కందనూలు: విద్యార్థులు చిన్ననాటి నుంచే సమాజసేవలో భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. నాగర్‌కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామంలో ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్)లో భాగంగా ఏడు రోజులపాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం ముగింపు కార్యక్రమానికి డీఎంహెచ్‌ఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని, సమాజ సేవ ద్వారా పొందే సంతృప్తి అమూల్యమన్నారు. వీరు గత ఏడు రోజుల నుంచి విద్యార్థులు గ్రామంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. గ్రామంలో విద్యార్థులు ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంతోషదాయకమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని, గ్రామాల్లో ఉండే సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అంజయ్య, వైస్ ప్రిన్సిపాల్ వనిత, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణారావు, డీపీఓ రేనయ్య, పంచాయతీ కార్యదర్శి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.