
కొత్త పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సకాలంలో ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు అనుగుణంగా ప్రస్తుత వేసవిలోనే పాఠ్యపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ రమేష్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లాకు కొత్త పాఠ్యపుస్తకాలు చేరుకుంటున్నాయని, ఈ మేరకు జిల్లాకేంద్రంలోని టెస్ట్ బుక్స్ గోదాంలో భద్రపరిచిన పాఠ్య పుస్తకాలను జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నర్సింహులుతో కలిసి డీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో మండల, జిల్లా పరిషత్, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు కలుపుకొని జిల్లాలో మొత్తం 939 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 72,641 మంది విద్యార్థులకు సుమారు 6 లక్షల వరకు ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్నారు. జిల్లాకు పుస్తకాలు వస్తున్నాయని, ఇప్పటి వరకు వివిధ తరగతులకు సంబంధించి 35,710 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయని, వచ్చే విద్యా సంవత్సరంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. మే నెలలో జిల్లాకు పూర్తిస్థాయిలో పుస్తకాలు వస్తాయని, ఇక్కడి నుంచి మండలాలకు, పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తామన్నారు. పుస్తకాల జాబితా ఎన్ని వచ్చాయి.. ఎన్ని పంపిణీ చేశారు.. ఏయే పాఠశాలకు ఎన్ని వెళ్లాయి.. తదితర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పారదర్శకంగా చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతానికి తీవ్ర కృషి చేస్తోందన్నారు.