గ్రామాల్లో ఇంటి పన్నులతోనే సరిపెడుతున్న అధికారులు
●
కార్యదర్శులకు
ఆదేశాలు ఇస్తాం..
ఆస్తిపన్నుతోపాటు పంచాయతీలకు వచ్చే ఇతర ఆదాయ మార్గాలను వసూలు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు ఇస్తాం. పంచాయతీలు గ్రాంట్లు, ఇతరత్రా నిధుల కోసం వేచి చూడకుండా వారే సొంతంగా ఆదాయం సృష్టించుకునేందుకు వీలుంది. ఆ దిశగా అన్ని పంచాయతీల కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
– రాంమోహన్, డీపీఓ
కల్వకుర్తి: గ్రామ పంచాయతీల్లో కేవలం ఇంటి పన్నులు, తైబజార్ ద్వారానే నిధుల సమీకరణ జరుగుతోంది. స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వానికి ఉన్నట్లే గ్రామ పంచాయతీలకు కొన్ని ఆదాయ వనరులు ఉంటాయి. ఇలా వచ్చిన ఆదాయంలో స్థానికులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర వసతులను కల్పించే స్వేచ్ఛ పంచాయతీలకు ఉంటుంది. కానీ, స్థానిక ప్రభుత్వానికి ఉండే హక్కులు, విధులను స్థానిక అధికారులే విస్మరించడం, ఉన్నతాధికారులు సైతం అవసరం లేదులే అన్నట్లుగా వ్యవహరించడం వంటి పరిణామాలు, స్థానిక ప్రభుత్వాలు అన్న పేరును చులకన చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలకు సంబంధించి 1998– 99 సంవత్సరంలో ఇళ్ల రివిజన్ చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఇంటి పన్నుల జాబితాను రివిజన్ చేయాల్సి ఉంటుంది. కానీ, దీనిని ఉన్నతాధికారులు విస్మరించడంతో ఇప్పటికీ పాత జాబితా ఆధారంగానే ఏటా పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు.
సేవా పన్నుపై నిర్లక్ష్యం
గ్రామ పంచాయతీల విభజనకు ముందు ఇంటి పన్నుల రికార్డులు అస్తవ్యస్తంగా నిర్వహించిన కారణంగా ఇంటి నంబర్లు ఇష్టానుసారంగా కేటాయించారు. ఫలితంగా కేటాయించిన ఇంటి నంబర్లు అన్నీ ఆన్‌లైన్‌లో కొంత వరకు నమోదు కాలేదు. గతంలో ఇంటి పన్నులు చెల్లించిన రశీదులు ఉన్నా.. ఆన్‌లైన్ ప్రక్రియలో నమోదు కాని కారణంగా అలాంటి ఇళ్ల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. అలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అది కాస్తా ఇంటి పన్నుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. కానీ, గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఇంటికి సేవలు అందిస్తున్నందున ఇంటి నంబరు లేని ఇళ్ల నుంచి మెమో నంబర్ 512 ప్రకారం సేవాపన్ను పేరుతో పన్ను వసూలు చేయాలని నూతన పంచాయతీరాజ్ చట్టం–2018లో ప్రభుత్వం పేర్కొంది. కేవలం నూతన ఇంటికి విద్యుత్ సౌకర్యం అవసరమైన సమయంలో అరకొరగా సేవాపన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఆ తర్వాత కూడా ఆయా ఇళ్ల నుంచి నెలకు రూ.200 సేవాపన్ను వసూలు చేయాలన్న నిబంధనలను విస్మరిస్తున్నారు.
ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే..
గ్రామ పంచాయతీలు ఇంటి పన్నులు మాత్రమే ఆదాయ వనరుగా చూస్తూ ఇతరత్రా వనరులను విస్మరిస్తున్నానే చెప్పాలి. ఫలితంగా ప్రతి పనికి ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక స్థానిక ప్రభుత్వ హోదాను దిగజారుస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీల్లో ఆదాయ వనరులపై సమీక్ష నిర్వహించి పూర్తిస్థాయిలో వసూలు చేస్తే పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టిగా సాధించే అవకాశం ఉంది.
ఊసేలేని సేవాపన్ను, కొలగారం
వంటి సేవల రుసుం
ఇతర ఆదాయ మార్గాలనూ
పట్టించుకోని వైనం
ప్రభుత్వ గ్రాంట్లపైనే ఆధారపడుతున్న పంచాయతీలు
1998– 99 నాటి ఇళ్ల
రివిజన్ జాబితా ఆధారంగానే
పన్నుల వసూలు