
ప్రతి చిన్నారికి టీకాలు అందేలా చూడాలి
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి గర్భిణి సురక్షిత మాతృత్వం పొందాలనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలని, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో నిర్వహించే ప్రత్యేక టీకాకరణ కార్యక్రమానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ సురక్ష మాతృత్వ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఆశా నోడల్ పర్సన్స్, ఆశా ఫెసిలిటేటర్స్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి టీకాకరణ చేయించుకుని, తప్పిపోయిన చిన్నారుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. భవన నిర్మాణ ప్రదేశాలు, ఇటుక, బొగ్గు బట్టీల దగ్గర వలస కుటుంబాల చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ నెల 21 నుంచి 26 వరకు, మే 21 నుంచి 28, జూన్ 23 నుంచి 30 వరకు ప్రతిరోజు టీకాకరణ నిర్వహించాలని సూచించారు. వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. ఏ విధంగా వినియోగించుకోవాలో తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్ డాక్టర్ అజహర్ మాట్లాడుతూ ప్రత్యేక టీకాకరణ శిబిరానికి అన్ని రకాల వ్యాక్సిన్, టీకాలు ఇవ్వాల్సిన చిన్నారులు, గర్భిణుల జాబితాను, తప్పనిసరిగా ఏఎన్‌ఎంలు తమ వెంట తీసుకువెళ్లాలన్నారు.
మాతృ మరణాలు తగ్గించేందుకు కృషి
మాతృ మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. ఆమె చాంబర్‌లో బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మెన్, ఊర్కొండ మండలంలోని రాచాలపల్లిలో ఇటీవల జరిగిన మాతృ మరణాలపై సమీక్షించారు. గర్భిణుల వివరాల నమోదు, రక్త, మూత్ర పరీక్షల వివరాలను, ప్రసవ చరిత్ర, ప్రత్యక్ష, పరోక్ష కారణాలు, మాతృ మరణాలను నివారించగల పరిస్థితులపై ఆరాతీశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గైనకాలజిస్ట్ నీలిమ మాట్లాడుతూ గర్భిణుల్లో ఏవైనా ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్య సిబ్బంది వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల, దానికి తగ్గట్టుగా ప్రసవ ప్రణాళిక చేయడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటదాస్, డాక్టర్ భీమానాయక్, ప్రోగ్రాం అధికారి లక్ష్మణ్, డీడీఎం సందీప్‌రావు తదితరలు పాల్గొన్నారు.