
ఓపెన్ స్కూల్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
నాగర్‌కర్నూల్: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 20 నుంచి 26వ వరకు నిర్వహించే తెలంగాణ సార్వత్రిక ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలపై బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి పట్టణాల్లో పరీక్షల నిర్వహణకు 8 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓపెన్ స్కూల్ ఎస్‌ఎస్‌సీకి సంబంధించి 4 సెంటర్లలో 404 మంది, ఇంటర్మీడియట్ 4 సెంటర్లలో 736 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వివరించారు. అదే విధంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 307 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల థియరీ పరీక్షలు ఉంటాయన్నారు. ఆ తర్వాత ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. సాధారణంగా అన్ని పరీక్షల మాదిరిగానే సార్వత్రిక పరీక్షలకు నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. సమావేశంలో డీఈఓ రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖరరావు, జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివకుమార్ తదితరులు ఉన్నారు.