సిర్సనగండ్ల రామయ్య బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
చారకొండ: రెండవ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఏప్రిల్ 5 నుంచి 11వ తేదీ వరకు సీతారామచంద్రాస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ పాలక మండలితో కలిసి రెవెన్యూ, పోలీసు, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్టీసీ, ఫైర్, విద్యుత్, పంచాయతీరాజ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఆలయం వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేరు, మరుగుదొడ్లు, తాగునీటి ట్యాంకులను ఎమ్మెల్యే పరిశీలించారు. వాటి నిర్వహణపై శ్రద్ధ వహించాలని పాలక మండలికి సూచించారు. అదే విధంగా సీతారామచంద్రాస్వామిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ డేరం రామశర్మ, మండల నాయకు లు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, ఆలయ ఈఓ ఆంజనేయులు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ సంధ్య, పీఆర్ డీఈ బస్వలింగం, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఆర్టీసీ డీఎం సుభాషిణి, మాజీ జెడ్పీటీసీ వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.


