జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు

Published Mon, Apr 14 2025 12:37 AM | Last Updated on Mon, Apr 14 2025 12:37 AM

జిల్ల

జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ప్రతిఏటా వరిసాగు గణనీయంగా పెరుగుతోంది. అనుకున్న స్థాయిలో సాగునీరు అందుబాటులో ఉండడం, కేఎల్‌ఐ నీటితో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపడం వల్ల వరిపంట సాగు చేసే రైతుల సంఖ్య కూడా ఏటా రెట్టింపు అవుతోంది. గత యాసంగి సీజన్‌తో పోలిస్తే ఈసారి వరి సాగు పెరగడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌లో పంట చేతికి వచ్చే సమయం కావడంతో రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇటీవల అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ఆదేశించారు.

99 వేల మె.ట., మాత్రమే..

జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలపై రైతులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం, ప్రైవేటు వైపే మొగ్గు చూపడంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల లక్ష్యం నెరవేరలేదు. ఇది కాక జిల్లాలో సన్నరకాలపై రైతులు ఆసక్తి చూపడం, సన్న రకాలకు ప్రభుత్వం ఇచ్చే ధర, బోనస్‌ కలిపినా గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ప్రైవేట్‌లోనే ఈ ధాన్యాన్ని అమ్ముకున్నారు. 250 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం 99 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది అందుబాటులో లేకపోవడం, తేమ పేరుతో ధరలు తగ్గించడం, ఇతరత్రా సమస్యలు ఉన్నాయని ఆరోపణలు వినిపించినా అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానమిస్తున్నారు. రైతులు సన్నాలు పండించడంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపడం లేదని సమాధానమిస్తున్నారు. ఈ సీజన్‌లో మాత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాని ద్వారా 2,87,297 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యం నిర్దేశించారు. 234 కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో 70, పీఏసీఎస్‌ 160, మెప్మా ఆధ్వర్యంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

సన్నాలకు రూ.500 బోనస్‌

జిల్లాలో ఈ యాసంగిలో 1,53,164 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇందులో సన్నరకం 76,584 ఎకరాల్లో సాగు చేశారు. మొత్తంగా దీని ద్వారా 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే 2.87 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం క్వింటాల్‌ ఏ–గ్రేడ్‌ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించింది. దీంతోపాటు సన్న రకానికి బోనస్‌గా రూ.500 ఇవ్వనున్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చేటప్పుడు పట్టాదారు పాస్‌ పుస్తకం, బ్యాంకు ఖాతా, వీఆర్‌ఓ, ఏఈఓతో ధ్రువీకరణ పత్రం తేవాల్సి ఉంటుంది. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. తర్వాత చెల్లింపులు చేస్తారు.

అందుబాటులో గన్నీ బ్యాగులు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కావాల్సిన గన్నీ బ్యాగులను అధికారులు సమకూరుస్తున్నారు. ధాన్యం సేకరణకు మొత్తం 47 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా.. ప్రస్తుతం 26 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ధాన్యం సేకరణ జరగుతున్న సమయంలో అవసరాన్ని బట్టి మిగతా వాటిని తెప్పిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వర్షం వచ్చినప్పుడు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు 4,670 అవసరం ఉండగా ప్రస్తుతం 2,600 అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

దిగుబడి అంచనా 3,50,635 మె.ట.,

జిల్లాలో సాగైన

వరి పంట

1,53,164

ఎకరాలు

ధాన్యం సేకరణ లక్ష్యం 2,87,297 మె.ట.,

ఏర్పాటు చేయనున్న

కొనుగోలు

కేంద్రాలు 234

ఏ–గ్రేడ్‌ ధాన్యం మద్దతు ధర రూ.2,320

సన్నాలు క్వింటాల్‌కు అందించే బోనస్‌ రూ.500

సాధారణ రకం

మద్దతు ధర రూ.2,300

ఊపందుకుంటున్న పంట కోతలు.. సేకరణకు చర్యలు

రేపటిలోగా పూర్తిస్థాయిలో కేంద్రాల ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశాలు

గత సీజన్‌లో కొనుగోలు కేంద్రాలపై ఆసక్తి చూపని రైతులు

అత్యధికంగా ప్రైవేట్‌

వ్యాపారులకే అమ్మకాలు

కొర్రీలు పెట్టొద్దు..

గతేడాది మాదిరిగా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం ధాన్యం సేకరించారు. ప్రభుత్వ ధర కంటే ప్రైవేట్‌ వ్యక్తులే గతేడాది అధిక ధరలకు కొనుగోలు చేశారు. తేమ శాతం, ధూళి పేరుతో గతేడాది సక్రమంగా కొనుగోలు చేయలేదు. ఈసారైనా ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులు పండించిన సన్నధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం మద్దతు ధర మరింత పెంచాలి.

– పెద్ద మశన్న, రైతు, గట్టురాయిపాకుల

రేపటి నుంచి ప్రారంభిస్తాం..

జిల్లాలో రైతుల నుంచి వరిధాన్యాన్ని సేకరించేందుకు 234 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తాం. మంగళవారం నుంచి అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.

– శ్రీనివాస్‌, డీఎస్‌ఓ

జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు 1
1/1

జిల్లాలో 1.53 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement