కందనూలు/ చారకొండ: జిల్లావ్యాప్తంగా శుక్రవారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలోని 60 కేంద్రాల్లో ఫిజికల్ సైన్స్ పరీక్ష నిర్వహించగా 10,584 మందికి గాను 10,556 మంది హాజరవగా.. 28 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. ఉదయం 8 గంటలకు చారకొండ పోలీస్‌స్టేషన్ నుంచి జిల్లాలోని 60 పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో డీఈఓ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సీఎస్‌లు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి రోజువారి సూచనలు చేయాలన్నారు. అనంతరం వంగూరు, చారకొండ మండలాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరు, విద్యార్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల రికార్డులు, మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టిసింగ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. అనంతరం చారకొండలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందించే మధ్యాహ్నం భోజనం, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా అధికారులు నర్సింహులు, చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిపార్ట్‌మెంటల్ అధికారి మురళీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నేడు బీసీ కమిషన్
చైర్మన్, సభ్యుల పర్యటన
అచ్చంపేట: బీసీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు శనివారం అచ్చంపేటలో పర్యటిస్తారని బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాజానాజిమ్‌అలీ అప్సర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అచ్చంపేటకు చేరుకొని.. 2 గంటలకు బుడుబుడకల కమ్యూనిటీలతో సమావేశం అవుతారని చెప్పారు.
ప్రశ్నలకు సమాధానం వెతికేదే పరిశోధన
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో రెండో రోజు ఎంబీఏ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రీసెర్చ్ మెథడాలజీ, ప్రాజెక్టు వర్క్ రూపకల్పనపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాఫెసర్ సాయికుమార్ మాట్లాడుతూ పరిశోధన అనేది అనేక ప్రశ్నలకు సమాధానం వెతికేదని, పరిణామాత్మక, గుణాత్మక డేటాను విశ్లేషించే ఒక నిర్మాణాత్మక శాసీ్త్రయ విధానం అన్నారు. పరిశోధన పద్ధతిని రాయడానికి ముందు పరిశోధన పరిమితులు, నైతిక ఆందోళనలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రొఫెసర్ చేతన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ మంచి పరిశోధన పద్ధతి పరిశోధన ఫలితాల విశ్వసనీయత, చెల్లుబాటును నిర్ధారించడంలో కూడా సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆర్.నాగేశ్వర్‌రావు, డాక్టర్ ఎం.కృష్ణయ్య, డాక్టర్ జె.మాళవి, డాక్టర్ ఎ.కరుణాకర్‌రెడ్డి, డాక్టర్ అర్జున్‌కుమార్, డాక్టర్ జావీద్ మొహమ్మద్‌ఖాన్, డాక్టర్ నాగసుధ తదితరులు పాల్గొన్నారు.
‘పది’ పరీక్షలకు 28 మంది గైర్హాజరు