా కూడా ఫలితం లేకపోయింది.
2018లో విధుల్లోకి ..
గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి అన్ని మండలాల తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. ఇందుకోసం తహసీల్దార్ కార్యాలయంలో గదిని ఏర్పాటుచేసి భూ రిజిస్ట్రేషన్ల కోసం ధరణి ఆపరేటర్లను నియమించింది. జిల్లాలో 23 మందిని ఆపరేటర్లుగా నియమించగా.. సుమారు ఆరేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రారంభంలో రూ.10 వేలు వేతనం చెల్లిస్తుండగా.. ప్రస్తుతం రూ.12,500 చెల్లిస్తున్నారు. మిగతా వారితో పోలిస్తే వీరి జీతాలు చాలా తక్కువే.. ప్రస్తుతం అవి కూడా సకాలంలో అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
టీజీటీఎస్‌కు అనుసంధానం..
మొదట వీరిని విధుల్లోకి తీసుకున్నప్పుడు ‘టెరాసిస్’ అనే ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేవారు. గతేడాది జనవరిలో ఏజెన్సీ కాంట్రాక్ట్ గడువు ముగియగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గడువు పెంచకుండా నిలుపుదల చేసింది. అంతేగాకుండా ఆపరేటర్లను తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ సర్వీసెస్(టీజీటీఎస్)కు అనుసంధానం చేసి ఆ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి ధరణి ఆపరేటర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. టీజీటీఎస్‌కు అనసంధానం చేయడంతో ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆశపడినా.. కనీసం వేతనాలు కూడా రాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ఇప్పట్లో వేతనాలు అందుతాయన్న నమ్మకం కూడా కలగడం లేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విషయానికొస్తే 23 మంది ఆపరేటర్లు దాదాపు 14 నెలలుగా వేతనాల కోసం వేచి చూస్తున్నారు. కేవలం జిల్లాకే రూ.40 లక్షల వరకు రావాల్సి ఉంది.
పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ధరణి ఆపరేటర్ (ఫైల్)
ఇబ్బందులు పడుతున్నాం..
ప్రభుత్వం నుంచి మాకు వచ్చే జీతమే తక్కువ. అరకొర వేతనాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆ జీతం కూడా సకాలంలో రావడం లేదు. గతేడాది ఫిబ్రవరి నుంచి వేతనాలు అందాల్సి ఉంది. తప్పని పరిస్థితుల్లో ఆపరేటర్లు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఈ విషయంపై చొరవ చూపాలి.
– రాంబాబు, జిల్లా అధ్యక్షుడు,
ధరణి ఆపరేటర్స్ అసోసియేషన్

ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా అందని జీతాలు

ధరణి ఆపరేటర్లకు 14 నెలలుగా అందని జీతాలు