విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ
తాడూరు: ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అమలు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకొని సమాజంలో రాణించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం రాష్ట్రీయ స్వస్త్ కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా జిల్లాలోని 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 50,780 విద్యార్థులను పరీక్షలు చేసి.. 18,093 మంది విద్యార్థిని, విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను రెండో విడత జిల్లాకేంద్రంతోపాటు అచ్చంపేటలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటి వైద్య నిపుణులచే మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో జిల్లాకు మొదటి విడతగా 8,091 కంటి అద్దాలు వచ్చాయని, వీటిని ఆర్‌బీఎస్‌కే మొబైల్ హెల్త్ టీంల ద్వారా పాఠశాలలకు పంపించి విద్యార్థులకు అందజేస్తామన్నారు. తాడూరు ఉన్నత పాఠశాలలో 19, కేజీబీవీ పాఠశాలలో 14 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అందజేశామన్నారు. కంటి అద్దాలను వాడే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి రవికుమార్, వైద్యులు సంతోష్ అభిరామ్, సిబ్బంది వెంకటస్వామి, విజయ్‌కుమార్, బాలాజీ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment