కందనూలు/ అచ్చంపేట: జిల్లాలో పదో తరగతి పరీక్షలు అత్యంత పారదర్శంగా జరుగుతున్నాయని, పోలీస్‌స్టేషన్ నుంచి ప్రశ్నపత్రాల తరలింపు అత్యంత కీలకం అని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా శనివారం డీఈఓ కార్యాలయం నుంచి ఉదయం 8 గంటలకు సీఎస్, డీఓలతో వైర్‌లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోరోజు శనివారం సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్ష 60 కేంద్రాల్లో నిర్వహించగా.. 10,551 మంది విద్యార్థులకు గాను 10,527 మంది హాజరవగా.. 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా జరిగేలా జిల్లావ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని, జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టిసింగ్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. అలాగే అచ్చంపేటలోని పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. పరీక్షల విధుల్లో ఉపాధ్యాయులు అలసత్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్‌ఫోన్లు అనుమతించరాదని చెప్పారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.