
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి
చూపుతున్న లబ్ధిదారులు
● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్
● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం
● దొడ్డు బియ్యంతో పోల్చితే
పరవాలేదంటున్న వినియోగదారులు
● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు
● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన
సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10
అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం
వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్‌షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు.
సన్నవి ఇస్తుండడంతో
ఊరికొచ్చి తీసుకున్నాం..
నా భార్య, పిల్లలతో సహా 15 ఏళ్లుగా హైదరాబాదులో నివాసం ఉంటున్నాం. మేం మొత్తం ఐదుగురం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈ సారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. – స్వామి, వలస కూలీ,
దుప్పల్లి, మదనాపురం, వనపర్తి
అన్నం బాగానే అయింది..
గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల
నాణ్యతపై రాజీ పడొద్దు..
మేము కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాం. కుటుంబంలో నలుగురికి కలిపి వచ్చే 24 కేజీల రేషన్ బియ్యమే మాకు కడుపు నింపుతోంది. సన్నబియ్యం ఇవ్వడం సంతోషం. ఇప్పుడు వచ్చినవి వండుకుంటే అన్నం బాగానే అయింది. ప్రతి నెలా నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలి. ఎక్కడా రాజీ పడొద్దు.
– కాసింబీ,
గోప్లాపూర్, దేవరకద్ర, మహబూబ్‌నగర్
3 రోజుల్లోనే అయిపోయాయి..
రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేపట్టడంతో ఎప్పుడూ లేని విధంగా మూడు రోజుల్లోనే నా షాప్‌నకు వచ్చిన కోటా 171.33 క్వింటాళ్లు అయిపోయాయి. మిగతా రెండు షా పుల్లో కూడా మూడు రోజుల్లోనే బియ్యం స రఫరా జరిగిపోయింది. గతంలో బియ్యం పంపిణీకి 15 రోజులు పట్టేది. కోటా అయిపోయి న కూడా లబ్ధిదారులు వస్తున్నారు. అదనపు కోటా కోసం అధికారులకు తెలియజేశాం.
– సంజీవరెడ్డి, డీలర్, రేషన్‌షాప్ నంబర్–3, మద్దూరు, నారాయణపేట
జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో)..
జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ
మహబూబ్‌నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471
జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500
నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745
నాగర్‌కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813
వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992
మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521
రే.షా: రేషన్‌షాపులు,రే.కా: రేషన్‌కార్డులు, రే.షా.ప.అ: రేషన్‌షాపులకు పంపిణీ అయింది,
ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది
అవసరమైతే గడువు పెంపు..
ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.
నిర్ణీత కోటాకు
మించి డిమాండ్..

ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..

ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..

ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..

ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..

ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..