
అంగన్‌వాడీలు ఒంటిపూటే..
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం హాఫ్‌డే ప్రకటించడంతో పనివేళలు మార్చారు. గత నెల 15 నుంచే కొనసాగుతుండగా.. రెండు నెలల పాటు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కేంద్రాలు తెరిచి ఉంటున్నాయి. ప్రీ స్కూల్ కార్యక్రమాలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం కార్యక్రమాలు 12.30 వరకే పూర్తి చేయాలని సూచించారు. వేసవిలో ఎండ తీవ్రతకు చిన్నారులు అవస్థలు పడే అవకాశం ఉండటంతో ఒంటిపూట నిర్వహిస్తున్నారు. ఇది వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కేంద్రాలు తెరిచి ఉంచేవారు. ప్రస్తుతం ఒంటిపూట నిర్వహిస్తున్నందున చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఉదయం 11 నుంచి 11.30 వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 వరకు చిన్నారులు ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత టీచర్లు, ఆయాలు వార్షిక సర్వే, కుటుంబాల సందర్శన, ప్రీస్కూలు చిన్నారుల ప్రవేశాల నమోదు, బడి మానిన పిల్లల వివరాలు సేకరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
● జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, బల్మూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,131 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 46,229 మంది చిన్నారులు, 5,745 మంది గర్భిణులు, 3,772 మంది బాలింతలు ఉన్నారు.
ఒంటిపూటతో ఊరట..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు చాలావరకు పక్కా భవనాలు లేవు. అద్దె భవనాలు, పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, విద్యుత్ సౌకర్యం, కనీసం సరైన వెలుతురు, గాలి వసతి లేని కేంద్రాలు ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేక ఇళ్ల నుంచే సీసాల్లో తెచ్చుకుంటున్నారు. ఎండాకాలంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలే కాకుండా చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సైతం ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఒంటిపూట కేంద్రాల నిర్వహణ చిన్నారులకు ఉపశమనంగా మారింది. అలాగే ఎండ తీవ్రతకు అనుగుణంగా మే నెలలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాలు కొనసాగిస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఒంటిపూట నిర్వహిస్తున్నాం. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలిచ్చాం. సమయ పాలన పాటించి చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని సూచించాం. వారు నిర్దేశిత చార్ట్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. – లక్ష్మి, సీడీపీఓ, అచ్చంపేట
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
ఎండ నుంచి
చిన్నారులకు ఉపశమనం
పని వేళల్లో మార్పు.. మే 31 వరకు కొనసాగింపు