వేసవి పనులలో
కూలీలకు తప్పని కష్టాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు పనిచేయడం మానుకోవాలి. ఉదయం, సాయంత్రం పనిచేయడం మంచిది.
● పనిమధ్యలో చిన్న విరామం తీసుకోవాలి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే నీడచాటున కూర్చోవాలి.
● ఉప్పు, చక్కెర కలిపిన ఆహారం, పండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలో శక్తి, లవణాల నిల్వలు పెరుగుతాయి.
● ఉపాధి పనులకు వెళ్లే కూలీలు తగినంత నీరు తాగాలి. శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. పని ప్రదేశాలలో ఓఆర్‌ఎస్, నిమ్మరసం ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.
● పని ప్రదేశానికి సమీపంలోని వైద్య కేంద్రం వివరాలు కలిగి ఉండాలి.
కల్వకుర్తి: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో మట్టి పనులు చేయడం ఉపాధి హామీ కూలీలకు కష్టసాధ్యంగా మారింది. పైగా పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు సరిగా లేక, ఎవరికి వారే నీటిని వారి వెంట తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సమయంలో ఏవైనా గాయాలు అయినా మెడికల్ కిట్లు సైతం అందుబాటులో లేని పరిస్థితితో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
కూలీలకు సౌకర్యాలు
ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫిబ్రవరి నుంచి మే వరకు కూలీలు చేసిన పనులకు 30 శాతం అదనంగా భత్యం చెల్లించేవారు. ప్రయాణ, కరువు భత్యం (టీఏ, డీఏ) ఖర్చు కింద గడ్డపారకు రూ.10, తట్టకు రూ.5, మంచినీటికి రూ.5, 5 కి.మీ.,కు పైగా దూరం నుంచి వచ్చేవారికి రూ.20 చొప్పున చెల్లించేవారు. వీటితోపాటు పని ప్రదేశంలో నీడ సౌకర్యం కల్పించి విశ్రాంతి తీసుకునేలా చూసేవారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వీటన్నింటిని నిలిపివేయడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎదురయ్యే సమస్యలు
ఎండలో ఎక్కువ సమయం పనిచేయడం ద్వారా కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. పని ప్రదేశంలో తాగునీరు సరిపడా లేకపోవడంతో నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవడంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతున్నారు. ఎండల ద్వారా చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటివి ఎదురవుతాయి.
పని ప్రదేశంలో కనిపించని
కనీస వసతులు
నిలువ నీడ కరువు,
తాగునీటికి సైతం తిప్పలు