అవస్థల ప్రయాణం
అంతర్ జిల్లాల దారిలో..
మహబూబ్‌నగర్– శ్రీశైలం, పెబ్బేరు– జడ్చర్ల మధ్య పెరిగిన రాకపోకలు
●
కేంద్రానికి ప్రతిపాదించాం..
స్టేట్ హైవేలను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అందులో ప్రధానంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాలుగు రోడ్లు ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనల్లో ఉన్న రహదారుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిసి రోడ్ల ఆవశ్యకతను వివరించాం. వీటికి త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.
– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్
అచ్చంపేట: అంతర్ జిల్లాల రహదారులు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఒకవైపు గుంతలు, మరోవైపు ప్రమాదకర మలుపులతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల రద్దీకి అనుగుణంగా అంతర్ జిల్లాల రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలనే ప్రతిపాదనలు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రధాన పట్టణాలు, పుణ్యక్షేత్రాలు వెళ్లేందుకు రెండు వరుసల రహదారులే దిక్కవుతున్నాయి. ఫలితంగా వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ప్రతిపాదనలకే పరిమితం..
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ నుంచి బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం మీదుగా అచ్చంపేట, మన్ననూర్ వరకు.. పెబ్బేరు నుంచి వనపర్తి జిల్లాకేంద్రం, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల వరకు రెండు వరుసల రహదారులు ఉన్నాయి. వీటిని జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉండగా.. కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు అలంపూర్ చౌరస్తా నుంచి డిండి, నల్లగొండ వరకు మరో జాతీయ రహదారి కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. మహబూబ్‌నగర్‌తోపాటు గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల ప్రజలు శ్రీశైలం– హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ రోడ్డుపై ప్రయాణించాలి. ఉమ్మడి జిల్లావాసులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. పెరిగిన వాహనాల రద్దీకి అనుగుణంగా రెండు వరుసల రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కనీస వేగంతో ఈ రోడ్డుపై ప్రయాణించడం కష్టతరంగా ఉంది. నిత్యం వందలాది వాహనాలు తిరిగే అంతర్ జిల్లాల రోడ్డును జాతీయ రహదారిగా మారిస్తే ప్రయాణికులు, వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది.
వీటితో అనుసంధానిస్తే..
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఎన్‌హెచ్–44, 167, 765 ఉన్నాయి. వీటికి అదనంగా భూత్పూర్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా చించోలి వరకు ఎన్‌హెచ్–167ఎన్, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు ఎన్‌హెచ్–167కే, కర్నూలు నుంచి షోలాపూర్ వరకు ఎన్‌హెచ్–150సీ జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. అలాగే భూత్పూర్ నుంచి ఎన్‌హెచ్–44, చించోలి 167–ఎన్ రహదారులను అనుసంధానిస్తూ.. మన్ననూర్ (శ్రీశైలం ఎన్‌హెచ్–765) వరకు 104 కి.మీ., రోడ్డును పొడిగించాలనే డిమాండ్ ఉంది. పెబ్బేరు ఎన్‌హెచ్– 44 నుంచి వనపర్తి, బిజినేపల్లి మీదుగా జడ్చర్ల ఎన్‌హెచ్–167 వరకు 74 కి.మీ., పుల్లూరు ఎన్‌హెచ్–44 నుంచి అలంపూర్, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట మీదుగా డిండి ఎన్‌హెచ్–765 వరకు, వనపర్తి నుంచి కొత్తకోట మీదుగా మంత్రాలయం వరకు 110 కి.మీ., ఎర్రవల్లి ఎన్‌హెచ్–44 నుంచి గద్వాల మీదుగా రాయచూర్ వరకు 67 కి.మీ., మరికల్ నుంచి నారాయణపేట మీదుగా రామసముద్రం ఎన్‌హెచ్–150 వరకు 63 కి.మీ., రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి జాతీయ రహదారులుగా మారితే ఆయా గ్రామాలు, పట్టణాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిసారిస్తే జాతీయ రహదారుల దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.
పుణ్యక్షేత్రాలను కలుపుతూ..
గడిచిన రెండు దశాబ్ధాల కాలంలో ఉమ్మడి జిల్లా ఎంతో ప్రగతి సాధించింది. అంతర్ జిల్లాల రోడ్లు జాతీయ రహదారులుగా మారితే పర్యాటకంగా, పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రజల రాకపోకలు, సరుకుల రవాణాకు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు శ్రీశైలానికి రావాలంటే మహబూబ్‌నగర్– అచ్చంపేట రోడ్డే దిక్కు. శ్రీశైలం, మద్దిమడుగు ఆంజనేయస్వామి, ఉమామహేశ్వర క్షేత్రం, మల్లెలతీర్థం, లొద్దిమల్లయ్య, సలేశ్వరం పుణ్యక్షేత్రాలు, పర్యాటకంగా విరాజిల్లుతున్న నల్లమల ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. ఇలా రాకపోకలు సాగించే వాహనాలకు మహబూబ్‌నగర్–అచ్చంపేట, పెబ్బేరు– జడ్చర్ల్ల మధ్య ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు మార్గాల్లో రోడ్ల సామర్థ్యానికి మించి వాహనాలు నడుస్తున్నాయి. ఫలితంగా వాహనాలు తక్కువ వేగంతో వెళ్లాల్సి వస్తుండటంతో కొద్ది దూరానికే ఎక్కువ సమయం గడిచిపోతోంది. వీటిని జాతీయ రహదారులుగా మార్చాల్సిన అవసరం ఉంది.
వాహనాల రద్దీకి అనుగుణంగా లేని రోడ్డు సౌకర్యం
ప్రతిపాదనలకే పరిమితమైన జాతీయ రహదారి డిమాండ్
దశాబ్ధాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అవస్థల ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment