నాగర్‌కర్నూల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్లు దేవసహాయం, అమరేందర్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువవికాసం, తాగునీటిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలు అందరూ ఇల్లు కట్టుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాకుండా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని నిర్మాణంలో పురోగతి సాధించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్నట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వేసవికాలం యాక్షన్ ప్లాన్ ప్రకారం మున్సిపల్, పంచాయతీ, మిషన్ భగీరథ, ఎంపీడీఓలు గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తాగునీరు అందించాలని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పైపులైన్ లీకేజీ, మరమ్మతు వంటివి ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం ద్వారా జిల్లాలో అర్హులైన ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ
జిల్లాలో సన్నబియ్యం పంపిణీ పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామన్నారు. ఆదివారం వరకు వందశాతం అన్ని రేషన్ షాపులలో స్టాక్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. రేషన్ షాపుల దగ్గర సన్న బియ్యం పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగిందని, సన్న బియ్యం అందుకున్న ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని మంత్రికి కలెక్టర్ వివరించారు.