అచ్చంపేట రూరల్: పట్టణంలోని మినీ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. శనివారం అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివసేనారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరలోనే కోలుకుని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఐదు రాజీవ్ మినీ స్టేడియాలను మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు సమకూర్చుతామన్నారు. పట్టణంలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియాన్ని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. నల్లమల క్రీడాకారులకు పుట్టినిల్లు అని, ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చత్రునాయక్, మల్లికార్జున్, రాము, లక్ష్మణ్, పవన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.