
సమగ్ర విచారణ జరిగేనా?
కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. వినియోగదారుని వద్దకు వెళ్లిన బియ్యం తిరిగి రైస్ మిల్లులకు చేరుకోవడం అక్కడి నుంచి తిరిగి ప్రభుత్వానికి వెళ్లి మళ్లీ రేషన్ షాపుల ద్వారా వినియోదారులకు రావడం ఒక రీసైక్లింగ్ వ్యవహారంగా కొనసాగింది. ఈ పద్ధతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిష్ప్రయోజనంగా మారిపోయాయి. తలా పాపం తిలా పిడికేడు అన్న చందంగా రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి అధికారులు తదితరవి రేషన్ బియ్యం చుట్టూ తిరగడంతో అక్రమ రవాణాకు అడ్డు, అదుపు లేకుండా చేశాయి. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సన్నబియ్యం అందించాలనే సంకల్పంతో ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్న బియ్యం సైతం పక్కదారి పట్టి అధికారులకు పట్టుబడిన సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కల్వకుర్తి మండలంలోని మార్చాల రైస్ మిల్లులో ఏకంగా వెయ్యికిపైగా క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడటం కలకలం రేపింది.
మిల్లులో 90 శాతం..
అధికారులు దాడి చేసిన రైస్ మిల్లుకు నాలుగేళ్లుగా సీఎంఆర్ ధాన్యం ఇవ్వడం లేదని అధికారులు గుర్తించారు. అయితే సీఎంఆర్ కేటాయించని మిల్లులో రేషన్ బియ్యం ఎలా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ బియ్యం ఈ మిల్లుకు ఎలా వచ్చాయనే విషయాన్ని అధికారులు తేల్చాల్సి ఉంది. సదరు మిల్లులో ఏకంగా 90 శాతం రేషన్ బియ్యం ఉండటం గమనార్హం. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరికొన్ని మిల్లుల భాగోతం బయటకు వస్తుందని పలువురు చెబుతున్నారు. కొన్ని బ్రాండ్ల కవర్లను తొడిగి రేషన్ బియ్యం కల్వకుర్తిలోని కొందరికి అమ్మేందుకు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఆదివారం సైతం దాడులు నిర్వహించడం పక్కా సమాచారంతోనే అంటున్నారు. అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలుసుకున్న కొన్ని మిల్లుల యజమానులు తమ వద్ద ఉన్న రేషన్ బియ్యాన్ని వెంటనే ఇతర ప్రాంతాలకు తరలించారని తెలుస్తుంది. రేషన్ బియ్యం వ్యవహారంపై మరిన్ని నిజాలు తెలిసే విధంగా అధికారులు విచారణ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం
పట్టుబడటంతో కలకలం