ప్రైవేటులో కడుపు కోతలే | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటులో కడుపు కోతలే

Apr 4 2025 12:25 AM | Updated on Apr 4 2025 12:25 AM

ప్రైవ

ప్రైవేటులో కడుపు కోతలే

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రసవాలే చేయాలని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే సిజేరియన్‌ చేయాలని చెబుతోంది. అయితే ప్రభుత్వ ఆస్పపత్రుల్లో మాత్రమే ఈ లక్ష్యం నెరవేరుతుండగా.. ప్రైవేట్‌లో మాత్రం ఈ నిబంధనలు తుంగలో తొక్కి.. ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గతేడాది మార్చి 2024 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,342 సిజేరియన్లు చేయడమే ప్రైవేట్‌లో కడుపు ‘కోత’లకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇదిలా ఉండగా.. రూ.వేలకు వేలు చెల్లించి ప్రసవాలు చేయించుకునే ఆర్థిక స్థోమత లేనివారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తూ సాధారణ ప్రసవాలు చేస్తుండటంతో గర్భిణులు ఎక్కువ సంఖ్యలో కాన్పులు చేయించుకునేందుకు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేటలోని జనరల్‌, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు చేస్తుండటంతో ప్రైవేట్‌ కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

కాసుల కోసమే..

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు చేసేందుకు ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశాలు ఉండటంతో ఆ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. కానీ, జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల కంటే సిజేరియన్లే ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు కాసుల కోసం శస్త్రచికిత్సలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఏడాది జిల్లాలో సాధారణ, సిజేరియన్‌ ప్రసవాల్లో ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగడం గమనార్హం.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో..

సాధారణ సిజేరియన్లు మొత్తం

కాన్పులు ప్రసవాలు

4,237 3,839 8,076

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఇలా..

సాధారణ సిజేరియన్లు మొత్తం

కాన్పులు ప్రసవాలు

653 2,342 2,995

తనిఖీలు చేస్తున్నా..

జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలకు సంబంధించి ప్రతినెలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్‌లో జరిగే సిజేరియన్లు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు తూతూమంత్రంగా నోటీసులు అందజేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

ధనార్జనే ధ్యేయంగా సిజేరియన్లకే మొగ్గు

ఆరోగ్య పరంగా, ఆర్థికంగా నష్టపోతున్న బాధితులు

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు

నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న వైద్యాధికారులు

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ కాన్పులు అధికం

ఆడిట్‌ నిర్వహిస్తున్నాం..

ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుండడంతో ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రైవేట్‌లోనూ సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్య, ఆరోగ్య శాఖ పరంగా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నాం. డబ్బుల కోసం సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతినెలా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగే సిజేరియన్లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నాం.

– స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ

ప్రైవేటులో కడుపు కోతలే 1
1/2

ప్రైవేటులో కడుపు కోతలే

ప్రైవేటులో కడుపు కోతలే 2
2/2

ప్రైవేటులో కడుపు కోతలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement