ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
నాగర్‌కర్నూల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ పథకాలను అందించే బాధ్యత అధికారులదేనని, ఎవరైనా పథకానికి దూరంగా ఉంటే, వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 46 సీఎం సహాయ నిధి చెక్కులు అందజేసి మాట్లాడారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
● జిల్లాకేంద్రంలో రూ.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న జిల్లా మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్పీ కార్యాలయ సమీపంలో అధునాతన సౌకర్యాలతో భవన నిర్మాణం చేపడుతున్నామన్నారు. మహిళా సంఘాలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు. అనంతరం ఎల్‌ఐసీ కార్యాలయం పక్కన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ నరేష్‌బాబు, మాజీ కౌన్సిలర్లు సునేంద్ర, నిజాం తదితరులు పాల్గొన్నారు.


