
దందాలకే ప్రాధాన్యం
●
రియల్ వ్యాపారాల్లో జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు తరచుగా వివాదాస్పదమవుతోంది. తరగతి గదుల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సింది పోయి.. కొందరు ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్ దందాల్లో, చిట్టీ వ్యాపారాల్లో ఆరి తేరుతున్నారు. ఈ క్రమంలో అదనపు సంపాదన కోసం అక్రమ దందాలకు పాల్పడేందుకు సైతం వెనకాడటం లేదు. అక్రమంగా చిట్టీల దందాకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసినట్టుగా తేలడంతో ఇటీవల జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూనే ప్రజల నుంచి రూ.కోటికి పైగా సొమ్మును వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించడంతో ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించి అతనిపై సస్పెన్షన్ వేటు విధించారు.
విచారణ పేరుతో కాలయాపన..
జిల్లాలోని కొందరు ప్రభుత్వ టీచర్లు చిట్టీలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో బిజిబిజీగా గడుపుతూ పాఠశాలల్లో విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా అధికారులు స్పందించడం లేదు. చాలా సందర్భాల్లో విచారణ పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. తమ గ్రామాల్లో టీచర్లు పాఠశాలలకు సరిగా రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మా బడి మూతబడింది..
మా తండాలోని ప్రభుత్వ పాఠశాలలో కొన్ని నెలలపాటు టీచర్ సరిగా రాలేదు. ఎప్పుడు చూసినా మీటింగ్ ఉందంటూ బయటకు వెళ్లేవాడు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చివరి పాఠశాల మూతబడింది. వచ్చే ఏడాదైనా తరగతులను ప్రారంభించాలి. – రమేశ్,
రూప్లాతండా, బిజినేపల్లి మండలం
చర్యలు తీసుకుంటున్నాం..
జిల్లాలో కొందరు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులపై వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశాం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల విధులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపడుతున్నాం.
– రమేశ్‌కుమార్, డీఈఓ
ఫైనాన్స్, చిట్టీలు, వడ్డీ వ్యాపారాల్లో తలమునకలు
పాఠశాలల్లో సమయపాలన పాటించడం లేదని ఫిర్యాదులు
ఇటీవల వెల్దండ మండలంలోని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
జిల్లాలో నామమాత్రంగా మారిన హాజరు ప్రక్రియ

దందాలకే ప్రాధాన్యం