
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజలు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రతం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు వీరశేఖర్, పుల్లయ్య, ప్రభాకరచారి, అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య, మల్లికార్జున్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.