
అణగారిన వర్గాల అభ్యున్నతికి ఫూలే కృషి
నాగర్‌కర్నూల్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబాఫూలే ఎంతో కృషిచేశారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆడపిల్లలు చదువుకోవాలని, చదువు వల్లనే ఈ సమాజంలో ఆడపిల్లలకు భరోసా ఉంటుందని భావించి ఆ రోజుల్లోనే సీ్త్ర విద్య కోసం విశేష సేవలు అందించారన్నారు. శుక్రవారం ఫూలే జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతి బాఫూలే తన భార్యను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేసి మహిళా విద్యకు పాటుపడ్డారన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడానికి ఆయన చేపట్టిన సంస్కరణలు ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కుల, లింగ వివక్ష లేకుండా ప్రస్తుతం అందరి జీవనం కొనసాగుతోందని, వారు చూపిన దారిలో నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసి నలుగురికి ఉపయోగపడేలా మంచి పనులు చేసిన ప్రతిఒక్కరు మహనీయులుగా కీర్తించబడుతున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబాఫూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి కాజా నజీం అలీ అప్సర్, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.