
పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం
నాగర్‌కర్నూల్ రూరల్/ పెద్దకొత్తపల్లి: పేదల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి, పెద్దకొత్తపల్లి మండలంలోని కల్వకోల్, చెన్నపురావుపల్లి, మారెడ్‌దిన్నే గ్రామాల్లో రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. ఈ పథకంపేదల ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని, రైతుల కష్టానికి గౌరవం దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, సబ్సిడీ సిలిండర్లు, రైతు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డులను అర్హులైన వారికి అందజేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. కల్వకోల్‌లో రెవెన్యూ అధికారులతో భూములపై సమీక్ష నిర్వహించారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. విద్యుత్ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేయడం లేదని మంత్రి దృష్టికి తీసుకురాగా.. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు తహసీల్దార్ తబిత, నాయకులు మణెమ్మ, నాగేష్, సూర్యప్రతాప్‌గౌడ్, శ్రీనివాసులు, కృష్ణయ్య, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటస్వామి, ఏసయ్య, సత్యం, చంద్రయ్య, రవికుమార్ పాల్గొన్నారు.
విద్యాశాఖలో
పరస్పర బదిలీలు
కందనూలు: విద్యా శాఖలో పరస్పర బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లా నుంచి 55 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అవుతుండగా.. వేరే జిల్లాల నుంచి నాగర్‌కర్నూల్‌కు 55 మంది ఉపాధ్యాయులు రానున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జిల్లాల ఏర్పాటు తర్వాత జోన్లను విభజించింది. ఆ సందర్భంలో జోన్ల వారీగా బదిలీ చేయడంతో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందినవారు ఇతర జిల్లాలకు పెద్దఎత్తున బదిలీలు అయ్యారు. దీంతో వారంతా తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తమను సొంత జిల్లాకు బదిలీ చేయాలంటూ ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వడంతో దీంతో ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారు నాగర్‌కర్నూల్‌కు బదిలీపై వస్తే వారి స్థానంలో ఇక్కడ పనిచేస్తున్న వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. అయితే పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు కలిసి దరఖాస్తు చేసుకున్న వారివి మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట తదితర జిల్లాలకు 55 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. వారి స్థానంలో నాగర్‌కర్నూల్‌కు 55 మంది రానున్నారు.
బార్ల కోసం దరఖాస్తు చేసుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అచ్చంపేటలో రెన్యూవల్ కానీ రెండు బార్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గాయత్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బార్ ఎకై ్సజ్ టాక్స్ ఏడాదికి రూ.30 లక్షల రుసుం ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు రూ.లక్ష dirtrictproh&exiseofficer, nagarkurnool పేరిట దరఖాస్తు తీసి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు అందజేయాలన్నారు. దరఖాస్తుతోపాటు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, పాన్ కార్డు జతచేయాలని సూచించారు. దరఖాస్తులను ఈ నెల 29న కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన నూతన లైసెన్స్‌దారుడిని ఎంపిక చేస్తామని చెప్పారు.