Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TGIIC Lands Are Key to Govt Revenue: Telangana1
ఖజానాకు భూమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే అత్యధికంగా పారిశ్రామిక ల్యాండ్‌ బ్యాంక్‌ను కలిగిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ).. రాష్ట్ర ఖజానాకు బంగారు బాతులా మారింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సేకరణలో సర్కారుకు కల్పతరువులా ఉపయోగపడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం వంటి రిజర్వు బ్యాంకు నిబంధనల పరిధిలోకి రాకుండా రాష్ట్ర ఖజానాకు పన్నేతర ఆదాయాన్ని సమకూర్చడంలో టీజీఐఐసీ భూములు అత్యంత కీలకంగా మారుతున్నాయి.నిధులు అవసరమైనప్పుడల్లా పారిశ్రామిక అభివృద్ధి పేరిట టీజీఐఐసీ భూముల వేలం వైపు ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టుతో టీజీఐఐసీ ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల రుణం సమకూర్చినట్లు అధికార వర్గాల సమాచారం. అంతకుముందు కూడా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇటీవలి కాలం వరకు టీజీఐఐసీ భూముల ద్వారా రూ. వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వాలు సమకూర్చుకోవడం గమనార్హం. సొంతగా, హెచ్‌ఎండీఏతో కలిసి..: తెలంగాణ ఆవిర్భావం మొదలుకుని 2023 వరకు టీజీఐఐసీ భూముల వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.21 వేల కోట్లు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. టీజీఐఐసీ కొన్నిసార్లు సొంతగా, మరికొన్ని సందర్భాల్లో హెచ్‌ఎండీఏతో కలిసి భూములు వేలం వేయడంతో పాటు పరిశ్రమలకు భూముల కేటాయింపులు జరిపింది. 2014 నుంచి 2023 మధ్యకాలంలో హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ ద్వారా వివిధ సందర్భాల్లో 811 ఎకరాలను వేలం వేయడం లేదా కేటాయింపుల ద్వారా ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. తద్వారా రూ.21 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి పేరిట.. హైదరాబాద్‌ పరిసరాల్లోని కోకాపేట, ఖానామెట్‌ భూములు వేలం వేయడం ద్వారా రూ.10 వేలు కోట్లు సమీకరణ లక్ష్యంగా 2019లో సన్నాహాలు ప్రారంభించారు. ఈ మేరకు 2023లోనే జరిగిన భూముల వేలం ద్వారా రూ.2,729 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో వాణిజ్యం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల అభివృద్ధి కోసం ఈ భూములను వేలం వేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. వేలం ద్వారా సమకూరిన నిధులను రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి, హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు కోసం వెచ్చించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. 400 ఎకరాల తనఖాతో.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంచ గచ్చిబౌలి సర్వే నంబరు 25(పి)లోని 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు తనఖా పెట్టి రూ.10 వేల కోట్ల రుణ సమీకరణ చేసింది. రైతు భరోసా ఇచ్చేందుకు ఈ నిధులు వెచ్చిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత తాకట్టులో ఉన్న ఇవే భూములను అభివృద్ధి చేసి వేలం వేయడం ద్వారా రూ.20 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల మేర నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలే తాజాగా పెద్దయెత్తున వివాదానికి కారణమయ్యాయి. టాప్‌లో టీజీఐఐసీ పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని అనేక రాష్ట్రాలు మౌలిక సదుపాయాల సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇదే తరహాలో రాష్ట్రంలో టీజీఐఐసీ ఏర్పాటైంది. అయితే దేశంలోని ఇతర సంస్థలతో పోల్చుకుంటే టీజీఐఐసీ వద్ద అత్యధికంగా సుమారు లక్షన్నర ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు ఉన్నట్టు సమాచారం. ల్యాండ్‌ బ్యాంకు పరంగా చూస్తే తెలంగాణ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (ఎంఐడీసీ– 48,437 ఎకరాలు), తమిళనాడు (సిప్‌కాట్‌– 48,198 ఎకరాలు) ఉన్నాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హరియాణా రాష్ట్రాల పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థలు గణనీయంగా ల్యాండ్‌ బ్యాంక్‌లను కలిగి ఉన్నాయి. మేడ్చల్‌ –సిద్దిపేట జోన్‌లో ఏకంగా 42,431 ఎకరాలు టీజీఐఐసీ పరిధిలో సైబరాబాద్, మేడ్చల్‌–సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, పటాన్‌చెరు, శంషాబాద్, యాదాద్రి, ఖమ్మం, వరంగల్‌..ఇలా తొమ్మిది పారిశ్రామిక జోన్లు ఉన్నాయి. అయితే ఒక్క మేడ్చల్‌– సిద్దిపేట జోన్‌లోనే ఏకంగా 42,431 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ లెక్కల ప్రకారం తెలంగాణలో 71,613 ఎకరాల్లో ఐటీ, పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిలో 53,550 ఎకరాల్లో ఐటీ, ఐటీ అనుబంధ సేవలకు చెందిన సంస్థలు ఉన్నాయి. 2,634 ఎకరాల్లో ఎల్రక్టానిక్స్, హార్డ్‌వేర్‌ సంస్థలు, మరో 10,039 ఎకరాల్లో రక్షణ, ఏరోస్పేస్, ఆహార ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్‌ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయి.

Akkada Ammayi Ikkada Abbayi Pradeep Movie Review And Rating Telugu2
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?

టైటిల్‌ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్‌ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌నిర్మాత: మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ బ్యానర్‌ఎడిటింగ్: కొడాటి పవన్‌ కల్యాణ్‌దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్‌–భరత్‌కథ, డైలాగ్స్‌: సందీప్‌ బొల్లాసంగీతం: రధన్‌సినిమాటోగ్రఫీ: ఎమ్‌ఎన్‌ బాల్‌రెడ్డివిడుదల: ఏప్రిల్‌ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్‌ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్‌ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్‌–భరత్‌ దర్శకత్వంలో మాంక్స్‌ అండ్‌ మంకీస్‌ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్‌ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్‌ శ్రీను, మురళీధర్‌ గౌడ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్‌ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్‌ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్‌ సుందర్‌) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్‌ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్‌ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్‌రూమ్‌లు నిర్మించాలని సర్పంచ్‌ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్‌ అయిన కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే దర్శకులు నితిన్‌–భరత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్‌ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్‌ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్‌ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్‌ అవుతుంది. ప‌ల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమ‌లో ప‌డ‌టం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని చెప్పచ్చు. క‌థాప‌రంగా సినిమాలో కొత్త‌ద‌నం లేక‌పోయినా గెట‌ప్ శ్రీను, స‌త్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్‌పై క‌నిపించే ప్ర‌తిసీన్‌లో ప్రేక్షకులను క‌డుపుబ్బా న‌వ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాస‌లు గ‌ట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్‌ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్‌ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్‌, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్‌ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్‌ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్‌ డైలాగ్స్‌, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్‌ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్‌ సీన్‌ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్‌.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెట‌ప్ శ్రీను, స‌త్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్‌ దీపిక తన పాత్రలో బాగా సెట్‌ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్ర‌దీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్‌ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత త‌డ‌బాటుకు లోన‌య్యాడ‌ని చెప్పవచ్చు. ప్రదీప్‌ తల్లిదండ్రులుగా మురళీధర్‌ గౌడ్‌,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్‌ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. సంగీతం, కెమెరామెన్‌ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్‌ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్‌, దీపిక, గెట‌ప్ శ్రీను, స‌త్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు..

Chandra Babu Naidu had a strange idea that no one else had3
ఇలాగేనా పేదరిక నిర్మూలన?

‘ఉగాది’ రోజున ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడికి ఎవరికీ రాని విచిత్రమైన ఆలోచన వచ్చింది. పేదరికం గురించి తీవ్ర మనోవేదన చెందుతూ, పేదరికాన్ని నిర్మూ లించేందుకు కొత్త విధానాన్ని కనుక్కున్నారు. అదే ‘పీ4’ విధానం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2047 నాటికి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తాననీ, ఇందుకు దాతృత్వమేఅత్యంత కీలకమనీ పేర్కొన్నారు. పేదలకు సహాయం చేసేలా సంపన్నుల్లో స్ఫూర్తి నింపటం పీ4 లక్ష్యమని అన్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ప్రపంచంలో ఇటువంటి విధానంతో పేదరిక నిర్మూలన చేసిన ఉదాహరణలు ఏవైనా ఉన్నాయా?‘పబ్లిక్, ప్రైవేట్‌ – పీపుల్‌ – పార్టనర్‌షిప్‌’ (పీ4) విధానంలో ప్రభుత్వం, ప్రైవేట్‌ కంపెనీలు, ప్రజలు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అంటున్నారు. 1995లో ప్రపంచ బ్యాంకు అమలు చేసిన సంస్కరణల్లో భాగంగా ‘పీ3’ పబ్లిక్‌ – ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ విధానాన్ని అమలు చేసి అద్భుతాలు సాధించాననీ, ఆ స్పూర్తితోనే íపీ4 రూపొందించాననీ అంటున్నారు. ఆ ‘అద్భుతాలు’ ఏమిటో మాత్రం చెప్పలేదు. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేయటంలో మాత్రం ముందు ఉన్నారు. 1995లోని పీ3లో లేని ప్రజలను అదనంగా పీ4లోఎందుకు చేర్చారో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వలేదు. బడా పారిశ్రామిక వేత్తల పరిశ్రమలకు భూములు కావాలి. భూ సేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం ఇవ్వటం పరిశ్రమాధిపతులకు ఇష్టంలేదు. పీ4లో పేదలను చేర్చటం ద్వారా వారి భూములను పారిశ్రామిక వేత్తలకు ఇచ్చేలా చేయటం కోసమే వారిని ఇందులో చేర్చారు.తమ పేదరికానికి కారణాలైన వాటికి వ్యతిరేకంగా పేదలు తిరుగుబాటు చేయకుండా బడా సంపన్న వర్గాలను కాపాడటం కోసం గతంలోనూ ఇలాంటి అభిప్రాయాలు ముందుకు వచ్చాయి. ఫ్యాక్టరీ యజమానులు సంపాదించుకున్న సొమ్ము నుండి కార్మికులకు దానధర్మాలు చేయాలని మహాత్మాగాంధీ ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని దెబ్బతీయటానికి 1951 ఏప్రిల్‌ 18న తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే ప్రారంభించిన ‘భూదానో ద్యమం’ భూస్వాముల ప్రయోజనాలు కాపాడటం కోసమే! ఆచరణలో భూస్వాములు భూములు దానం చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే తరహాలో పీ4 విధానాన్ని ప్రకటించారు. దేశంలోని 10% ఉన్న బడా సంపన్న వర్గాలు, అట్టడుగులో ఉన్న 20% పేదలను దత్తత తీసుకుంటే పేదరికం నిర్మూలించబడుతుందని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. పేదరికాన్ని రూపుమాపటం పాలక ప్రభుత్వాల బాధ్యత. ఆ బాధ్యత నుంచి చంద్రబాబు తప్పుకొంటున్నారు. పేదలు, బడా సంపన్న వర్గం, వర్గ సంబంధాల రీత్యా శత్రు వర్గాలే గాని మిత్ర వర్గాలు కాదు. బడా పెట్టుబడిదారులు, భూస్వాములు... కార్మికుల, గ్రామీణ పేదల శ్రమశక్తిని దోపిడీ చేసి సంపదలను కూడబెట్టారే గానీ కష్టపడి ఒక్క రూపాయి కూడాసంపాదించ లేదు. వారు అనుభవిస్తున్న సంపద అంతా వాస్తవంగా కార్మికుల, గ్రామీణ పేదలదే! అందువల్ల బడా సంపన్నులు, భూస్వాములు పేదలను దత్తత తీసుకోమని చెప్పటం ఏమిటి! వారి దాన ధర్మాలపై ఎందుకు ఆధారపడాలి? వారు సృష్టించిన సంపద మొత్తం వారికే చెందాలి. అది వారి హక్కు. ఈ హక్కును పక్కన పెట్టటమే చంద్రబాబు పీ4 విధానం. ఒక సమావేశ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ‘ఒకప్పుడు నాతో పాటు ఇక్కడ ఉన్న వారిలో ఎక్కువ మంది పేదరికం నుంచి వచ్చిన వారే. మేమందరం గ్రామాల్లోని మామూలు కుటుంబాల నుంచి వచ్చి పేదరికాన్ని జయించి ఈ స్థాయికి వచ్చా’మని చెప్పారు. గ్రామీణ పేద కుటుంబాలు అప్పుడు, ఇప్పుడు నిత్యం కష్టపడుతున్నప్పుడు, ఆ కుటుంబాలు పేదరికాన్ని జయించాలి గదా! ఎందువల్ల జయించలేక పోయాయి?నిత్యం పేదరికంలోనే ఎందుకు ఉంటున్నాయి? పేదరికం నుంచి బయటపడాలంటే, అందుకు అనుగుణమైన సామాజిక మార్పు విప్లవాత్మకంగా జరగాలి. ఆ మార్పును అడ్డుకోవటమే పీ4 విధానం. ఆంధ్రప్రదేశ్‌లో పేదరికం తగ్గక పోగా పెరుగుతూ ఉంది. చిన్న, సన్న కారు రైతులు భూములు కోల్పోవటం, గ్రామీణ ఉపాధి తరిగిపోవటం కార ణాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో శ్రామిక శక్తి 2022– 2023లో 45 శాతం ఉండగా 2023–24 నాటికి 46.1 శాతానికి పెరిగింది. గ్రామీణ పేదరికానికి, భూమికి విడదీయరాని సంబంధం ఉంది. సేద్యానికి భూమి ప్రధానం. ఆ భూమి పరాన్నభుక్కులైన కొద్ది మంది భూ కామందుల వద్ద బంధించబడి ఉంది. తమ శ్రమశక్తితో వివిధ పంటలు పండించే గ్రామీణ పేదలకు ఆ పంటలపై ఎటువంటి హక్కూ ఉండదు. ఎటువంటి శ్రమ చేయని భూ కామందులు ఆపంటలను తరలించుకుపోయి సంపదలను పెంచుకుంటున్నారు. పేదలు తీవ్రమైన దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామీణ పేదలకు భూమిపై హక్కు లభించినప్పుడే పేదరికం నుంచి బయటపడతారు.పట్టణ ప్రాంతంలోని కార్మికులు, పేదలు ఉపాధికి దూరమవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి జరగక పోవటం, ఉత్పత్తులు సృష్టించే కార్మికులకు పరిశ్రమల్లో భాగస్వామ్యం లేక పోవటం, పాలక ప్రభుత్వాల విధానాల వల్ల పరిశ్రమలు మూతపడి కార్మికులు నిరుద్యోగులుగా మారటం, ఫలితంగా పరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్న వారు కూడా ఉపాధి కోల్పోవడం వల్ల పట్టణ పేదరికం పెరుగుతూ ఉంది. తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతున్నారు కాబట్టి పేదరికానికి కారణాలు ఆయనకు తెలుసు. ఆ కారణాల పరిష్కారం గురించి నేడు ఆలోచించటం లేదు. నేడు చంద్ర బాబు బడా సంపన్న వర్గాల జాబితాలో ఉండటమే కాకుండా, ఆ వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. నేటి వ్యవస్థను కాపాడే ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి అందుకు భిన్నంగా చంద్రబాబు విధానాలు ఉండవు. పీ4 విధానం అనేది పేదరిక నిర్మూలనకు కాక... నేటి వ్యవస్థనూ, అందులో భాగమైన బడా పెట్టుబడిదారుల, భూస్వా ముల ప్రయోజనాలనూ కాపాడుతుంది. సమాజ పరిణామక్రమంలో దోపిడీ వర్గాలు పేదలు సృష్టించిన సంపదలను దోచు కోవటమే కాకుండా, అణచివేతకు గురి చేశాయి. అంతే తప్ప వారి గురించి ఆలోచించలేదు, ఆలోచించరు కూడా! అది వారి వర్గలక్షణం. పీ4 విధానం పేదలను పేదలుగా ఉంచటం, వారి పేదరికా నికి కారణాలపై పోరాటం చేయకుండా చేయటం, బడా సంపన్న వర్గాల దానధర్మాల కోసం ఎదురు చూసేలా చేయటమే!గ్రామీణ ప్రాంతంలో భూ సంస్కరణల ద్వారా పేదలకు భూముల పంపిణీ జరగాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలి, తద్వారా గ్రామీణ ఉపాధిని పెంచాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణమైన పరిశ్రమలు నిర్మించి అందులో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల అనుబంధంగా పట్టణ పేదలకు ఉపాధి ఏర్పడినప్పుడే దేశంలో, రాష్ట్రంలో పేదరికం పోతుంది. కానీ చంద్రబాబు పేదలకు భూములపంపిణీకి, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజలే పోరాటాల ద్వారా సాధించుకోవాలి. -వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ‘ 98859 83526-బొల్లిముంతసాంబశివరావు

Tahawwur Rana has finally arrived in our country4
రాణా గుప్పిట కీలక రహస్యాలు!

పదిహేడేళ్ల క్రితం ముంబై మహానగరంలో 10 మంది ఉగ్రవాదులు 78 గంటలపాటు విచక్షణా రహితంగా దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు బలితీసుకున్న ఘోర ఉదంతంలో కీలక కుట్ర దారైన తహవ్వుర్‌ రాణా ఎట్టకేలకు మన దేశంలో అడుగుపెట్టాడు. రానున్న 18 రోజుల్లో మన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలో అతగాడు ఆ ఘోర ఉదంతానికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తాడన్నది చూడాలి. ఆ ఉగ్రవాదులు బాంబులూ, ఇతర మారణాయుధాలతో పాకి స్తాన్‌లోని కరాచీ నుంచి సముద్ర మార్గంలో ముంబై చేరుకుని ఆ నగరంలో అనేకచోట్ల తుపాకు లతో, గ్రెనేడ్లతో చెలరేగిపోయారు. ఆ దాడుల్లో సాధారణ పౌరులూ, కర్కరే వంటి పోలీస్‌ ఉన్నతాధి కారులూ ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హత మార్చగా, ఉగ్రవాది కసబ్‌ పట్టుబడ్డాడు. విచారణానంతరం 2012లో అతన్ని ఉరితీశారు. రాణా వెల్లడించేఅంశాలు మన నిఘా వర్గాల దగ్గరున్న సమాచారంతో ధ్రువీకరించుకోవటానికీ, మరో ఉగ్రవాది, ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న డేవిడ్‌ హెడ్లీపై మరిన్ని వివరాలు రాబట్టడానికీ తోడ్పడుతాయి.రాణా అప్పగింత అతి పెద్ద దౌత్యవిజయమని మన ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అటు అమెరికా కూడా ఉగ్రదాడుల్లో హతమైనవారికీ, ఇతర బాధితులకూ న్యాయం చేకూర్చటంలో ఇది కీలకమైన ముందడుగని ప్రకటించింది. కావచ్చు. అయితే కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై చెబుతున్నట్టు ‘అతగాడి దగ్గర చెప్పడానికేం లేదు గనుకనే...’ అప్పగించారా? రాణా పాత్ర కూడా తక్కువేం కాదు. దాడులకు పక్షం రోజుల ముందు భార్యతో కలిసి ముంబైలో చాలా ప్రాంతాలు వెళ్లి చూశాడు. అతను ఎంపిక చేసిన ప్రాంతాలను హెడ్లీ భార్యాసమేతంగా వచ్చి తనిఖీ కూడా చేశాడు. ఇంచుమించు ఆ ప్రాంతాల్లోనే ఉగ్రవాదుల దాడులు జరిగాయి. రాణా ముంబైతోపాటు ఢిల్లీ, కొచ్చి వంటి నగరాలకు కూడా పోయాడు. 1971 నాటి యుద్ధవీరులకై నిర్మించిన ముంబైలోని జల వాయు విహార్‌ హౌసింగ్‌ కాంప్లెక్స్‌లో భార్యతో కలిసి బస చేశాడు. ఆ కాంప్లెక్స్‌ పేల్చివేతకు అవకాశం ఉందా లేదా చూసుకుని, అసాధ్యమని నిర్ణయించుకున్నాక భారత్‌ నుంచి వెళ్లిపోయాడని అంటారు. పిళ్లై వాదన పూర్తిగా కొట్టిపారేయదగింది కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో రాణాతో పోలిస్తే అసలు సిసలు కుట్రదారు డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ. ప్రస్తుతం రాణా అప్పగింత కీలకమైన ముందడుగుగా చెబుతున్న అమెరికా హెడ్లీ విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకంటే అతగాడు అమెరికా మాదకద్రవ్య నియంత్రణ విభాగం (డీఈఏ) ఏజెంట్‌గా పని చేశాడు. అదే సమయంలో ఐఎస్‌ఐకీ, లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)కీ కూడా ఏజెంట్‌గా ఉన్నాడు. ఇవన్నీ అమెరికా నిఘా సంస్థలకూ తెలుసు. అంతేకాదు... ముంబై మారణకాండ పథక రచన మొదలుకొని అన్ని విషయాలపైనా అమెరికా దగ్గర ముందస్తు సమాచారం వుంది. ఆ సంగతలా వుంచి భారత్‌లో సేకరించిన సమస్త సమాచారాన్నీ, ముంబైకి సంబంధించిన జీపీఎస్‌ లోకేషన్‌లనూ హెడ్లీకి రాణా అందించాడు. దాని ఆధారంగానే కొలాబా తీరప్రాంతంలోని బధ్వర్‌ పార్క్‌ దగ్గర ఉగ్రవాదులు బోట్లు దిగారు. రాణా ఇచ్చిన సమాచారాన్ని హెడ్లీ పాకిస్తాన్‌ పోయి అక్కడ ఐఎస్‌ఐ తరఫున తనతో సంప్రదిస్తున్న మేజర్‌ ఇక్బాల్‌ అనే వ్యక్తికి అందజేశాడని ఇప్పటికే మన నిఘా సంస్థలకు రూఢి అయింది. ఉగ్రవాదులకు ఐఎస్‌ఐ ఇచ్చిన శిక్షణేమిటో హెడ్లీకి తెలుసు. వీటిపై అమెరికా భద్రతా సంస్థలకు క్షణ్ణంగా తెలిసినా మన దేశాన్ని ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న సంశయాలున్నాయి. ఇది బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అమెరికా ఏవో సాకులు చెబుతోందన్నది వాస్తవం. సందేహం లేదు... రాణా కన్నా హెడ్లీ అత్యంత కీలకమైనవాడు. అతను ఎల్‌ఈటీలో చేరడమే కాక, ముంబై దాడులకు పన్నాగం పన్నిన ఉగ్రవాదులు హఫీజ్‌ సయీద్, లఖ్వీల దగ్గర శిక్షణ తీసుకున్నాడు. ముంబై దాడుల సమయంలో దగ్గరుండి చూస్తున్నట్టుగా ఉగ్రవాదులకు ఎప్పటి కప్పుడు ఫోన్‌లో లఖ్వీ ఆదేశాలివ్వటం వెనక హెడ్లీ ప్రమేయం వుంది. తమకు ఏజెంటుగా పని చేసినవాడిని అప్పగించరాదని అమెరికా భావించటం మూర్ఖత్వం. అదే పని భారత్‌ చేస్తే అంగీకరించగలదా? హెడ్లీని అప్పగిస్తే తమ గూఢచార సంస్థల నిర్వాకం బయటపడుతుందని అది సంకోచిస్తున్నట్టు కనబడుతోంది. రాణా అప్పగింత ప్రక్రియ తమ హయాంలోనే మొదలైందని గర్వంగా చెబుతున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం హెడ్లీ విషయంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలి. వికీలీక్స్‌ పత్రాలు ఈ సంగతిని చాన్నాళ్ల క్రితమే వెల్లడించాయి. హెడ్లీ అప్పగింతకు పట్టుబట్టవద్దని అప్పటి మన జాతీయ భద్రతాసలహాదారు ఎంకే నారాయణన్‌ను నాటి అమెరికా రాయబారి తిమోతీ రోమెర్‌ కోరినట్టు అందులో ఉంది. అలా అడిగినట్టు కనబడకపోతే తమకు ఇబ్బందులొస్తాయని నారాయణన్‌ బదులిచ్చినట్టు కూడా ఆ పత్రాల్లో ఉంది. హెడ్లీ ఎలాంటివాడో అతని కేసులో 2009లో తీర్పునిచ్చిన అమెరికా న్యాయమూర్తే చెప్పారు. ‘హెడ్లీ ఉగ్రవాది. అతని నుంచి ప్రజలను రక్షించటం నా విధి. మరణశిక్షకు అన్నివిధాలా అర్హుడు. కానీ ప్రభుత్వ వినతి మేరకు 35 ఏళ్ల శిక్షతో సరిపెడుతున్నాను’ అన్నారాయన. ఎటూ పాకిస్తాన్‌ తన రక్షణలో సేద తీరుతున్న లఖ్వీ, సయీద్‌లను అప్పగించదు. ఆ దేశంతో మనకు నేరస్థుల అప్పగింత ఒప్పందం కూడా లేదు. కానీ అమెరికాతో ఆ మాదిరి ఒప్పందం ఉంది గనుక హెడ్లీ కోసం మన దేశం గట్టిగా పట్టుబట్టాలి. అది సాధిస్తేనే నిజమైన విజయం దక్కినట్టవుతుంది.

Kolkata Knight Riders beat Chennai Super Kings by 8 wickets5
చెపాక్‌లో చెన్నై చిత్తుగా...

ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి వరుసగా ఐదో పరాజయం... మొదటిసారి సొంతగడ్డ చెపాక్‌ మైదానంలో వరుసగా మూడో ఓటమి... ధోని కెపె్టన్సీ పునరాగమనంలో సీఎస్‌కే మరింత పేలవ ప్రదర్శన కనబర్చింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) పదునైన బౌలింగ్‌ ముందు చేతులెత్తేసిన సీఎస్‌కే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫటాఫట్‌గా 61 బంతుల్లోనే లక్ష్యాన్ని అందుకున్న కోల్‌కతా రన్‌రేట్‌ను ఒక్కసారిగా పెంచుకొని దూసుకుపోయింది. చెన్నై: ఐపీఎల్‌ 18వ సీజన్‌లో ఐదుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. సొంత మైదానంలో బ్యాటింగ్‌ వైఫల్యంతో జట్టు మరో ఓటమిని మూటగట్టుకుంది. శుక్రవారం జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేయగలిగింది. శివమ్‌ దూబే (29 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విజయ్‌శంకర్‌ (21 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించాడు. అనంతరం కోల్‌కతా 10.1 ఓవర్లలో 2 వికెట్లకు 107 పరుగులు సాధించి గెలిచింది. సునీల్‌ నరైన్‌ (18 బంతుల్లో 44; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) శుభారంభంతో మరో 59 బంతులు మిగిలి ఉండగానే విజయం జట్టు సొంతమైంది. పేలవ బ్యాటింగ్‌... ఓపెనర్లు కాన్వే (12), రచిన్‌ (4) ఒకే స్కోరు వద్ద వెనుదిరగ్గా... రెండు సార్లు అదృష్టం కలిసొచ్చిన విజయ్‌ శంకర్‌ కొన్ని పరుగులు రాబట్టాడు. 0, 20 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌లను నరైన్, వెంకటేశ్‌ అయ్యర్‌ వదిలేశారు. రాహుల్‌ త్రిపాఠి (16) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై 9 పరుగుల తేడాతో అశ్విన్‌ (1), జడేజా (0), దీపక్‌ హుడా (0), ధోని (1) వికెట్లను కోల్పోయింది. 71/6 వద్ద బ్యాటింగ్‌ కుప్పకూలే పరిస్థితి ఉండటంతో చెన్నై ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా బ్యాటర్‌ హుడాను తీసుకు రాగా, అతనూ డకౌటయ్యాడు. వరుసగా 63 బంతుల పాటు జట్టు ఫోర్‌ కొట్టలేకపోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా...మరో ఎండ్‌లో నిలబడిన దూబే తన 20వ బంతికి గానీ తొలి ఫోర్‌ కొట్టలేకపోయాడు. చివరి ఓవర్లో అతను మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఎట్టకేలకు స్కోరు 100 పరుగులు దాటింది. చకచకా లక్ష్యం వైపు... ఛేదనలో కోల్‌కతాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. క్వింటన్‌ డికాక్‌ (16 బంతుల్లో 23; 3 సిక్స్‌లు), నరైన్‌ ధాటిగా ఆడుతూ 26 బంతుల్లోనే 46 పరుగులు జోడించారు. ఖలీల్‌ ఓవర్లో డికాక్‌ 2 సిక్స్‌లు బాదగా, అశ్విన్‌ ఓవర్లో నరైన్‌ ఫోర్, సిక్స్‌ కొట్టాడు. ఖలీల్‌ తర్వాత ఓవర్లో కేకేఆర్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌తో 18 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 71 పరుగులకు చేరింది. ఆపై అశ్విన్‌ ఓవర్లో నరైన్‌ మరో 2 సిక్స్‌లు బాదాడు. విజయానికి 19 పరుగుల దూరంలో నూర్‌ అహ్మద్‌ అతడిని అవుట్‌ చేసినా... అజింక్య రహానే (17 బంతుల్లో 20 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), రింకూ సింగ్‌ (12 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి పని పూర్తి చేశారు. ధోని అవుటా...నాటౌటా! ఎప్పటిలాగే అభిమానులు ఎదురు చూసేలా చేసీ చేసీ చివరకు 9వ స్థానంలో ధోని బ్యాటింగ్‌కు దిగాడు. నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతను నరైన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంపైర్‌ అవుట్‌గా ప్రకటించగా ఈ నిర్ణయంపై ధోని ‘రివ్యూ’ కోరాడు. బంతి బ్యాట్‌ను దాటుతున్న సమయంలో ‘స్నికో’లో కాస్త కదలిక కనిపించినా... టీవీ అంపైర్‌ వినోద్‌ శేషన్‌ దీనిని లెక్కలోకి తీసుకోకుండా అవుట్‌గా ఖాయం చేశాడు. దీనిపై ఫోర్త్‌ అంపైర్‌ తన్మయ్‌ శ్రీవాత్సవను కలిసి చెన్నై కోచ్‌ ఫ్లెమింగ్‌ తన అసంతృప్తిని ప్రదర్శించడం కనిపించింది. స్కోరు వివరాలు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రచిన్‌ (సి) రహానే (బి) హర్షిత్‌ 4; కాన్వే (ఎల్బీ) (బి) అలీ 12; త్రిపాఠి (బి) నరైన్‌ 16; విజయ్‌ శంకర్‌ (సి) అలీ (బి) వరుణ్‌ 29; శివమ్‌ దూబే (నాటౌట్‌) 31; అశ్విన్‌ (సి) అరోరా (బి) హర్షిత్‌ 1; జడేజా (సి) డికాక్‌ (బి) నరైన్‌ 0; హుడా (సి) అరోరా (బి) వరుణ్‌ 0; ధోని (ఎల్బీ) (బి) నరైన్‌ 1; నూర్‌ (సి) వరుణ్‌ (బి) అరోరా 1; అన్షుల్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1–16, 2–16, 3–59, 4–65, 5–70, 6–71, 7–72, 8–75, 9–79. బౌలింగ్‌: వైభవ్‌ అరోరా 4–0–31–1, మొయిన్‌ అలీ 4–1–20–1, హర్షిత్‌ రాణా 4–0–16–2, వరుణ్‌ చక్రవర్తి 4–0–22–2, సునీల్‌ నరైన్‌ 4–0–13–3. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) అన్షుల్‌ 23; నరైన్‌ (బి) నూర్‌ 44; రహానే (నాటౌట్‌) 20; రింకూ సింగ్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (10.1 ఓవర్లలో 2 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–46, 2–85. బౌలింగ్‌: ఖలీల్‌ 3–0–40–0, అన్షుల్‌ 2–0–19–1, అశ్విన్‌ 3–0–30–0, నూర్‌ 2–0–8–1, జడేజా 0.1–0–9–0. ఐపీఎల్‌లో నేడులక్నో x గుజరాత్‌ వేదిక: లక్నోమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి హైదరాబాద్‌ x పంజాబ్‌ వేదిక: హైదరాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Complaints to the Higher Education Council and the Higher Education Department regarding Fee Reimbursement6
అప్పు చేసి ఫీజులు

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన మన పార్టీ కార్యకర్త కుమార్తె పి.పుష్పిత నూజివీడు పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతోంది. రూ.30 వేలు ఫీజు కట్టలేదని హాల్‌ టికెట్‌ ఇవ్వలేదు. దయచేసి హాల్‌ టికెట్‌ ఇప్పించి పరీక్ష రాసేలా సాయం చేయగలరని ప్రార్థన..! – మంత్రి లోకేశ్‌కు ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ టీడీపీ కార్యకర్త అభ్యర్థన ఇదీ!! పిల్లల ఫీజుల విషయం రచ్చకెక్కడంతో వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకనే ఉద్దేశంతో కాలేజీ యాజమాన్యం ఆ ఒక్క విద్యార్థినికి మాత్రం హాల్‌టికెట్‌ విడుదల చేసింది. కానీ ఫీజులు మంజూరుకాక, కాలేజీకి వెళ్లలేక మౌనంగా కుమిలిపోతున్న లక్షల మంది పిల్లల గోడును పట్టించుకునేవారే కరువయ్యారు. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లూ క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకుని ఆత్మ విశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒకపక్క విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతుండగా.. కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళుతున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. రెండేళ్లలో ఇవ్వాల్సింది రూ.7,800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్ల చొప్పున హాస్టల్‌ ఖర్చుల కోసం అందచేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో రూ.3,900 కోట్లు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా రెండేళ్లలో రూ.7,800 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో రూ.వెయ్యి కోట్లు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యా మండలి, ఉన్నత విద్యా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యా మండలి అధికారాలకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. క్వార్టర్‌కే దిక్కులేదు.. సెమిస్టర్‌ బాంబు..! గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లులు ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలావరకు తగ్గింది. టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించటానికే ముప్పుతిప్పలు పెడుతున్న ప్రభుత్వం ఇకపై సెమిస్టర్‌ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేట్‌ విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రైవేట్‌ పీజీ రీయింబర్స్‌మెంట్‌ గాలికి.. ప్రైవేటులో పీజీకి సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.3 వడ్డీకి రూ.20 వేలు అప్పు చేశా మా అమ్మాయి విజయవాడలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు రూపాయల వడ్డీకి రూ.20 వేలు అప్పు చేసి కాలేజీకి కట్టా. ప్రతి నెలా రూ.600 వడ్డీ కడుతున్నా. నా భర్త పక్షవాతంతో మంచానికి పరిమితమయ్యాడు. పనులు దొరకడం లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంది. – కె.కుమారి, ఇంటర్‌ విద్యార్థిని తల్లి, విజయవాడ అప్పు చేసి రూ.40 వేలకు పైగా కట్టాంతిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మా అబ్బాయి బీటెక్‌ చదువుతున్నాడు. ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడంతో అప్పు చేసి రూ.40 వేలకు పైగా కాలేజీకి కట్టాం. నా భర్త మేస్త్రీ పని చేస్తారు. ఆయన కూలితోనే కుటుంబం గడవాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందనే ఆశతో పెద్దబ్బాయిని ఇంజనీరింగ్‌లో చేర్పించాం. ఇప్పుడు పరిస్థితి తల్లకిందులైంది. ఇంకో అబ్బాయి ఇంటర్‌ చదువుతున్నాడు. – ప్రభావతమ్మ, ఇంజినీరింగ్‌ విద్యార్థి తల్లి, తిరుపతి జగన్‌ హయాంలో ఆదుకున్నారిలా..జగనన్న విద్యా దీవెన: రూ.12,609.68 కోట్లు వసతి దీవెన : రూ.4,275.76 కోట్లు 2017-19 మధ్య టీడీపీ పెట్టిన బకాయిల చెల్లింపు: రూ.1,778 కోట్లు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.18,663.44 కోట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో హాస్టల్‌ మెయింటెనెన్స్‌ చార్జీలు (పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌ - ఎంటీఎఫ్‌) విభాగం చెల్లింపులు(ఒక్కో విద్యార్థికి) ఐటీఐ రూ.10 వేలు పాలిటెక్నిక్‌ రూ.15 వేలు డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు రూ.20 వేలు (నోట్‌: వీలైనంత ఎక్కువ మందిని అర్హులుగా చేర్పించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కుటుంబ వార్షిక ఆదాయం పరిమితిని పెంచింది. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్ష ఉంటే, ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలకు ఉండేది. 2019 - 24 మధ్య వైఎస్సార్‌ సీపీ హయాంలో అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువమందికి లబ్ధి చేకూర్చారు)

visa cancellations, US education associations fight for students7
విదేశీ  విద్యార్థులపై... ఎందుకీ కత్తి?

విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్‌ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఎడ్యుకేషన్‌ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్‌ ఎక్స్‌చేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సి స్టం (సెవిస్‌) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్‌ఎస్‌ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్‌ మిషెల్‌ డిమాండ్‌ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్‌ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్‌ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్‌ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్‌ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్‌ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్‌ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్‌ ఈస్టర్న్‌ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్‌ వర్సిటీ చాన్స్‌లర్‌ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్‌ డోర్స్‌’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్‌’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Rasi Phalalu: Daily Horoscope On 12-04-2025 In Telugu8
ఈ రాశి వారికి ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.. ఆత్మీయులు దగ్గరవుతారు.

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: పౌర్ణమి తె.4.22 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: హస్త సా.5.11 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: రా.2.01 నుండి 3.44 వరకు,దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.26 వరకు, అమృతఘడియలు: ఉ.10.34 నుండి 12.22 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10.మేషం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అరుదైన పురస్కారాలు.వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. పనులలో అవాంతరాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో శ్రమ తప్పదు. ఉద్యోగాలలో మార్పులు.కర్కాటకం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు.యత్నకార్యసిద్ధి. దేవాలయ దర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.కన్య: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.తుల: ధనవ్యయం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో చిక్కులు.వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో ఊహించని ఉన్నతి.ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు.సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.మకరం: కొత్తగా అప్పులు చేస్తారు. పనులు మధ్యలో విరమిస్తారు. అనుకోని ధనవ్యయం. శ్రమ తప్పదు. నిర్ణయాలు మార్చుకుంటారు. దైవచింతన. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.కుంభం: రాబడి కన్నా ఖర్చులు అధికం. పనులలో ఆటంకాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.మీనం: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. దైవదర్శనాలు. ఆస్తిలాభ సూచనలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహం పెరుగుతుంది.

Sabka Saath, Sabka Vikas has always been our guiding mantra9
మాది సబ్‌ కా వికాస్‌  వారిది పరివార్‌ కా వికాస్‌ 

వారణాసి/అశోక్‌నగర్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పారీ్టలు కేవలం సొంత కుటుంబాల బాగు కోసమే అధికారం దక్కించుకోవడానికి ఆరాట పడుతున్నాయని విమర్శించారు. బీజేపీ విధానం ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’అయితే విపక్షాల విధానం ‘పరివార్‌ కా సాత్, పరివార్‌ కా వికాస్‌’అని ధ్వజమెత్తారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమంతోపాటు దేశ సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని ఉద్ఘాటించారు. బీజేపీకి అధికార కాంక్ష లేదని స్పష్టంచేశారు. విపక్ష నాయకులు స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా అధికారం కోసం పాకులాడుతూ రాత్రి పగలు రాజకీయ క్రీడల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 130 తాగునీటి పథకాలు, 100 అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, ఒక పాలిటెక్నిక్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ తదితరాలు ఉన్నాయి. 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ వారణాసికి రావడం ఇది 50వ సారి. నగరంలో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తొలుత మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతులకు నివాళులరి్పంచారు. వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. పూర్వాంచల్‌ ఆరోగ్య రాజధాని కాశీ ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంతం గతంలో పూర్తిగా వెనుకబడి ఉండేదని, తాము అధికారంలోకి వచి్చన తర్వాత గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి సాధించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాశీ నగరం ఇప్పుడు ఈ ప్రాంతానికి ఆరోగ్య రాజధానిగా మారిందన్నారు. ఇక్కడ అత్యుత్తమ వైద్య చికిత్స లభిస్తోందని హర్షం వ్యక్తంచేశారు. 70 ఏళ్లు దాటినవారికి ఉచితంగా చికిత్స అందించడానికి ఆయుష్మాన్‌ వయ్‌ వందన కార్డులు పంపిణీ చేస్తున్నామని, అత్యధికంగా వారణాసిలో 50 వేల మందికి ఈ కార్డులు ఇచ్చామని తెలిపారు. కాశీ కేవలం ప్రాచీన నగరమే కాదు, ప్రస్తుతం ప్రగతిశీల నగరంగా మారిందని పేర్కొన్నారు. కాశీ–తమిళ సంగమం గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2036లో వారణాసిలో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలన్న ఆలోచన ఉందని తెలిపారు. అందుకోసం కార్యాచరణ మొదలైందన్నారు. ఈ క్రీడల్లో పతకాలు సాధించడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని వారణాసి యువతకు పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం వారణాసికి చేరుకున్న తర్వాత.. ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వారణాసిలో 19 ఏళ్ల యువతిపై 23 మంది వ్యక్తులు ఆరు రోజులపాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆనంద్‌పూర్‌ ధామ్‌లో మోదీ పూజలు ప్రధాని మోదీ శుక్రవారం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం అశోక్‌నగర్‌ జిల్లాలోని ఆనంద్‌పూర్‌ ధామ్‌ను దర్శించుకున్నారు. ఇక్కడి గురూజీ మహారాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీఆనంద్‌పూర్‌ ట్రస్టు స్థాపించిన ఆనంద్‌పూర్‌ ధామ్‌ 315 ఎకరాల్లో విస్తరించి ఉంది. గోశాల నిర్వహణతోపాటు ఆనంద్‌పూర్‌ ధామ్‌ చేపడుతున్న ఇతర సామాజిక సేవా కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రశంసించారు.

Senior police officers are under pressure because of tdp10
ఎస్‌ బాస్‌లకే ‘రెడ్‌’ కార్పెట్‌!

‘రెడ్‌బుక్కే రూల్‌ బుక్‌...! కచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత..! టీడీపీ ప్రధానకార్యాలయంతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులుపెట్టాల్సిందే..! వారిని తీవ్రంగా వేధించాల్సిందే..!’ - ముఖ్యనేత అల్టిమేటం...!‘ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా...! ఫాలో కావాల్సిందే...! లేదంటే చార్జ్‌మెమోలు ఇస్తాం.. చెప్పినట్లుగా నడుచుకోని ఎస్పీలను పక్కనబెడతాం.. డీఎస్పీలతో రెడ్‌బుక్‌ కేసులు ఫాలో అప్‌ చేయిస్తాం..!’ - పోలీస్‌ బాస్‌ హుకుం..! రెడ్‌బుక్‌ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవు­తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌ రెడ్‌బుక్‌ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకబు చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. - సాక్షి, అమరావతి నెల రోజులుగా కృష్ణకాంత్‌కు వేధింపులు..!రెడ్‌బుక్‌ కుట్రను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు, అక్రమ అరెస్టులో ఎస్పీ తమ అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19 మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్‌ 307 చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్‌ హౌస్‌ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్‌ 307 చేర్చేందుకు యత్నించారు. ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్‌ వారిని వారించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్‌ 307 చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో కృష్ణకాంత్‌ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రెడ్‌బుక్‌ కేసులకు సంబంధించి చెప్పినట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం రోజూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్‌ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. రెడ్‌బుక్‌ను కాదనే ఎస్పీలకు మెమోలుఅడ్డగోలుగా వ్యవహరించేందుకు వెనుకంజ వేసే ఎస్పీలను వెంటనే పక్కనబెట్టాలని డీజీపీని ప్రభు­త్వ పెద్దలు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో టీడీపీ వీర విధేయ డీఎస్పీలను గుర్తించి వారితో రెడ్‌బుక్‌ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నె­ల్లూరు జిల్లాలో ప్రస్తుతం అదే సూత్రాన్ని అనుస­రిస్తు­న్నారు. నెల్లూరు రూరల్‌ డీఎస్పీగా ఉన్న ఘట్ట­మ­నేని శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధ్థన్‌రెడ్డిపై అక్రమ కేసుతోపాటు ఇత­ర రెడ్‌బుక్‌ కేసుల దర్యాప్తును ఆయనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు బృందాల ఏర్పాటు, వివిధ ప్రాంతాలకు పంపించడం, జిల్లావ్యాప్తంగా పో­లీసు­లకు ఆదేశాలు జారీ చేయడం తదితర వ్యవహారాలను డీఎస్పీ శ్రీనివాసే నిర్వర్తిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మోడల్‌నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీలకు డీజీపీ కార్యాలయం తేల్చి చెప్పినట్లు సమాచారం. రెడ్‌­బుక్‌­ను ఫాలో కా­కుంటే ఎస్పీలకు చార్జ్‌ మెమోలు త­ప్పవని, ఆ తరు­వాత తాము ఎంపిక చేసిన డీఎస్పీ­లు ఆయా కేసులను పర్యవేక్షిస్తారని హెచ్చరించిన­ట్లు తెలుస్తోంది. ఈ పరి­ణామాలు ఐపీఎస్‌ అధికారు­లైన ఎస్పీలను అవమా­నించడమేనని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement