
అంబేడ్కర్ ఆశయాలను సాధిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా జడ్జి రాజేష్‌బాబు అన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంఘ సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అన్నారు. అంబేడ్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు, మధుసూదన్‌రావు పాల్గొన్నారు.