
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
● ఈ నెల 8 నుంచి ప్రారంభమైన
పోషణ్ పక్వాడా
● 22 వరకు అంగన్‌వాడీల్లో
వారోత్సవాలు
● పౌష్టికాహారంపై గర్భిణులు,
బాలింతలకు అవగాహన
కందనూలు: జిల్లాలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలలో పోషకాహార లోపాన్ని గుర్తించి.. నివారించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలు, పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 8న ప్రారంభమైన ఈ అవగాహన కార్యక్రమాలు 22 వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 4,692, బాలింతలు 4,462, ఐదేళ్లలోపు చిన్నారులు 41,993 మంది ఉన్నారు.
తల్లిపాల ఆవశ్యకత..
అవగాహన కార్యక్రమాల్లో భాగంగా శిశువు జన్మించిన మొదటిరోజు వెయ్యి రోజుల వరకు ప్రాముఖ్యతను వివరించడం, పౌష్టికాహారం లోపంతో ఉన్న చిన్నారులను గుర్తించడం, అనుబంధ పోషకాహారం కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేయడం వంటివి చేస్తారు. ఇప్పటికే మహిళాభివృద్ధి, శిశు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో గర్భిణుల బరువు తీయడం, గర్భిణుల సంరక్షణపై భర్తలకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. 15 రోజులపాటు ఓ కార్యక్రమం చొప్పున పోషకాహార లోపాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నారు. ఈ పక్షోత్సవాల్లో అంగన్‌వాడీ టీచర్లతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, వ్యవసాయ శాఖల అధికారులు, సిబ్బంది భాగస్వా ములు అవుతున్నారు.
జిల్లాలోని ప్రాజెక్టుల వారీగా వివరాలిలా..
ప్రాజెక్టు గర్భిణులు బాలింతలు ఐదేళ్లలోపు
చిన్నారులు
నాగర్‌కర్నూల్ 1,552 1,362 15,552
కల్వకుర్తి 984 1,019 7,660
కొల్లాపూర్ 918 901 8,167
అచ్చంపేట 672 610 5,810
బల్మూర్ 566 570 4,804
అవగాహన కల్పిస్తున్నాం..
గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకునే పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి కేంద్రం పరిధిలో పోషకాహార లోపం, తక్కువ బరువుతో శిశువుల జననం, ఊబకాయ లోపం ఉన్నవారిని గుర్తిస్తాం. వారి పర్యవేక్షణతో పాటు పోషకాహారం అందిస్తాం. – రాజేశ్వరి జిల్లా సంక్షేమఅధికారి

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం