
ఇష్టారాజ్యంగా కోచింగ్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: తమ పిల్లలు ఐఐటీ ఎట్రెన్స్ రాసి ఇంజినీర్ కావాలలని, నీట్ రాసి డాక్టర్ కావాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలు ప్రైవేటు విద్యాసంస్థలకు కాసులు కురిపిస్తున్నాయి. సీటు కోసం రూ.లక్షలు ఖర్చు చేయడానికై నా తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల ఈ కోర్సులకు డిమాండ్ రావడంతో ఇటు ప్రైవేటు ఇంటర్ కళాశాలలతో టు కోచింగ్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. అయితే ప్రభుత్వం గత నెల 29 నుంచి ఇంటర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. కానీ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాకేంద్రంలోని చాలా ప్రైవేటు ఇంటర్ కళాశాలల్లో విద్యార్థులకు ఐఐటీ, నీట్, ఎఫ్‌సెట్ వంటి వాటిపై కోచింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క కోచింగ్ సెంటర్‌కు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. అయినప్పటికీ యథేచ్ఛగా కళాశాలలు తెరిచి ఉదయం నుంచి రాత్రి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధగా వీటిని కొనసాగిస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్, విద్యాశాఖ అధికారులు వారికే వత్తాసు పలుకుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల కోచింగ్ సెంటర్లు కలిపి 30కిపైగా ఉండగా.. వీటిలో సుమారు 5వేల మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
అధిక మొత్తంలో ఫీజులు..
ఐఐటీ, నీట్ వంటి కోచింగ్‌లకు యాజమాన్యాలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇందు లో షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ పేరిట ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఐఐటీ, నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు రూ. 60 వేలకు పైగా, షార్ట్‌టర్మ్‌కు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో హాస్టల్ ఫీజు రూ.4 వేలు, మెటీరియల్ రూ.10 వేల వరకు అదనంగా దండుకుంటున్నారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు రెండు, మూడు బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు గురుకుల, నవోదయ, ఆర్మీ స్కూల్ వంటి వాటికి రూ.15–20 వేల వరకు వసూ లు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో కానిస్టేబుల్, వీఆర్వో, వీఆర్‌ఏ వంటి వాటికి శిక్షణ ఇస్తున్నారు.
విద్యార్థి సంఘాల నిరసన..
జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో సైతం కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గురువారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ, నీట్ తరగతులు నిర్వహిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. గతంలో పలు కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని, ఇవ్వాల్సిన మెటీరియల్ ఇవ్వలేదని, సరిగా తరగతులు చెప్పలేదని పలువురు విద్యార్థులు విద్యాశాఖతో పాటు పోలీస్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
మహబూబ్‌నగర్‌లో ఓ ప్రైవేటు కళాశాల ఎదుట నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
ఇంటర్ కళాశాలల్లో ఐఐటీ, నీట్ పేరిట పెద్దఎత్తున వ్యాపారం
ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కోచింగ్ పేరిట తరగతులు
నవోదయ, గురుకుల, కానిస్టేబుల్, వీఆర్వో ఉద్యోగాలకు సైతం..
ప్రభుత్వ అనుమతులు లేకుండానేయథేచ్ఛగా నిర్వహణ